సీఐడీ అధికారులను మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు లెక్క చేయడం లేదు. విచారణకు రావాలని ఒకటికి రెండుసార్లు నోటీసులు ఇచ్చినా, ఆయన మాత్రం డోంట్ కేర్ అన్నట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. దీంతో సీఐడీ అధికారులకు మళ్లీ మళ్లీ నోటీసులు ఇచ్చే పని తప్ప, మరేమీ చేయలేని నిస్సహాయ స్థితి.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాలకప్రతిపక్ష పార్టీలు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 7న తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియా సమావేశం నిర్వహించారు.
తిరుపతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనని మాటలను అన్నట్టు మత విద్వేషాలు రగిల్చే రీతిలో మార్ఫింగ్ చేసిన వీడియో, ఆడియో టేపులను దేవినేని ఉమా ప్రదర్శించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నారాయణరెడ్డి ఈ నెల 9న సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు దేవినేని ఉమాపై సీఐడీ అధికారులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం విచారణకు కర్నూలుకు రావాలని చాలా తక్కువ సమయం ఇచ్చి నోటీసు జారీ చేశారు. అప్పుడు దేవినేని వెళ్లలేదు. ఆ తర్వాత ఈ నెల 19న విచారణకు రావాలని మళ్లీ నోటీసు పంపారు.
అయినప్పటికీ సీఐడీ విచారణకు దేవినేని ఉమా కర్నూలు వెళ్లలేదు. దీంతో మరోసారి ఆయనకు నోటీసు అందించనున్నట్టు దర్యాప్తు అధికారి రవిశంకర్ తెలిపారు. కేసులు పెట్టడం, చివరికి ఏమీ చేయలేక దేవినేని ఉమాలాంటి వాళ్లను హీరోలు చేయడం జగన్ సర్కార్‌కు ప్యాషనైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏ రకంగా కేసులు పెడతారో తెలియదు కానీ, ఇంత వరకూ ఏ ఒక్కర్నీ జైలుపాలు చేసింది లేదని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు.