హార్ట్ అటాక్ గురై ఆసుపత్రిలో చేరిన తమిళ హాస్యనటుడు వివేక్(59) మరి లేరు. ఐసీయూలో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు వివేక్. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. శనివారం ఉదయం వివేక్ మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు.
తమిళంలో స్టార్ కమేడియన్ గా వెలిగారు వివేక్. కే బాలచందర్ సినిమాల ద్వారా తెరకు పరిచయమైన వివేక్, బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వివేక్ నటించిన టాప్ టక్కర్ అనే సీరియల్ తెలుగులోకి కూడా అప్పట్లోనే అనువాదం అయ్యింది. సన్ నెట్ వర్క్ వారు రూపొందించిన ఈ సీరియల్ ఆదివారం ఉదయాల్లో తెలుగులో జెమినీ టీవీలో ప్రసారం అయ్యేది. ఆ తర్వాత పలు అనువాద సినిమాలతో వివేక్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రత్యేకించి తెలుగులో హిట్టైన 'వాలి' సినిమాలో వివేక్ చేసిన పాత్ర బాగా ఆకట్టుకుంది.
అనేక అనువాద సినిమాలతో వివేక్ తెలుగువారిని అలరించారు. అపరిచితుడు, శివాజీ వంటి శంకర్ సినిమాల్లో వివేక్ చేసిన పాత్రలు బాగా పేలాయి. సెటైరిక్ కామెడీకి కేరాఫ్ అయ్యారు వివేక్. ఒక దశలో తమిళంలో హీరో తరహా పాత్రల్లో కూడా కనిపించాడు. మలయాళంలో హిట్టైన తెన్ కాశీపట్టణం సినిమా తమిళ వెర్షన్ లో ఒక హీరో పాత్రలో వివేక్ కనిపించాడు. మలయాళంలో ఆ రోల్ ను దిలీప్ చేయగా, తమిళంలో వివేక్ చేశారు. తెలుగులో అదే పాత్రలో హీరో వేణూ కనిపించారు. తక్కువగానే అయినా హిట్టైన అనువాద సినిమాలతో వివేక్ తెలుగు వారిలోనే మంచి గుర్తింపును పొందారు. తమిళంలో కమేడియన్ గా స్టార్ స్టేటస్ పొందారు. 59 యేళ్ల వయసులో తమిళ చిత్ర ప్రియులకు శోకాన్ని మిగిలుస్తూ వివేక్ మరణించారు.
మరోవైపు గుండెపోటుకు గురవ్వడానికి కాస్త ముందు కూడా వివేక్ కరోనా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. కోవ్యాగ్జిన్ వేయించుకున్న వివేక్ వ్యాక్సినే అందరినీ కాపాడుతుందని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. వివేక్ కు వ్యాక్సినేషన్ చేయడానికీ, హార్ట్ అటాక్ రావడానికీ సంబంధం ఉండకపోవచ్చని వైద్యులు చెబుతున్నారట. వివేక్ తో పాటు అదే హాస్పిటల్ లో అదే రోజు 830 మందికి కోవ్యాగ్జిన్ ఇచ్చినట్టుగా ఇతరుల్లో ఎలాంటి దుష్ప్రభావాలూ చోటు చేసుకోలేదని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.