మహిళలపై జరిగే అకృత్యాలను నివారించడం ప్రధాన లక్ష్యంగా… ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకు వచ్చారు. అమ్మాయిలను వేధించారని ఆలోచన రావడానికే ఆకతాయిలు జడుసుకునే వాతావరణం ఉండాలని ఆయన అభిలషించారు. తెలంగాణ లో దిశ దుర్ఘటన జరిగితే.. అదే పేరుతో జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త చట్టం తీసుకు వచ్చారు. మహిళల భద్రత పట్ల తన కమిట్మెంట్ ఏమిటో ఆయన ఆ రకంగా స్పష్టంగా నిరూపించారు. దాని తాలూకు ఫలితాలు కనిపిస్తున్నాయి.
ఒక మహిళకు, ప్రయాణిస్తున్న బస్సు లో వేధింపులు ఎదురైతే.. దిశ యాప్ ద్వారా కంప్లైంట్ చేయడం … కేవలం ఎనిమిది నిముషాల వ్యవధిలో పోలీసులు ఆమె ప్రయాణిస్తున్న బస్సు దగ్గరకు చేరుకుని నిందితుడిపై కేసు నమోదు చేయడం విశేషం. కొత్త చట్టం, ఆధునిక సాంకేతికతను జోడించుకుని.. ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇది మంచి నిదర్శనం.
వివరాల్లోకి వెళితే…
ప్రభుత్వోద్యోగి అయిన ఒక మహిళ విశాఖపట్నం నుంచి విజయవాడకు సోమవారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. అదే బస్సులో ఆమె వెనుక సీట్ లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బసవయ్య నాయక్ అనే వ్యక్తి ఆమెతో వెకిలి వేషాలు వేయడం ప్రారంభించాడు. విసిగిపోయిన ఆమె తన మొబైల్ నుంచి దిశ యాప్ ద్వారా ఎమర్జెన్సీ సందేశం అందించారు. స్పందించిన పోలీసులు… ఆమె ప్రయాణిస్తున్న బస్సు ఏలూరు సమీపంలో ఉన్నది అని తెలుసుకుని స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. కేవలం ఎనిమిది నిమిషాల వ్యవధిలో వారు టోల్ గేట్ వద్దకు చేరుకోవడం… సదరు నిందితుడిపై కేసు నమోదు చేయడం ఆటోమేటిక్గా జరిగిపోయింది.
చిత్తశుద్ధితో ఒక చట్టాన్ని రూపొందించడం… చిత్తశుద్ధితో దాన్ని అమలు చేసే ప్రయత్నంలో భాగంగా ఆధునిక సాంకేతికతను కూడా జోడించడం అనే చర్యల వలన… ఇలాంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయో దీని ద్వారా మనకు అర్థమవుతోంది. స్మార్ట్ మొబైల్ అవకాశం ఉన్న ప్రతి మహిళ కూడా… ఇలాంటి ఉపయోగకరమైన దిశ యాప్ వంటివి డౌన్లోడ్ చేసుకోవడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. మంచి చట్టం రూపకల్పన చేసినందుకు ప్రభుత్వానికి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.