రివ్యూ: శ్రీనివాస కళ్యాణం
రేటింగ్: 2.5/5
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: నితిన్, రాశి ఖన్నా, రాజేంద్రప్రసాద్, జయసుధ, నందిత శ్వేత, ప్రకాష్‌రాజ్, సితార, పూనమ్ కౌర్, నరేష్, ప్రవీణ్, రాజేష్ తదితరులు
సంగీతం: మిక్కీ జె. మేయర్
కూర్పు: మధు
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాతలు: రాజు-శిరీష్-లక్ష్మణ్
రచన, దర్శకత్వం: వేగేశ్న సతీష్
విడుదల తేదీ: ఆగస్ట్ 9, 2018
మన సొంత ఇంట్లో వేడుక కాకుండా కనీసం బంధువుల వేడుకకి వెళ్లినా కానీ అత్యంత బోరింగ్ ఈవెంట్‌లా అనిపించేది ఏదైనా వుంటే అది పెళ్లి వేడుకే. సుదీర్ఘంగా సాగే పెళ్లి తంతు చూస్తూ కూర్చోమని మండపంలోనే ఉంచేస్తే ఎవరైనా నిద్రలోకి జోగిపోతారు. అందుకే పెళ్లి అనగానే విందు, వినోదాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. అలాంటి బోరింగ్ 'వివాహ' వేడుకనే సినిమాకి కథావస్తువుగా ఎంచుకున్నపుడు 'వినోదాన్ని' విస్మరించడం కంటే పెద్ద మిస్టేక్ వుండదు.
హిందూ పెళ్లి యొక్క విశిష్టతని, అందులోని ఆచార కట్టుబాట్లని చాటిచెప్పడమే ఇతివృత్తంగా తీసుకున్న 'శ్రీనివాస కళ్యాణం' ఒక సినిమాకి అత్యంత అవసరమైన 'సంఘర్షణ', 'పాత్ర చిత్రణ'ల విషయంలో టోటల్‌గా మిస్‌ఫైర్ అయింది. పెళ్లి అనేది ఒక టైమ్ వేస్ట్ ఈవెంట్ అనుకునే ఒక పెద్దాయన (ప్రకాష్‌రాజ్) కూతురిని ప్రేమించిన కుర్రాడి (నితిన్) ఇంట్లోనేమో పెళ్లి అనేది పది కాలాల పాటు గుర్తుండిపోయే వేడుక. విరుద్ధ భావాలున్న ఈ కుటుంబాలు వియ్యమొందాల్సి వచ్చినపుడు తలెత్తే సమస్యలేంటి? చివరిగా ఆ పెద్దాయన వివాహ ఔన్నత్యం గురించి ఎలా తెలుసుకుంటాడనేది కథ.
చాలా డెలికేట్ లైన్‌తో పాటు ఎలా పరిష్కారర అవుతుందనేది ఇట్టే తెలిసిపోయే కాన్‌ఫ్లిక్ట్‌ని ఎంచుకున్న దర్శకుడు దానికి బలమైన కథనం రాయడంలో సఫలమవలేదు. పాత్రలు, వారి స్వభావాలు చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించడం ఈ చిత్రంలోని ప్రధాన లోపం. నితిన్ క్యారెక్టర్ పరిచయమైంది లగాయతు మంచితనానికి కేరాఫ్ అడ్రస్‌లా, అతను మాట్లాడినపుడల్లా చుట్టూ వున్న లేడీ క్యారెక్టర్స్ అన్నీ క్లోజప్‌లో ఆరాధనగా చూసేలా నమ్మలేనంత మంచితనంతో, మితిమీరిన సుగుణాలతో సినిమాటిక్‌గా కనిపిస్తాడు. ఇక అతనికి జోడీ అయిన రాశి ఖన్నా పాత్ర కూడా అంతే మృదు భాషిణి, సుహాసిని వగైరా వగైరా అన్నమాట.
ఇక ప్రకాష్‌రాజ్ క్యారెక్టర్ విషయానికి వస్తే… ఈ కథ, కాన్‌ఫ్లిక్ట్ రెండూ ఇతనివే. టైమ్ అంటే డబ్బు అని నమ్మే ఇతను ప్రతి వ్యాపారంలో ఎంటర్ అయ్యేటప్పుడే ఎగ్జిట్ గురించి ఆలోచిస్తానని చెప్పుకుంటూ వుంటాడు. అతను చెప్పేది వినడానికి ప్రాక్టికల్‌గా అనిపిస్తున్నా, చేసేది చూడ్డానికి మాత్రం సిల్లీగా కనిపిస్తే తప్పు మీది కాదు. విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసి వచ్చిన కూతురితో ఆరు నెలలు ఎక్కడికైనా వెళ్లి, తన కూతురని చెప్పుకోకుండా ప్రపంచాన్ని తెలుసుకుని రమ్మంటాడు. మరి ఇదేమి లాజిక్కో అతడికే తెలియాలి. కూతురు ఫలానా వాడిని ప్రేమించానని చెబితే అడ్డు చెప్పాల్సినది పోయి, రేపు మీరిద్దరికీ సరిపడకపోతే విడాకులు ఇవ్వాలంటూ ముందే ఒప్పందం చేసుకుంటాడు. ఇదంతా చూస్తూ… ఈ థియేటర్‌కి ఎగ్జిట్ ఎటుందో తెలుసుకుని ఎంటర్ అవ్వాల్సిందేమో అనుకుని నవ్వుకోవడం తప్ప చేయగలిగినదేమీ వుండదు.
