మూడ్ ఉన్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేస్తాం, మిగతా సమయాల్లో పోటీకే దూరం అన్నట్టుగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తు శాశ్వతంగా దూరం అయినట్టుగా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తు మీద పోటీ చేసిన జనసేన ఆ తర్వాత సపోర్ట్ సేనగా తన పాత పాత్రలోకి వెళ్లిపోయింది.
తిరుపతి ఉప ఎన్నికలో అవకాశం ఉన్నా పోటీ చేయలేదు. అంతకు ముందు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో తిరుపతి బై పోల్ విషయంలోనే గాజుగ్లాసు గుర్తును మరో పార్టీ సొంతం చేసుకుంది. ఆ విషయంలో బీజేపీ అభ్యంతరం చెప్పినా .. కేంద్ర ఎన్నికల సంఘమే దాన్ని సీరియస్ గా తీసుకోలేదు.
ఎప్పుడో తోచినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు పర్మినెంట్ గుర్తులు ఉండవు అని సీఈసీ స్ఫష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఆ సంగతలా ఉంటే.. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీల్లో జనసేన పోటీ చేసే యత్నం చేసింది. అందుకోసం తమకు కామన్ సింబల్ కావాలని, తమ పార్టీ గతంలో పొందిన గాజుగ్లాసునే కేటాయించాని ఆ రాష్ట్ర ఎస్ఈసీని కోరిందట ఆ పార్టీ. అయితే .. జనసేన ట్రాక్ రికార్డును బట్టి ఆ పార్టీకి కామన్ సింబల్ దక్కదని ఎస్ఈసీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.
ఇప్పుడే కాదు.. 2025 వరకూ ఇక మళ్లీ ఇప్పట్లో జనసేన గాజుగ్లాసు మీద కానీ, కామన్ సింబల్ మీద కానీ పోటీ చేసే అవకాశాలు లేవని కూడా తేల్చి చెప్పిందట తెలంగాణ ఎస్ఈసీ. కేవలం జనసేనకే కాదు.. పలు పార్టీలకు కూడా కామన్ గుర్తులు రద్దు అయినట్టుగా తెలుస్తోంది.
ఇది వరకటి ఎన్నికల్లో కనీస స్థానాల్లో పోటీ చేయకపోవడంతోనే, కనీసం పది స్థానాలకు కూడా పోటీ చేయని పార్టీలన్నింటికీ కామన్ సింబల్ ను ఎస్ఈసీ రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. వీటిల్లో జనసేన కూడా ఉంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో, ఇతర మున్సిపాలిటీల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో గాజుగ్లాసు గుర్తును తమకు కేటాయించాల్సిందిగా కోరింది.
అయితే జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, అంతకు ముందు కూడా ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ఆ పార్టీకి కామన్ సింబల్ సాధ్యం కాదని తెలుస్తోంది. పార్టీలకు కామన్ సింబల్ కేటాయించడం విషయంలో ఎన్నికల సంఘం వద్ద నిర్ధుష్టమైన ప్రమాణాలున్నాయి.
కనీస ఓట్ల శాతం పొందడం, లెక్కల ప్రకారం పోటీ చేసే పార్టీలకు మాత్రమే కామన్ సింబల్ లభిస్తూ ఉంటుంది. అయితే జనసేన కేవలం సపోర్ట్ సేనే కాబట్టి దానికి కామన్ సింబల్ లభించేట్టుగా లేదు.తిరుపతి ఉప ఎన్నికలోనే గాజుగ్లాసు గుర్తును మరో పార్టీ పొందగా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా జనసేనకు కామన్ గుర్తు దక్కే అవకాశాలు లేవని తెలంగాణ ఎస్ఈసీ నిర్ణయాన్ని బట్టి స్పష్టం అవుతోంది. 2025లోపు జనసేన ఏవైనా ఎన్నికల్లో పోటీ చేసి స్పష్టమైన ఓటు బ్యాంకును పొందే వరకూ మళ్లీ ఆ పార్టీకి కామన్ సింబల్ దక్కే అవకాశాలు లేవని కూడా తెలుస్తోంది.