దర్శకుడు క్రిష్ బాలీవుడ్లో రూపొందిస్తోన్న సినిమా 'మణికర్ణిక'. 2019లో ఈ సినిమా విడుదల కానుంది. స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా 'మణికర్ణిక' తెరకెక్కుతోన్న సంగతి తెల్సిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అయితే, ఈ సినిమా తాజాగా వివాదాల్లోకెక్కింది. దానిక్కారణం, సినిమా క్లాప్ బోర్డ్ మీద దర్శకత్వం కేటగిరీలో దర్శకుడు క్రిష్ పేరు కాకుండా, హీరోయిన్ కంగనా రనౌత్ పేరు వుండడమే.
నిజానికి, 'మణికర్ణిక' సినిమా కంగనా రనౌత్ డ్రీమ్. ఈ సినిమాకి సంబంధించి అన్నీ తానే అయి వ్యవహరిస్తోంది. క్రిష్ దర్శకత్వంలోనే సినిమా తెరకెక్కుతున్నా, ఆయనది 'నామమాత్రమైన పాత్ర' మాత్రమేనని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ, ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడ్తోంది. ఈ నేపథ్యంలో 'మణికర్ణిక' టీమ్ ఓ క్లారిటీ ఇచ్చింది. అది కూడా కంగనా రనౌత్ ట్విట్టర్ అకౌంట్ (కంగనా వ్యక్తిగత అకౌంట్ కాదు.. కంగనా టీమ్ అకౌంట్ అది) ద్వారా కావడం గమనార్హం.
క్రిష్ ప్రస్తుతం వేరే సినిమా పనుల్లో బిజీగా వుండడం వల్ల (నందమూరి బాలకృష్ణతో స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నాడు క్రిష్) కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసమే, దర్శకత్వం అన్న చోట క్రిష్ స్థానంలో కంగన పేరు పెట్టామన్నది ఆ వివరణ సారాంశం. దీన్ని రీషూట్ అనుకోవాలా.? ప్యాచ్ వర్క్ అనుకోవాలా.? 'మణికర్ణిక' టీమ్ ప్యాచ్ వర్క్ మాత్రమేనని చెబుతున్నా, తెరవెనుకాల వ్యవహారం వేరేగా వుంటోందన్నది గాసిప్స్ కాలమ్స్‌లో విన్పిస్తోన్న మాట.
కంగనా అంటే వివాదాలకు కేంద్ర బిందువు. తెలుగులో కంగనా 'ఏక్ నిరంజన్' సినిమా చేసింది. పూరి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మళ్ళీ కంగనా తెలుగులో కన్పించలేదు. బాలీవుడ్లో మాత్రం అనూహ్యంగా స్టార్డమ్ సంపాదించుకుంది. ఆమెకు దక్కిన స్టార్డమ్ కంటే, ఆమె చుట్టూ వివాదాలే ఆమెను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ చేశాయనడం అతిశయోక్తి కాదేమో. ఇంతకీ, 'మణికర్ణిక' సినిమాని కంగనా ఏం చేస్తుందో.!