మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యర్థులతో పాటు జనాన్ని కూడా తిట్టిపోస్తున్నారు. నిన్న విజయవాడ నగర ప్రజలను ఆడిపోసుకున్న చంద్రబాబు …నేడు గుంటూరు నగర వాసులను కూడా విడిచిపెట్టలేదు. ఎన్నికల ముగింపు ప్రచారంలో భాగంగా చివరి రోజు ఆయన గుంటూరు వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జనంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనాన్ని ఏం తిట్టారో బాబు మాటల్లోనే …
“మాటల్లోనే మీకు రాజధాని కావాలి. చేతల్లో ఏం చేయరు. 460 రోజులకు పైగా రైతులు ఆందోళన చేస్తుంటే మీరు ఏం చేశారు. గుంటూరు వాసులకు స్వార్థం, పిరికితనం ఎక్కువ. రోషం లేదు. ఒక ఉన్మాది చేతుల్లో అమరావతి బలైంది.
ఓ రోజు జైలుకు వెళ్తే ఏమవుతుంది? నా మీద కూడా కేసులు పెట్టారు. నేను భయపడే సమస్య లేదు. గుంటూరు కార్పొరేషన్‌లో వైసీపీ గెలిస్తే అమరావతిని వారికి రాసిచ్చినట్టే. గుంటూరులో నానీ ఓడిపోతే వైసీపీ వాళ్లు భరితెగిస్తారు.
రెండువేల రూపాయలు ఎవరు ఇస్తే వాళ్లకి ఓటు వేస్తారా? గుంటూరు మిర్చి ఘాటు 10వ తేదీ ఎన్నికల్లో చూపించాలి. అపార్టుమెంట్లలో ఉండే వారు ఆలోచించాలి… ఎండలో మేమెందుకు నిలబడి ఓటు వేయాలని అనుకుంటే మీ కర్మ” అని చంద్రబాబు ప్రజల్ని బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు.
అమరావతి రాజధాని సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నంలో చంద్రబాబు విఫలమయ్యారు. రాజధాని విషయాన్ని గుంటూరు, కృష్ణా జిల్లాల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని అక్కడి ప్రజల్లో చొప్పించి తద్వారా అధికార పార్టీపై వ్యతిరేకత పెంచడానికి బదులు , ప్రజల్ని తిట్టడం కొసమెరుపు.
ఎన్నికల ముంగిట ఓటర్లను తిట్టడంతో తమకెక్కడ వ్యతిరేకతగా మారుతుందోననే భయం టీడీపీ అభ్యర్థుల్ని పట్టి పీడిస్తోంది. బాబు అసహనంతో విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో ఫలితం ఎలా ఉంటుందో ముందే చెప్పినట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.