విమర్శలకు కరోనా విపత్కర పరిస్థితులు అడ్డంకి కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అంతా అలర్ట్ అయ్యారు. అయితే చంద్రబాబుకు మాత్రం కరోనా ఉధృతికి జగన్ అలసత్వమే కారణంగా కనిపిస్తోంది.
కరోనాను కూడా రాజకీయానికి వాడుకునే ఏకైక నేత చంద్రబాబే అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. చంద్రబాబు తాజా విమర్శలు చూస్తుంటే కోవిడ్ సృష్టికర్త జగనే అనేలా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. చంద్రబాబు విడుదల చేసిన ప్రకటనలో ఏముందో చూద్దాం.
“కరోనా పట్ల సీఎం జగన్ అలసత్వం ప్రదర్శించడం వల్లే ఏపీలో కొవిడ్ విలయతాండవం చేస్తోంది. ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు కొవిడ్ బారిన పడకుండా వారు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రణాళికాలోపం, అవగాహనా రాహిత్యంతోనే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.
తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం బయటకు రాకపోగా ఉద్యోగుల రక్షణకు ఎలాంటి శ్రద్ధ పెట్టకుండా తప్పనిసరిగా విధులకు హాజరుకావాలంటూ బెదిరించడం దుర్మార్గం. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
అయితే జగన్ అలసత్వం వల్లే ఏపీలో కోవిడ్ విలయతాండవం చేస్తోందని బాబు పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత కంటే దివాళాకోరుతనం మరొకటి లేదని ప్రత్యర్థులు మండిపడుతున్నారు. మరి తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ … ఇలా ఎక్కడ చూసినా కరోనా పెరిగిపోవడానికి కూడా జగనే కారణమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కనీసం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా రాజకీయాలను పక్కన పెట్టి చంద్రబాబు హూందాగా వ్యవహరించి ఉంటే గౌరవంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు చంద్రబాబు తన అనుభవాలను ప్రజాప్రయోజనాలకు సద్వినియోగం చేసి ఉంటే బాగుండేదనే టాక్ వినిపిస్తోంది.
అలా కాకుండా కొవిడ్ విలయతాండవానికి జగనే కారణమనే విమర్శల వల్ల చంద్రబాబు మరింత పలుచన అవుతారని నెటిజన్లు మండి పడుతున్నారు. ఇంకా నయం ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌కు జగనే కారణమని చంద్రబాబు ఆరోపించలేదనే వ్యంగ్య కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి.