వరుసగా ఎనిమిదేళ్ల పాటు వైఫల్యాలు చవిచూసిన నితిన్ పని అయిపోయినట్టే అని అప్పట్లో అనుకునేవారు. కానీ తానే నిర్మాతగా మారి తనకి నచ్చిన కథతో ఇష్క్ చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత గుండెజారి గల్లంతయ్యిందే కూడా పెద్ద హిట్ అవడంతో నితిన్ మళ్లీ బిజీ అయిపోయాడు.
నితిన్నుంచి స్ఫూర్తి పొందాడో ఏమో నాగశౌర్య కూడా తనకి కాలం కలిసి రానపుడు నిర్మాతగా మారాడు. 'ఛలో' చిత్ర కథని నమ్మి స్వయంగా డబ్బులు పెట్టాడు. అతని నమ్మకం నిజమయి ఆ చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆ సక్సెస్‌ని క్యాష్ చేసుకోవాలని చూడకుండా మళ్లీ తన బ్యానర్లోనే 'నర్తనశాల' చేస్తున్నాడు. ఈ చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది. ఛలో చిత్రం మాదిరిగానే దీనిని కూడా సక్సెస్ చేయడం కోసం పబ్లిసిటీ పరంగా నాగశౌర్య జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
హీరోగా మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత బయటి బ్యానర్లలో ఎక్కువ చేయాలని, అంత వరకు సొంతం సినిమాలతో ఎంత రిస్కయినా తానే భరించాలని నాగశౌర్య చూస్తున్నాడు. ఇండస్ట్రీలో బయటి వాళ్లకి ఎక్కువ అవకాశాలు రావని చెప్పేవారు శౌర్యలాంటి హీరోలనుంచి స్ఫూర్తి పొందాలి. కథని నమ్మి రిస్క్ చేస్తే అందుకు తగ్గ ఫలితం అదే వస్తుంది.