ఒక పత్రికలో వచ్చే వార్తల్ని, ఇంకో పత్రికలో వచ్చే కథనాలతో పోల్చి చూసే రోజులు పోయాయి. ఎవరికి అనుకూలంగా వారు వార్తల్ని వండి వార్చుకోవడం చాలా రోజుల నుంచీ చూస్తూనే ఉన్నాం. ఈనాడు మరో అడుగు ముందుకేసింది. ఒకే పత్రికలో జిల్లా ఎడిషన్లో ఒకలా, మెయిన్ పేజీలో మరోలా వార్తని ప్రచురించి తన పరువు తానే తీసుకుంది. ఇదంతా చంద్రబాబు కోసం ఈనాడు ఆడిన గేమ్. అయితే ఆధారాలతో సహా ఈనాడు తన బతుకును తానే బజారున పెట్టుకోవడం
ఇక్కడ కొసమెరుపు.
గుంటూరు జిల్లా మాచర్ల మండలం కంభంపాడు గ్రామంలో పొలం గట్ల మధ్య ఉన్న వివాదంతో పెద వెంకయ్య అనే వ్యక్తిపై గొడ్డలి దాడి జరిగింది. దాడి చేసినవారు కూడా సమీప బంధవులే. ఇవే గొడవల్లో గత రెండేళ్లుగా ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. చివరిగా వెంకయ్యపై జరిగిన హత్యాయత్నంతో 11మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇది జిల్లా పేజీలో వచ్చిన వార్త.
అయితే బాధితుడు టీడీపీ సానుభూతిపరుడు కావడంతో.. గ్రామస్తులు ఆయనను చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారు. ఇక్కడే కథ మలుపు తిరిగింది, పార్టీ రంగు పులుముకుంది. చేయి తిరిగిన సబ్ ఎడిటర్లు ఈ దాడి కేసుని అష్ట వంకర్లు తిప్పారు. జిల్లా నుంచి సమాచారం తెప్పించుకుని వాస్తవాలు రాయాల్సినవాళ్లు కూడా వైసీపీ నేతల దాడి అంటూ మాంచి రివేంజ్ స్టోరీని వండారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తామనడం వల్లే వెంకయ్యపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారని మార్చేశారు.
ఇక హెడ్డింగ్ అయితే పూర్తిగా మారిపోయింది. వైకాపా నేతలు బతకనిచ్చేలా లేరు.. ఇదీ మెయిన్ ఎడిషన్లో వార్త. పొలం వివాదం – వ్యక్తిపై గొడ్డలితో దాడి.. ఇదీ జిల్లా పేజీలో వార్త. వైసీపీని టార్గెట్ చేయడం కోసం ఈనాడు మరీ దిగజారిపోతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది.
బాబు ప్రాపకం కోసం ఈనాడు అవాస్తవాలు, అర్థసత్యాలు ప్రచురిస్తుందని అందరికీ తెలుసు కానీ, మరీ ఇంత దారుణంగా బుక్కైపోతుందని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. ఒకే పత్రికలో వేర్వేరు కథనాలు రాసి పూర్తిగా దిగజారిపోయామని నిరూపించుకుంది ఈనాడు యాజమాన్యం. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతికార దాడులు జరిగాయని చాలాసార్లు ఈనాడు అసత్యాలు రాసింది. వాటిని నిజాలుగా చూపించుకోవడం కోసం ఇలా వార్తను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చేసింది.