సెలెక్ట్ కమిటీ విషయంలో మండలి చైర్మన్ షరీఫ్ చివరి అస్త్రాన్నీ ప్రయోగించేశారు. తన అధికారానికి అడ్డుపడుతున్నారంటూ శాసనసభ ఇన్చార్జి కార్యదర్శి మీద గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. సెలెక్ట్ కమిటీలో అధికార పార్టీ మినహా ఇతర పార్టీల సభ్యులుగా ఎవరుండాలో నిర్ణయించి తను లేఖ పంపితే, ఆ లేఖను తనకే తిప్పి పంపారని, అందులోనూ తను ఇచ్చిన రూలింగ్ కు విరుద్ధమైన నిబంధలను పేర్కొని సెలెక్ట్ కమిటీ ఏర్పాటును జాప్యం చేస్తున్నారని షరీఫ్ గవర్నర్ కు కంప్లైంట్ ఇచ్చారట. ఇలా తన నియమాలను పాటించని శాసనసభ ఇన్ చార్జి కార్యదర్శిని సస్పెండ్ చేయాలని గవర్నర్ ను షరీఫ్ కోరారట!
ఇప్పటికే శాసనమండలిలో షరీఫ్ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు ఇప్పటి వరకూ జరగలేదు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పోరాడుతూ ఉంది. యనమల రామకృష్ణుడు వివిధ రూల్స్ మాట్లాడారు. ఇంతకీ యనమల ఎవరు? ఆయన శాసనమండలి చైర్మనా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.
ఇక ఇప్పుడు షరీఫ్ డైరెక్టుగా రంగంలోకి దిగారు. తన ఆజ్ఞ పాటించని వారిని సస్పెండ్ చేయాలని ఆయన గవర్నర్ ను కోరారట. అయితే మండలిలో తను ఇచ్చిన రూలింగ్ తన విచక్షణ అధికారాన్ని బట్టి అంటూ ఆయన ఒకసారి అన్నట్టుగా మీడియాలో వచ్చింది. అయితే శాసనసభ ఇన్ చార్జి కార్యదర్శి మాత్రం రూల్స్ ప్రకారం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కుదరదని అంటున్నారట! ఆయనేమో రూల్స్ అంటుంటే, ఆయనను సస్పెండ్ చేసేయాలని షరీఫ్ అంటున్నారు!
అయితే ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఒక అధికారిని గవర్నర్ సస్పెండ్ చేస్తారా? అసలు ఆ కోరిక కోరాల్సింది గవర్నర్ నేనా? షరీఫ్ ఫిర్యాదు మేరకు గవర్నర్ ఆదేశాలు ఇచ్చేస్తారా? సదరు అధికారి వివరణ తీసుకోరా? ఒకవేళ ఆ అధికారి తను పాటించిన రూల్స్ ను గవర్నర్ కు ఇచ్చే వివరణలో పేర్కొంటే..? ఈ సస్పెన్షన్ జరగకపోతే? అంతలోపే శాసనసమండలి రద్దుకు ఢిల్లీలో ఆమోదముద్ర పడితే? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభించవచ్చు!