కరోనా ఎఫెక్ట్.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు క్లాసుల్ని రద్దుచేసింది. ఈ నిర్ణయం రేపట్నుంచే అమల్లోకి వస్తుంది. ఈ…

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు క్లాసుల్ని రద్దుచేసింది. ఈ నిర్ణయం రేపట్నుంచే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు ప్రకటన చేశారు.

“పాఠశాలల నుంచే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందంటూ వైద్య శాఖాధికారులు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపట్నుంచి క్లాసులు సస్పెండ్ చేస్తున్నాం. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇప్పుడు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్లకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. థియరీ ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి.”

10వ తరగతి పరీక్షలు జూన్ లో ఉన్నాయని, ఇప్పటికే షెడ్యూల్ రిలీజైంది కాబట్టి, ప్రస్తుతానికైతే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను యథాతథంగా ఫాలో అవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. 

తెలంగాణ సర్కారు తరహాలో పరీక్షలు ఎందుకు రద్దుచేయడం లేదనే ప్రశ్నపై స్పందిస్తూ.. విద్యా సంవత్సరాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేశామని, స్కూల్ వర్కింగ్ డేస్ తగ్గకుండా చూశామని, కాబట్టి పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు. పైగా పరీక్షల్లేక, గ్రేడింగ్స్ లేక చాలామంది ఆర్మీలో ఉద్యోగాలు పొందలేకపోయారని మంత్రి తెలిపారు.

మరోవైపు కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే కొవిడ్ కమాండ్ కంట్రోల్ ను తిరిగి ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. దానికి చైర్మన్ గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఈయన టీటీడీ ఈవోగా కొనసాగుతున్నారు. 

అటు తెలంగాణలో, ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కరోనా నివారణ చర్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ప్యూపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తామే ఆదేశాలు జారీచేస్తామని హెచ్చరించింది.