విశాఖ మీద ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. పరిపాలనా రాజధానిగా విశాఖను ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపధ్యంలో విశాఖ సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం కార్యాచరణను రూపకల్పన చేసింది.
అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్న భోగాపురం నుంచి విశాఖ దాకా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రెండింటి మధ్య ప్రధాన రహదాని నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
అదే విధంగా బైపాస్ రోడ్లు, మెట్రో ట్రామ్ వ్యవస్థలతో అద్భుతమైన ప్రణాళికలను కూడా రూపకల్పన చేస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురానికి యాభై కిలోమీటర్ల దూరం ఉంది.
ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ అభివృద్ధి పనులు చేపడితే రానున్న రోజుల్లో విశాఖ మరింతగా ప్రగతిపధంలో సాగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ మేరకు తగిన కార్యాచరణతో సిద్ధం కావాలని తాజా సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.