మళ్లీ రాజకీయాలు షురూ.. మరి సినిమాల సంగతేంటి?

వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ వెళ్లారు పవన్ కల్యాణ్. ఆయన ఇండియాకు తిరిగొచ్చిన వెంటనే ఏం చేస్తారనే చర్చ 2 రోజులుగా నడిచింది. చంద్రబాబుకు బెయిల్ వచ్చింది కాబట్టి ముందుగా వెళ్లి పరామర్శిస్తారని…

వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ వెళ్లారు పవన్ కల్యాణ్. ఆయన ఇండియాకు తిరిగొచ్చిన వెంటనే ఏం చేస్తారనే చర్చ 2 రోజులుగా నడిచింది. చంద్రబాబుకు బెయిల్ వచ్చింది కాబట్టి ముందుగా వెళ్లి పరామర్శిస్తారని అంతా ఊహించారు. ఇప్పుడదే జరిగింది.

ఇటలీ నుంచి వచ్చిన వెంటనే నేరుగా చంద్రబాబు ఇంటికెళ్లి ఆయన్ను పరామర్శించారు పవన్ కల్యాణ్. ఆయన ఆరోగ్య స్థితి గురించి, జైలు జీవితం గురించి వాకబు చేశారు. దాదాపు గంటన్నర పాటు ఇద్దరు నేతలు ఏపీ రాజకీయాలపై చర్చించుకున్నారు. క్షేత్రస్థాయిలో కలిసి ఎలా ముందుకెళ్లాలనే అంశంతో పాటు.. ఉమ్మడి మేనిఫెస్టోపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చలు సాగాయి.

రాజకీయాలు రీ-స్టార్ట్.. మరి సినిమాల సంగతేంటి..?

ఇటలీ నుంచి తిరిగొచ్చిన వెంటనే రాజకీయాలు రీస్టార్ట్ చేశారు పవన్ కల్యాణ్. ఇది అందరూ ఊహించిందే. మరి సినిమాల పరిస్థితేంటి? అటు నిర్మాతలు కూడా పవన్ కల్యాణ్ కాల్షీట్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇటలీ వెళ్లడానికి కొద్ది రోజుల ముందే అన్ని షూటింగ్స్ ఆపేశారు పవన్ కల్యాణ్. ఇప్పుడు మళ్లీ ఆయన ఏ సినిమాకు టైమ్ కేటాయిస్తారో చూడాలి.

సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నారు పవన్. అటు హరీశ్ శంకర్ డైరక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా లైన్లో ఉంది. వీటి కంటే ముందే ప్రారంభమైన హరిహర వీరమల్లు సినిమా ఎప్పట్నుంచో వెయిటింగ్ మోడ్ లో ఉంది. ఎన్నికలకు ముందు ఈ సినిమాలన్నింటినీ పవన్ పూర్తిచేయాల్సి ఉంది.

ఇటు రాజకీయాలకు, అటు సినిమాలకు పూర్తిస్థాయిలో టైమ్ కేటాయించలేకపోతున్నారు పవన్. ఎప్పుడు ఏ పని పడుతుందో చెప్పలేకపోతున్నారు. దీంతో పవన్ సినిమాల్లో దేనికీ అధికారికంగా రిలీజ్ డేట్ ఇవ్వలేకపోతున్నారు మేకర్స్.