ఒకట్రెండు కాదు…ఏకంగా మూడు వారాలు. ఒక కుటుంబంలో ముగ్గురి జాడ కనిపించలేదు. అయినా ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. వాళ్లేమీ మామూలు కుటుంబానికి చెందిన మనుషులు కాదు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబం. సమాజంలో పలుకుబడి, పరపతి ఉన్న కుటుంబం. టూర్‌కు పోయారని భావిస్తే….శాశ్వతంగా ఎవరికీ అందనంత సుదూరాలకు వెళ్లిపోయారని తెలిసి బంధువులు, మిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఏడేళ్ల క్రితం కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా, ఇప్పుడు దంపతులతో పాటు కూతురు కూడా జలసమాధి అయ్యారు. చివరికి ఆ కుటుంబ సభ్యుల జీవితం విషాదాంతమైంది.
కీర్తన కోసం వెతికితే…
పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్, కీర్తన దంపతులు ఆదివారం రాత్రి బైక్‌పై కరీంనగర్ నుంచి గన్నేరువరం బయల్దేరారు. అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ వద్దకు రాగానే బైక్ లైటు వెలుతురుకు భారీగా పురుగులు వచ్చాయి. ప్రదీప్ కళ్లలో పురుగులు పడ్డాయి. దీంతో బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అటు వెళ్తున్న ఎల్‌ఎండీ పెట్రోలింగ్ పోలీసులు కాలువలో కొట్టుకుపోతున్న ప్రదీప్‌ను కాపాడారు. కీర్తన గల్లంతయ్యారు.
ఆమె కోసం గాలించేందుకు ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి కాలువకు నీటి విడుదల నిలిపివేయించారు. గజఈతగాళ్లు కీర్తన కోసం గాలించారు. మానకొండూరు మండలం ముంజపల్లి వద్ద కీర్తన మృతదేహం దొరికింది. కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో ఓ కారు బయట పడింది. పోలీసులు అక్కడకు చేరుకుని కారుని బయటకు తీయించారు. కారు నెంబర్ ఆధారంగా అది సత్యనారాయణరెడ్డి పేరున ఉన్నట్టు గుర్తించారు.
ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి స్వయానా బావ అని తెలుసుకున్నారు. ఈ విషయమై పోలీసులు ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చిన మనోహర్‌రెడ్డి.. కారును పరిశీలించి తన బావ కారుగా నిర్ధారించారు. అందులో ఉన్న మూడు మృతదేహాలు తన చెల్లి రాధ (50), బావ సత్యనారాయణరెడ్డి (55), వారి కుమార్తె సహస్ర (21)గా గుర్తించి కన్నీటిపర్యంతమయ్యారు.
గతనెల 27న ఇంట్లో నుంచి వెళ్లారని, అప్పటినుంచి తెలిసినవారి ఇళ్లలో ఆరా తీస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ వెళ్తున్నట్టు పొరుగువారికి చెప్పారని, ఆ క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి ఉంటారని పేర్కొన్నారు. సంఘటనపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఆత్యహత్య చేసుకునేందు ఇబ్బందులు కూడా వారికి లేవని వెల్లడించారు. తన సోదరి కుటుంబం తరచుగా టూర్‌కు వెళుతుంటుందని, ఫోన్లు స్విచ్ఛాప్ అని వస్తుండటంతో దుబాయ్‌కి వెళ్లి ఉంటారని భావించామన్నారు.
మృతుల వివరాలివీ…
కరీంనగర్‌లో సాయితిరుమల ఆగ్రో ఏజెన్సీస్ సీడ్స్ ఆండ్ ఫెస్టిసైడ్స్ పేరుతో సత్యనారాయణరెడ్డి వ్యాపారం నిర్వహించేవారు. ఆయన భార్య రాధ కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రైమరీ పాఠశాలలో టీచర్. కుమార్తె వినయశ్రీ నిజామాబాద్‌లోని మేఘన డెంటల్ కాలేజీలో బీడీఎస్ చివరి సంవత్సరం విద్యార్థిని. కాగా బీటెక్ చదువుదున్న వారి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం సిరిసిల్లలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
అప్పటి నుంచి ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ బాధను మరిచిపోయేందుకు తరచూ ఆ కుటుంబం టూర్‌లకు వెళుతుంటుందని బంధువులు, మిత్రులు చెబుతున్న మాట. కీర్తన అనే మహిళ మృతదేహం కోసం వెతక్కపోతే…ఈ ముగ్గురి ఆచూకీ ఎప్పటికీ దొరికేదో అనే ప్రశ్న తలెత్తుతోంది. చివరికి ఒక కుటుంబ మొత్తం ప్రమాదంలోనే కడతేరింది. ఆ విధంగా సత్యనారాయణరెడ్డి కుటుంబ జీవితం విషాదాంతమైంది.