అధికారికం, అనధికారికం.. మధ్యలో పవన్ కల్యాణ్

చెగువేరా, భగత్ సింగ్ లాంటి ఆదర్శనీయుల ఫొటోల్ని గోడకు మాత్రమే తగిలించే పవన్ కల్యాణ్, నిజజీవితంలో మాత్రం వాళ్లను ఆదర్శంగా తీసుకోడని విమర్శించారు వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు. పవన్ అధికారికంగా కొంత…

చెగువేరా, భగత్ సింగ్ లాంటి ఆదర్శనీయుల ఫొటోల్ని గోడకు మాత్రమే తగిలించే పవన్ కల్యాణ్, నిజజీవితంలో మాత్రం వాళ్లను ఆదర్శంగా తీసుకోడని విమర్శించారు వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు. పవన్ అధికారికంగా కొంత చేస్తే, అనధికారికంగా చాలా చేస్తారని ఆరోపించారు.

“రోజుకు 2 కోట్ల రూపాయలు తీసుకుంటానని, గతంలో పవన్ కల్యాణే చెప్పాడు. అలాంటప్పుడు బ్రో సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నాడో చెప్పాలి. పవన్ ఇంట్లో ఓవైపు భగత్ సింగ్, మరోవైపు చెగువేరా ఫొటోలుంటాయి. ఈయన మాత్రం సిన్సియర్ గా ఉండడు. తన పారితోషికం ఎంతో చెప్పడు. పవన్ ది పచ్చి మోసం. అధికారికంగా తీసుకునేది కొంత. అనధికారికంగా తీసుకునేది చాలా. అఫీషియల్ గా చేసుకున్నవి 3. అన్-అఫీషియల్ గా చేసుకున్నవి ఎన్నో. అది పవన్ కల్యాణ్ జీవితం. ఆయన బయటకొచ్చి జనాల ముందు నీతులు చెబుతున్నాడు.”

తనపై జనసేన నాయకులు సినిమా తీస్తున్న విషయాన్ని ప్రస్తావించారు అంబటి రాంబాబు. సినిమా తీసుకోవచ్చని, తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అవసరమైతే అందులో పవన్ కల్యాణ్ నటించినా తనకు ఇబ్బంది లేదన్నారు.

“సందులో సంబరాల శ్యాంబాబు అలియాస్ రాంబాబు అనే సినిమా తీస్తున్నారంట. తీస్కోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏమైనా ఇబ్బందులొస్తే నాకు చెప్పండి, నేను పరిష్కరిస్తా. చేతనైనంత సహాయం చేస్తాను. జనసేన జనాలు రాజకీయాలు మానేసి సినిమాలు తీస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. ఆ సినిమాలో పవన్ కల్యాణ్ ను కూడా నటించమని చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు.”

తనపై సినిమా తీసి శునకానందం పొందాలనుకుంటే, తను అడ్డుచెప్పనన్నారు అంబటి రాంబాబు. బ్రో సినిమా లెక్కలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు అంబటి, ఢిల్లీ వెళ్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం మంత్రి జలవనరుల శాఖ మంత్రిని కలిశారు.