మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కి బ్యాడ్ టైమ్ నడుస్తోందా? సినిమా కెరీర్ బాగానే ఉన్నా.. వ్యక్తిగత, ఇతర విషయాల్లో మాత్రం ఆయన వరుసగా చిక్కులు ఎదుర్కుంటున్నారు. తాజాగా కేరళ ఖాదీ బోర్డు ఓ అడ్వర్టయిజ్ మెంట్ కి సంబంధించి మోహన్ లాల్ కి లీగల్ నోటీసులు జారీ చేసింది.
ఓ దుస్తుల కంపెనీ ప్రకటనలో చరఖా(రాట్నం) వడుకుతున్నట్టు మోహన్ లాల్ నటించాడు. చరఖా దేశ వారసత్వ సంపదకు చిహ్నమని, ముఖ్యంగా అది గాంధీయిజం, స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిందని చెబుతూ కేరళ ఖాదీ బోర్డు ఆ కంపెనీకి, మోహన్ లాల్ కి నోటీసులు జారీ చేసింది. క్షమాపణ చెప్పి, ప్రకటన విరమించుకోవాలని డిమాండ్ చేసింది.
ఇటీవలే మోహన్ లాల్ నటించిన ఓ జ్యూవెల్లరీ యాడ్ ను కూడా ఇలాగే కోర్టు కేసుల వల్ల పూర్తిగా డిలీట్ చేశారు. బ్యాంకులకు వ్యతిరేకంగా ఉండటంతో ఈ ప్రకటనను తొలిగించారు. ఇదే ప్రకటనను తెలుగులో నాగార్జున చేస్తే దాన్ని కూడా తీసేశారు. కేవలం అడ్వర్టయిజ్ మెంట్లే కాదు.. ఈ మధ్య కేరళ సినీ ఇండస్ట్రీలో జరిగిన పరిణామాలు కూడా మోహన్ లాల్ ప్రతిష్టను దెబ్బతీశాయి.
హీరోయిన్ పై లైంగిక దాడి కేసులో రిమాండ్ కి వెళ్లొచ్చిన హీరో దిలీప్ కి, మోహన్ లాల్ ఓపెన్ గా మద్దతు తెలిపారు. దీనిపై అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) భగ్గుమంది. వరుస రాజీనామాలతో 'అమ్మ'లో నటీనటులు హోరెత్తించారు. చివరకు దిలీప్ స్వచ్ఛందంగా అసోసియేషన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది.
తెరపై సూపర్ స్టార్ అనిపించుకున్న మోహన్ లాల్.. ఇలా యాడ్స్, వ్యక్తిగత జీవితంలో మాత్రం వివాదాలు, లీగల్ నోటీసులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బిజినెస్ పరంగా ఈమధ్య మోహన్ లాల్ 2 సినిమాలు కొని రిలీజ్ చేస్తే, ఆ రెండూ డిజాస్టర్లు అయ్యాయి. ఇలా ప్రస్తుతం ఈ సూపర్ స్టార్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది.