సీఎం జగన్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భలే థ్రిల్లింగ్ లెటర్ రాశాడు. కాపులకు రిజర్వేషన్ కల్పించలేనని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తెగేసి చెప్పిన వైసీపీ నేత జగన్‌పై ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా జగన్‌కు ముద్రగడ రాసిన లేఖ చదివితే….నిజంగా ఇది కలా? నిజమా? అనే అనుమానం కలుగుతుంది.
ముద్రగడ లేఖలో జగన్‌ను ప్రశంసలతో మొదలు పెట్టాడు. ‘మీ పాలనలో హామీలు ఇచ్చిన వాటికి సరే, ఇవ్వని వాటికి ఎంతో తపనతో ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌కి ఆర్థిక బాధలు ఎన్ని ఉన్నా అమలు చేయడం సంతోషం’ అని ముద్రగడ పొగడ్తలతో ప్రారంభించి ఆశ్చర్యం కలిగించాడు.
మిమ్మల్ని అడగడం న్యాయం కాకపోయినా…
ముద్రగడ లేఖలో నిజాయితీ కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా కాపుల రిజర్వేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా 50 శాతానికి మించి ఉండకూడదని చెబుతున్న నేపథ్యంలో తాను అబద్ధాలు చెప్పి మోసం చేయలేనని జగన్ స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముద్రగడ డిమాండ్ అని కాకుండా అభ్యర్థించాడు. ఇంతకూ ఆయన ఏమి రాశాడంటే…
‘మాజాతికి సంబంధించిన బీసీ-ఎఫ్ ఫైలు కేంద్ర ప్రభుత్వం, హోంశాఖలో పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు…ఆ ఫైల్‌ను ఆమోదించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రిగా ఒక లేఖ రాయమని కోరుతున్నాను. హామీ ఇవ్వని మిమ్మల్ని అడగడం న్యాయం కాకపోయినా , మా జాతిలో యువత నిరాశకు చలించి అడగక తప్పడం లేదు’ అని ముద్రగడ తన లేఖలో విన్నవించుకున్నాడు.
సహజంగా ముద్రగడ లేఖలు ఘాటుగా ఉంటాయి. గతంలో చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ లేఖల్లోని వేడి కనిపించింది. తాజాగా జగన్‌కు రాసిన లేఖలో కూడా తన పిల్లలను చంద్రబాబు పాలనలో పోలీసులు కాళ్లతో, బూట్లతో తన్నారని గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే తన భార్య, కోడళ్లను ,కొడుకును చంద్రబాబు దయతో బూతులు తిట్టించారని, అవే తన ఆస్తులుగా మిగిలాయని ఆయన ఆవేదనతో కూడిన వ్యంగ్యాన్ని చొప్పించి జగన్‌కు లేఖ రాయడం విశేషం.
కానీ ఒక్కచోట కూడా జగన్‌ను విమర్శించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజంగా ముద్రగడ ఇలాంటి లేఖలు కూడా రాస్తాడా అనే అనుమానం కలగిలే రాయడం విశేషం.