పెళ్లి కాన్సెప్ట్‌తో ఎంటర్‌టైనర్స్ ఎన్నో వచ్చాయి. నిజానికి కమర్షియల్‌గా ఇదో బ్లాక్‌బస్టర్ థీమ్. కాకపోతే సదరు పెళ్లి వేడుక ఎంజాయ్ చేసేలా, ఎమోషన్స్ కనక్ట్ అయ్యేలా వుండాలే తప్ప క్లాస్ పీకుతున్నట్టు అనిపించకూడదు. దిల్ రాజు ఎక్కడో బొమ్మరిల్లు క్లయిమాక్స్ హ్యాంగోవర్‌లోనే వుండిపోయి మళ్లీ మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడా అని అతని సినిమాలు చూస్తే అనిపించకపోదు. ఈ చిత్రంలోను సడన్‌గా నితిన్ ఎమోషనల్ అయిపోయి పెళ్లి మంత్రాల అర్థం చెబుతూ తెగ ఇదైపోతాడు. ప్రకాష్‌రాజ్ పాత్ర చివరకు ఎలా మారుతుందనేది ఇంటర్వెల్‌కే బోధపడిపోయినపుడు ఇక ఆ తర్వాతి సరంజామా ఏమిటనేది చూసే ఆసక్తి వుండదు.
శ్రీనువైట్ల సినిమాల్లో భార్యలని నిర్లక్ష్యం చేసే భర్తలకి కనువిప్పు కలిగే సన్నివేశాల లాంటివి ఇందులోను పెట్టేసి మరోసారి మగాళ్లకి జ్ఞానబోధ చేసి, ఆడవాళ్ల నుంచి మార్కులు కొట్టేయాలని చూసారు. కానీ ప్రతి సన్నివేశం కృత్రిమంగానే అనిపించడానికి తోడు చాలా చిత్రాల్లో చూసేసిన భావన కలిగించడం వల్ల ఏ తరుణంలోను దర్శకుడి ఉద్దేశం సఫలం కాలేదు. పురుషులు, స్త్రీలు కలిసుంటేనే కిక్కు అని చెప్పడానికి ఇచ్చిన మద్యం, సోడా ఉదాహరణలాంటి నాసిరకం సన్నివేశాలు, సంభాషణలతోనే పొద్దు పుచ్చడం వల్ల అసలు చెప్పాలనుకున్న పాయింట్‌కి వెయిట్ రాలేదు. కనీసం ఈ కథకి అద్భుతమైన పాటలు జత కలిసినా అంతో ఇంతో కమర్షియల్ వేల్యూ పెరిగేది.
కానీ ఒకటి, రెండు పాటలు మినహా మిక్కీ జె. మేయర్ కూడా తన పాత బాణీలనే వినిపించేసాడు. సాధారణంగా దిల్ రాజు సినిమాల్లో నిర్మాణ విలువలు కళ్లు చెదిరేలా వుంటాయి. కానీ ఈ చిత్రంలో ఎందుకో ఏ ఫ్రేమ్ రిచ్‌గా లేదు. అల్ట్రా రిచ్‌గా చూపించిన ప్రకాష్‌రాజ్‌కి సంబంధించిన సన్నివేశాల్లోను ఆ రిచ్‌నెస్ తెరమీదకి రాలేదు. ద్వితియార్ధాన్ని పూర్తిగా పెళ్లి పనులకే కేటాయించినపుడు కనీసం ప్రథమార్ధం అయినా హాయిగా నవ్వించేలా వుండేట్టు చూసుకోవాల్సింది. ఫస్ట్ హాఫ్‌లో జరిగేదంతా కేవలం ఇంటర్వెల్ వరకు కాలక్షేపం చేయడానికి చూస్తోన్న భావన కలిగిస్తుంది.
నితిన్, రాశిల మధ్య లవ్‌స్టోరీని అయినా నేటితరం ప్రేక్షకులు మెచ్చుకునే రీతిన రాసుకుని వుండాల్సింది. ఇద్దరూ అతి మంచితనంతో నడిపే ఆ లవ్‌స్టోరీ వినడం వలనో ఏమో అంతటి ప్రకాష్‌రాజ్ కూడా అభ్యంతరం చెప్పకుండా పెళ్లి ఖాయం చేసేసుకుంటాడు. పాసివ్ క్యారెక్టర్లు పోషించిన నితిన్, రాశిలకి ఈ చిత్రం వల్ల నటులుగా వచ్చే ప్రత్యేక గుర్తింపేమీ వుండదు. వున్నంతలో ప్రకాష్‌రాజ్ క్యారెక్టర్ ఒకటే కాస్త మెరుగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకి అతను పరిపూర్ణ న్యాయం చేసాడు. జయసుధ, రాజేంద్రప్రసాద్, సితార, నందితా శ్వేత సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసారు.
వినోదం లేని ఈ వివాహం శృతి మించిన డ్రామాతో పలుమార్లు టెలివిజన్ సీరియల్స్‌ని తలపించే విధంగా సాగుతుంది. ఆ తరహా ఎమోషన్స్‌కి కనక్ట్ కాగలిగే వారు, ఇతరుల పెళ్లి క్యాసెట్లు చూడ్డానికి సరదాపడే వాళ్లని మినహాయిస్తే మిగతా వాళ్లలో ఈ శ్రీనివాస కళ్యాణం ఎంత మందికి కనువిందుగా వుంటుందో ఏమో?
బాటమ్ లైన్: కళ్యాణం క్యాసెట్టు!
-గణేష్ రావూరి