తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో దొంగ ఓట్ల వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ముఖ్యంగా తిరుపతి నగరంలో అధికార పార్టీ భారీగా దొంగ ఓట్లు వేసుకుందని ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెట్టాయి.
నకిలీ ఓటరు కార్డులను ముద్రించి దొంగ ఓట్లకు తెగబడ్డారని, కొన్ని ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు టీడీపీ, బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఈ ఆదేశాల మేరకు నెల్లూరు కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్రధర్‌బాబు విచారణ జరిపారు. అనంతరం ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించినట్టు చక్రధర్‌బాబు తెలిపారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరిగిన సంఘటనలపై ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ల ద్వారా నివేదికలు తెప్పించుకుని, అధ్యయనం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించినట్టు ఆయన తెలిపారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్‌ను రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని, పెద్ద హాళ్లలో పది టేబుళ్లు ఏర్పాటు చేస్తు న్నామని ఆయన చెప్పారు. దీంతో నివేదిక ఎలా ఉంటుందో తెలిసిపోయింది. అన్నీ సక్రమంగా జరిగాయని, ఇక కౌంటింగే తరు వాయి అని కలెక్టర్ తన నివేదిక ద్వారా చెప్పకనే చెప్పినట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు చక్రధర్బాబుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎక్కడా జరగని విధంగా పారదర్శకతతో తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉప ఎన్నిక జరిగినట్టు నెల్లూరు కలెక్టర్ చక్రధర్‌బాబు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
ఇంతగా అక్రమాలు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘం ఉదాసీన వైఖరితో వ్యవహరించడం దారుణమన్నారు. దీన్ని బట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి తిరుపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ఎలాంటి నివేదిక వెళ్లి ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు.