ఎస్.వెంకటరత్నం మంచి డిమాండున్న కెమెరామన్. నిర్మాతగా మారి శోభన్‌బాబు, జయప్రదతో వి. మధుసూదనరావుతో ‘‘ఈ తరం మనిషి’’ (1977) అని సినిమా తీస్తే ఫ్లాపయింది. పరువు నిలుపుకోవాంటే వెంటనే వేరే సినిమా తీయాలి అనుకుని రచయిత డివి నరసరాజు గార్ని కలిసి కథ చెప్పమని కోరారు. ఆయన ‘నేను గతంలో రాసిన ‘‘దేవాంతకుడు’’ సినిమాను యీ కాలానికి మార్చి రాస్తే బాగానే ఉంటుంది’ అన్నారు. బెంగాలీలో ‘‘యమాలయే జీవంత మానుష్’’ అనే సినిమా వచ్చింది. ఓ మనిషి యమలోకానికి వెళ్లి యముడి పాపపుణ్యాల చిఠ్ఠాను ప్రశ్నిస్తే ఏమవుతుంది అనే అంశంపై సోషియో ఫాంటసీ సెటైర్‌కు ప్రేమకథను కలిపి తీశారు. దాని ఆధారంగా దర్శకనిర్మాత సి.పుల్లయ్య గారు తమిళంలో ‘‘నాన్ కండ స్వర్గం’’ పేర తంగవేలు, జానకితో, తెలుగులో ‘‘దేవాంతకుడు’’ (1960) పేర ఎన్టీయార్, కృష్ణకుమారి (జానకి చెల్లెలు)తో సినిమాలు తీశారు. రెండూ విజయవంతంగా ఆడాయి. తెలుగు సినిమాకు రచయిత నరసరాజు గారు.
వాటికి సీక్వెల్ తీద్దామని ‘‘యమగోల’’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించి పుల్లయ్యగారు మరో రచయితను కూర్చోబెట్టి కొంత రాయించారు. అది సగంలో ఉండగానే మరణించారు. ఆయన కుమారుడు, దర్శకుడు ఐన సిఎస్ రావు దాని మీద మరికొంత వర్క్ చేసి స్క్రిప్టు తయారుచేశారు కానీ అది ఏ నిర్మాతకూ నచ్చలేదు. ఇదంతా చెప్పి ‘‘నేను ఆ స్క్రిప్టు చూశాను. దానికి భిన్నంగా తీద్దాం.’’ అని నరసరాజు వెంకటరత్నాన్ని ఒప్పించారు. ‘‘దేవాంతకుడు’’ సినిమాలో ఓ సామాన్యుడు డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తే షరా మామూలుగా ఆమె తండ్రి అభ్యంతర పెడతాడు. ఇతను రకరకాల వేషాలు వేస్తాడు. చివరకు ఆమె తండ్రి నియమించిన రౌడీల చేత చావుదెబ్బలు తింటాడు. అతని ఆత్మ యమలోకానికి వెళ్లి, అక్కణ్నుంచి స్వర్గానికి వెళ్లి నానా హడావుడీ చేస్తుంది. చివరకు అదంతా కల అని తేల్తుంది. ఇతను చచ్చిపోయాడని భ్రమపడి హీరోయిన్ ఆత్మహత్య చేసుకోబోతుంది. ఇతనికి మెలకువ రాగానే ఆమెను రక్షించి, పెద్దల అనుమతితో పెళ్లాడతాడు.
నరసరాజు గారు ముందుభాగం కథ కాస్త తగ్గించి, యమలోకం సీన్లయ్యాక, యముడు, చిత్రగుప్తుడు భూలోకానికి వచ్చి అవస్థలు పడినట్లు, వాళ్లని హీరో మావగారు తన నేరకార్యకలాపాలకు ఉపయోగించుకుందామని చూసినట్లు పొడిగించి కొత్త సినిమా తయారు చేద్దామని అన్నారు. ‘‘బాగుంది. కానీ ‘‘యమగోల’’ టైటిల్ చాలా బాగుంది. అది ఎవరి దగ్గర ఉంది?’’ అని వెంకటరత్నం అడిగారు. ‘‘టైటిల్ నచ్చి, డి రామానాయుడుగారు స్క్రిప్టు కొన్నారు కానీ స్క్రిప్టు నచ్చక పక్కన పడేశారు. వెళ్లి ఆయన అమ్ముతారేమో కనుక్కో.’’ అన్నారు. ‘‘దానితోబాటు ‘‘దేవాంతకుడు’’ సినిమా రైట్స్ ఎవరి దగ్గరున్నాయో కనుక్కుని కొనేసేయ్. కథ కొంత కలుస్తోంది కాబట్టి కాపీరైట్ గొడవలొస్తాయేమో’’ అన్నారు. టైటిల్ 5 వేలకు కొనేయగలిగారు కానీ దేవాంతకుడి రైట్స్ తాలూకాల వారీగా పలువురు కొనుక్కోవడం వలన ఎవరికి హక్కుందో తెలియకుండా పోయింది.
నరసరాజుగారు డైరక్టరు తాతినేని రామారావుతో కూర్చుని 15 రోజుల్లో కథ ఓ స్థాయి వరకు తీసుకుని వచ్చారు. అప్పుడు ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. ‘ఈ నిర్మాత కితం సినిమా ఫెయిలయింది కాబట్టి, దీనికి పెట్టుబడి పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవచ్చు. భాగస్వాములను కలుపుకుంటే వాళ్లకు కథ నచ్చుతుందో లేదో. అందుకని ఎన్టీయార్‌ను ప్రొడ్యూస్ చేయమందాం. ‘‘కర్ణ’’ సినిమాలో బాలకృష్ణ అభిమన్యుడిగా అద్భుతంగా నటించాడు. దీనిలో అతను హీరోగా వేయవచ్చు, ఎన్టీయార్ యముడిగా వేస్తే, బాలకృష్ణ తండ్రిని ఎదిరిస్తూ డైలాగు చెప్పినపుడు ప్రేక్షకులకు ఉత్సాహంగా ఉంటుంది. దేవాంతకుడులో ఎస్వీయార్ యముడిగా వేశారు, ఎన్టీయార్ ముప్పుతిప్పులు పెట్టారు. ఈసారి ఆ పాత్రలు తండ్రీకొడుకులు వేస్తే అదో కిక్కు’ అని.
అది నిర్మాతకు చెపితే ఆయన ఎన్టీయార్‌ను కలిసి సబ్జక్టు చెప్పారు. ఎన్టీయార్ కాస్సేపు ఆలోచించి ‘‘బాలయ్యను యితరుల సినిమాలకు యివ్వదలచుకోలేదు. చదువు దెబ్బ తింటుంది. కానీ కథ వింటాను. నెలాఖరులో కూచుందాం.’’ అన్నారు. కథ వినగానే ఆయనకు అద్భుతంగా నచ్చింది. ‘‘హీరో వేషం బాలకృష్ణ మోయలేడండి. నేనే వేయవలసినంత ఇంపార్టెన్స్ వుంది. యముడి పాత్ర సత్యనారాయణ చేత వేయిద్దాం.’’ అన్నారు. అలాగే జరిగింది. జయప్రద హీరోయిన్. రావు గోపారావు విలన్. చిత్రగుప్తుడు అల్లు రామలింగయ్య. డైలాగ్స్ పాప్యులరై, ఎల్పీలుగా వచ్చాయి. సినిమా సూపర్ హిట్టయింది. ఇవన్నీ నరసరాజుగారు తన తెర వెనుక కథలులో రాశారు.
ఈ సినిమా విజయంతో దీన్ని వేరేవాళ్లు తమిళంలో ‘‘యమనుక్కు యమన్’’ పేరుతో యోగానంద్ దర్శకత్వంలో తీశారు. శివాజీ గణేశన్‌కు ఎన్టీయార్ కంటె ఆత్రం ఎక్కువ కాబట్టి యముడి పాత్ర కూడా తనే వేసేశాడు. అది 1980లో రిలీజై బాగా ఆడింది. ఈ లోగా వెంకటరత్నమే హిందీలో ‘‘లోక్-పర్లోక్’’ (1979) పేరుతో తాతినేని రామారావు దర్శకత్వంలో హిందీలో తీశారు. జితేంద్ర హీరో, హీరోయిన్ జయప్రద, ప్రేమ్‌నాథ్ యముడు. దేవేన్ వర్మ చిత్రగుప్తుడు. అయితే అక్కడ అనుకోని చిక్కు వచ్చింది. ఉత్తర, తూర్పు భారతాల్లో కాయస్థులనే బలమైన కులం వాళ్లు చిత్రగుప్తుణ్ని దేవుడిగా ఆరాధిస్తారు. చిత్రగుప్తుణ్ని హేళన చేస్తూ తీశారని సినిమాపై కేసు పెట్టారు. దాంతో కొంత గలభా జరిగింది కానీ సర్దుకుంది. సినిమా విజయవంతమైంది. మన తెలుగులో యముడు, చిత్రగుప్తుడు ఫేవరేట్ కారెక్టర్లయిపోయి యమ.. టైటిల్‌తో అనేక సినిమాలు వచ్చాయి. యమగోల పేరుతో కూడా మరో సినిమా వచ్చింది.
‘‘యమాలయే జీవంత మనుష్’’, ‘‘నాన్ కండ స్వర్గం’’ ‘‘యమగోల’’ సినిమాలలో గల పోలికలను, తేడాలను వివరిస్తూ నేను చేసిన ‘‘ఇదీ అసలు కథ’’ కార్యక్రమం యూ ట్యూబ్‌లో లభిస్తోంది. వనితా టీవీలో ప్రసారమైన ఆ ధారావాహిక ఆ ఏడాది రజిత నంది గెలుచుకుంది. లింకు (మూడు భాగాలుగా వుంది) కింద యిస్తున్నాను. వీలైతే చూడండి. – ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2020)
https://www.youtube.com/watch?v=ImaZd4Cstlc&t=19s