భారతీయ చలనచిత్ర రంగాన్ని సుసంపన్నం చేసిన ఆర్కే స్టూడియోస్ ను అమ్మేయాలని కపూర్ ఫ్యామిలీ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఈ విషయంలో రాజ్ కపూర్ వారసుల్లో ఎవరికీ ఎలాంటి అభిప్రాయబేధాల్లేవు. అందరూ అమ్మేసి వాటాలు పంచుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు రిలయన్స్, వయాకమ్ లాంటి సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలయ్యాయి.
ఆర్కే స్టూడియోస్ అమ్మేస్తే ఎంత వస్తుంది? ఎంతో పేరున్న ఈ సంస్థ ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముడుపోతుంది? రాజ్ కపూర్ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఎంత వాటా వస్తుంది? ప్రస్తుతం ఈ దిశగా ట్రేడ్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఆర్కే స్టూడియోస్ అనేది కేవలం సినీవారసత్వ సంపద మాత్రమేకాదు. రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే, దేశవాణిజ్య రాజధాని ముంబయి నడిబొడ్డున ఉన్న చెంబూరులో హాట్ కేక్ లాంటి 2 ఎకరాల స్థలం ఇది.
ప్రస్తుతం ముంబయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పీక్స్ లో ఉంది. ఎలా చూసుకున్నా ఈ రెండెకరాల స్థలానికి కనీసం 500 కోట్ల రూపాయలొస్తాయి. దానికితోడు ఇది ఎంతో ప్రముఖమైన స్టూడియో కాబట్టి బ్రాండ్ వాల్యూ దృష్ట్యా మరో 100 కోట్లు అదనంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా చూసుకుంటే, రాజ్ కపూర్ వారసుల్లో ప్రతి ఒక్కరికి తలా వంద కోట్ల రూపాయలు దక్కే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆర్కే స్టూడియోస్ పై రిలయన్స్, వయకామ్ సంస్థలు మాత్రమే దృష్టిపెట్టాడు. వీళ్లతోపాటు పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ స్టూడియోపై ఆసక్తి కనబరుస్తున్నాయి. మరోవైపు కొంతమంది రాజకీయ నాయకులు సైతం మధ్యవర్తుల ద్వారా హీరో రణబీర్ కపూర్ ను సంప్రదిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సుప్రసిద్ధ ఆర్కే స్టూడియోస్ ను ఎవరు దక్కించుకుంటారనే విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.