అప్పలకొండ-జోగినాథం: అనీల్ రావిపూడితో ‘ఎఫ్-4’

అప్పలకొండ: అరేయ్ జోగి! అనిల్ రావిపూడిని కలవాల్రా ఒకసారి. ఏర్పాటు చేస్తావా? Advertisement జోగినాథం: ఎందుకు? సెల్ఫీ దిగడానికా? అప్పలకొండ: కాదురా..ఎఫ్-4 కి కథ చెప్పడానికి. జోగినాథం: నువ్వా? అప్పలకొండ: ఏరా..చెప్పకూడదా? జోగినాథం: కథల్రాయడం…

అప్పలకొండ: అరేయ్ జోగి! అనిల్ రావిపూడిని కలవాల్రా ఒకసారి. ఏర్పాటు చేస్తావా?

జోగినాథం: ఎందుకు? సెల్ఫీ దిగడానికా?

అప్పలకొండ: కాదురా..ఎఫ్-4 కి కథ చెప్పడానికి.

జోగినాథం: నువ్వా?

అప్పలకొండ: ఏరా..చెప్పకూడదా?

జోగినాథం: కథల్రాయడం ఎప్పుడు మొదలెట్టావా అని షాకయ్యానంతే? 

అప్పలకొండ: ఇవాళే వచ్చిందిరా ఆలోచన. టైటిల్ ఎఫ్-4 అని ఫిక్స్ అయిపోయాను. అందుకే దైరెక్టరు అనిల్ రావిపూడి గుర్తొచ్చాడు. ఆయనైతేనే కరెక్టు. 

జోగినాథం: ఇంతకీ ఎఫ్-2 అంటే “ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్”…మరి ఎఫ్-4 అంటే?

అప్పలకొండ: ఫ్రస్ట్రేషన్- ఫ్రస్ట్రేషన్- ఫ్రస్ట్రేషన్- ఫ్రస్ట్రేషన్

జోగినాథం: నాలుగు ఫ్రస్ట్రేషన్లా? ఫన్ లేకుండా ఎవడు చూస్తాడ్రా?

అప్పలకొండ: చూస్తార్రా! ఇవాళే తెలిసింది. ఈ సబ్జెక్ట్ మీద నాలుగు వీడియోలు తెగ వైరల్ అయిపోయాయి. ఉపేంద్ర సినిమా టైపులో ఇరగ చూసేసారు. 

జోగినాథం: ఏం వీడియోల్రోయ్?

అప్పలకొండ: ఫస్ట్ ది మన బాలయ్య బాబు. ఎవరో కుర్రోడు ఫోటో తీసాడని లాగి లెంపకాయ కొట్టాడు. 

జోగినాథం: ఫోటొ తీస్తే కొట్టడమేంట్రా? 

అప్పలకొండ: అదే మరి ఫ్రస్ట్రేషన్ అంటే..

జోగినాథం: రెండోది…మన అశోక్ గజపతి రాజు గారు. 

అప్పలకొండ: ఆయనేం చేసార్రోయ్…అసలే రాయల్ ఫ్యామిలీ..పెద్ద రాజు గారు. 

జోగినాథం: ఫ్రస్ట్రేషన్ కి ఆ తేడాలేవీ తెలీవు జోగి. ఒక మహిళని లాగి లెంపకాయ కొట్టేసాడు…అది కూడా మహిళా దినోత్సవం రోజున. 

అప్పలకొండ: అయ్యో పాపం..ఇంతకీ ఆవిడ ఏం చేసింది?

అప్పలకొండ: ఏం చేసినా గానీ.. చట్టాన్ని చేతుల్లోకి తీసేసుకుని కొట్టేయడమే ఇక్కడ సబ్జెక్ట్…అదే ఫ్రస్ట్రేషన్ అంటే. 

జోగినాథం: మరి మూడోది?

అప్పలకొండ: జేసీ ప్రభాకర్ రెడ్డి…

జోగినాథం: అమ్మో…ఆయన చాలా హాట్ గురూ…లెంపకాయ కాదు..ఎవర్నో చితక్కోట్టేసి ఏడిపించేసుంటాడు. 

