వాళ్లు చేసేది ఏం ఉద్యోగం? గోనె సంచులు మోసే ఉద్యోగమా, ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు వెళ్లి తలుపులు కొట్టడమా? అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎవరి గురించైతే అవహేళనగా మాట్లాడారో, వారే తనకిప్పుడు ప్రధాన ప్రత్యర్థులనే విష యాన్ని గ్రహించారు.
గ్రామ/వార్డు వాలంటీర్ల గురించి చంద్రబాబు నాడు వెటకరించిన సంగతి తెలిసిందే. బహుశా తమను చంద్రబాబు అవమానించారనే కసో లేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అభిమానమో స్పష్టంగా చెప్పలేం కానీ, టీడీపీకి రాజకీయ సమాధి కట్టేందుకు వాలంటీర్లు ఒక్కో ఇటుక పేర్చుతున్నారన్నది మాత్రం నిజం.
తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ నాయకులు రెండు లక్షల నకిలీ ఓటరు గుర్తింపు కార్డు లను స్వయంగా ముద్రించి, పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించారని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ప్రధానంగా వాలంటీర్లపై చంద్రబాబు ఆరోపణలు చేయడం గమనార్హం.
చనిపోయిన, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితాలో గ్రామ/ వార్డు వాలంటీర్లు గుర్తించారని చంద్రబాబు ప్రస్తావించారు. ఆ సమాచారాన్ని వైసీపీ నాయకులకు అందజేస్తే, వారు నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు సిద్ధం చేశారనేది బాబు ప్రధాన ఆరోపణ.
ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. అయితే లక్షలాది మంది నిరుద్యోగులకు సొంత ఊళ్లలోనే ఉద్యోగాలు ఇచ్చారన్న అక్కసో లేక మరేతర కారణమో తెలియదు కానీ, వాలంటీర్ల మనసులు గాయపడేలా బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోనె సంచులు మోసేవాళ్లు, తమ పార్టీకి రాజకీయ పాడె కడతారని చంద్రబాబు అసలు అంచనా కట్టలేదు. కానీ మేల్కొనేసరికి వాలంటీర్ల వల్ల భారీ డ్యామేజీ జరిగిపోతోంది.
దీంతో ప్రధాన ప్రత్యర్థి జగన్ కంటే, ఆయన నియమించిన వాలంటీర్లను ఎదుర్కోవడం టీడీపీ నేతలకు కష్టమైంది. ప్రస్తుతం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక అనేది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. రానున్న రోజుల్లో వాలంటీర్ల వల్ల కలిగే నష్టం ఏంటో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు బాగా తెలిసొచ్చింది.
కానీ వారిని కట్టడం చేయడం ఎలా అన్నది పెద్ద టాస్క్‌గా మారింది. వాలంటీర్లను అదుపు చేయలేకపోతే మాత్రం …రానున్న ఎన్నికల్లో తాము భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే వాలంటీర్ల నుంచి ముంచుకొస్తున్న ముప్పును ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేయాల్సిందేనని టీడీపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.
ఎందుకంటే వాలంటీర్లతో ప్రభుత్వం స్వామి కార్యంతో పాటు పార్టీకి సంబంధించి స్వకార్యాలను కూడా పకడ్బందీగా చేయించు కుంటోంది. ఇంతకాలం జగన్ వదిలిన బాణం షర్మిల అని చర్చించుకునే వాళ్లు. ఇప్పుడు జగన్ వదిలిన బాణాలు వాలంటీర్లుగా టీడీపీ భావిస్తోంది. ఆ బాణాలతో టీడీపీ విలవిలలాడుతోంది. ఆ బాణాలు చేసే గాయాలకు ఎలాంటి పూత పూస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.