నాగార్జున, నాని లాంటి ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్న సినిమా ఇది. కాస్త భారీ అంచనాలే ఉన్నాయి. మార్కెట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇన్ని అనుకూల అంశాలు ఉన్నప్పటికీ సంగీత దర్శకుడిగా మరోసారి మణిశర్మనే తీసుకున్నాడు నిర్మాత అశ్వనీదత్. ఎందుకని అడిగితే సెంటిమెంట్ అన్నాడు. కానీ ఇప్పుడు సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. దేవదాస్ ఫస్ట్ సింగిల్ తుస్సుమంది.
ఏ సినిమాకు సంబంధించి అయినా బెస్ట్ సాంగ్ నే ఫస్ట్ సాంగ్ గా విడుదల చేస్తారు. దేవదాస్ విషయంలో కూడా అదే చేశారు. “వారు, వీరు చూస్తూ ఉన్నా” అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను అనురాగ్, అంజూ సౌమ్య ఆలపించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించాడు. కానీ పాట ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. పదేళ్ల కిందటి ట్యూన్ ను తలపించింది.
ది బెస్ట్ అనుకున్న మొదటి పాటే ఇంత పేలవంగా ఉంటే ఇక మిగతా పాటల సంగతేంటో అని కళ్లు తేలేస్తున్నారు నాగార్జున ఫ్యాన్స్. మొత్తమ్మీద ఇప్పటివరకు ఫస్ట్ లుక్, టీజర్ తో దేవదాస్ పై వచ్చిన హైప్ మొత్తాన్ని ఈ ఒక్క పాట మింగేసింది. మళ్లీ సినిమాను లేపాలంటే ఇంకేదో చేయాల్సిందే.
మొన్నటికిమొన్న శైలజారెడ్డి అల్లుడు విషయంలో కూడా ఇదే జరిగింది. ఫస్ట్ సింగిల్ క్లిక్ అవ్వకపోవడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జ్యూక్ బాక్స్ మొత్తం విడుదల చేశారు. ఇప్పుడు దేవదాస్ విషయంలో కూడా ఇలానే చేస్తే బెటరేమో. రోజుకో సింగిల్ రిలీజ్ చేసి చేజేతులా అంచనాలు తగ్గించుకునే కంటే ఆ యాంగిల్ లో ప్రచారం చేయకుండా ఉండడమే మంచిది.