అప్పలకొండ: మరదే…తొక్క మీద కాలెయ్యడమంటే…ఇక్కడే పెద్ద ట్విస్టు..

జోగినథం: ఏంటది? 

అప్పలకొండ: పోలీసుల్ని కొట్టమని ప్రాధేయపడి..వాళ్లు కొట్టట్లేదని కింద కూర్చుని ఏడ్చేసారు పాపం. వీడియో కూడా ఉంది. 

జోగినాథం: అసలేం జరుగుతోందిరా? ఎందుకలా? ఇవన్నీ వింటుంటే నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేట్టుంది. 

అప్పలకొండ: హహహహ…అదేరా..ఫ్రస్ట్రేషన్ మహత్యం…ఆడియన్స్ అందరికీ ఫ్రస్ట్రేషన్ తెప్పించే సినిమా మనది. 

జోగినాథం: ఇంతకీ నాలుగో ఫ్రస్ట్రేషన్ వీడియో ఏంటి?

అప్పలకొండ: చూసావా..నువ్వు కూడా ఎలా కనెక్ట్ అయిపోయావో? ఫ్రస్ట్రేషన్ పెరిగే కొద్దీ మైండ్ ఇంకా ఫ్రస్ట్రేషన్ కోరుకుంటుంది…అదొక ఎడిక్షన్…

జోగినాథం: (అటు ఇటు ఫ్రస్ట్రేషన్ తో తిరుగుతూ) సరేలే..పాయింటుకి రా…

అప్పలకొండ: చంద్రబాబు నాయుడు గారు.

జోగినాథం: ఆయనకూడా విచిత్రంగా బిహేవ్ చేసారా?

అప్పలకొండ: గుంటూరు జనానికి సిగ్గు శరం లేదని నానా తిట్లూ తిట్టారు..

జోగినాథం: ఏ ఊళ్లో కూర్చుని తిట్టారు?

అప్పలకొండ: గుంటూరులోనే…వ్యాన్ మీద నిలబడి ..రోడ్డు మీద..మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో..

జోగినాథం: జనం ఊరుకున్నారా? అసలే గుంటూరోళ్ల పౌరుషం మామూలుగా ఉండదు కదరా? 

అప్పలకొండ: ఏమోరా…నాకు మాత్రం ఆ వీడియోలో నవ్వులు, కేరింతల్లాంటి అరుపులు వినపడ్డాయి. 

జోగినాథం: అదేంటి? కామెడీగా తీసుకున్నారా?

అప్పలకొండ: మే బీ 

జోగినాథం: అసలేం జరుగుతోందిరా రాష్ట్రంలో? ఒక్కళ్లు కూడా సహజంగా ప్రవర్తించడంలేదు. శాంతంగా ఉండేవాడు కొడుతున్నాడు, బెదరకొట్టేవాడు కొట్టమని ఏడుస్తున్నాడు, ఓట్లు అడగడానికి వెళ్లినవాడు జనం మొహం మీదే మీకు సిగ్గులేదంటాడు… అంతా జంబలకిడిపంబలాగ ఉంది. నాకు పిచ్చెక్కుతోంది.

అప్పలకొండ: బాలయ్యబాబు సహజంగానే ఉన్నాడులే జోగి…మరీ అంత ఫ్రస్ట్రేట్ అవ్వకు.

జోగినాథం: అదొక్కటే కొంచెం రీలీఫు. అయినా సరే చాలా ఫ్రస్ట్రేషన్ గా ఉంది..ఏం చెయ్యాలో చెప్పు. 

అప్పలకొండ: ఏమో నాకూ తెలీదు. ప్రస్తుతానికి వెంకీ ఆసనం వేసుకో. 

జోగినాథం: (వెంకీ ఆసనం వేస్తూ) దీంతో తగ్గకపోతే?

అప్పలకొండ: నువ్వు ఎలాగో అనీల్ రావిపూడితో మీటింగ్ ఫిక్స్ చేస్తావు కదా..వెళ్లి అడుగుదాంలే.