వైఎస్సార్ జిల్లా పులివెందుల అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ అడ్డా. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి రాజకీయంగా పులివెందుల అండగా నిలుస్తూ వస్తోంది. అందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాలను సులువుగా నడపగలిగారు. పులివెందుల్లో వైఎస్సార్ బలమైన పునాదులు వేశారు. ఎవరెన్ని చేసినా పులివెందుల్లో వైఎస్సార్‌ను ఏమీ చేసుకోలేమనే నిరాశ, నిస్పృహ ప్రతిపక్షాల్లో కనిపించేది.
వైఎస్సార్ మరణం తర్వాత కూడా ఆయన కుమారుడు వైఎస్ జగన్‌కు అదే స్థాయిలో పులివెందుల అండగా వుంటోంది. కానీ తేడా ఒక్కటే. తనకెంతో ఇచ్చిన పులివెందులపై దివంగత వైఎస్సార్ ఎంతో ప్రేమ చూపారు. పులివెందుల ప్రజానీకాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. వారికి ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్లు ఇచ్చేవారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ముఖ్యమైన పనులుంటే ఆయన్ను కలవడం కష్టమని నాయకులు ఎప్పుడూ భావించలేదు. వైఎస్సార్‌ను కలిసే భాగ్యం లేదని పులివెందుల ప్రజలతో పాటు నాయకులు అసంతృప్తికి గురైన సందర్భాలే లేవు.
కానీ వైఎస్ జగన్ విషయానికి వస్తే…ఆయన దర్శన భాగ్యమే కరువైందని చిన్న పిల్లాడిని అడిగినా ఆవేదనతో చెబుతాడు. జగన్‌కు పులివెందుల అండగా నిలిచిందే తప్ప, ఆ స్థాయిలో ముఖ్యమంత్రి ప్రేమ ఇవ్వలేదనేది అక్కడి ప్రజానీకం భావన. జగన్‌ను సీఎం చేసుకునే వరకూ ఆయన్ను పులివెందుల తన భుజాలపై మోసింది. ఎప్పుడూ జగన్‌ను భారంగా పులివెందుల భావించలేదు. మనోడు సీఎం అయ్యాడని పులివెందుల సంబరపడింది.
గత నాలుగేళ్లుగా జగన్ తీరుపై ఏదో తెలియని బాధ, ఆవేదన పులివెందుల మనసులో గూడు కట్టుకుంది. ఆశయం నెరవేరిందని జగన్ తనను పట్టించుకోలేదనే ఆవేదన పులివెందుల ప్రజానీకంలో వుంది. పులివెందుల నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను జగన్ చేశారు. దీన్నెవరూ కాదనలేని పరిస్థితి. అయితే జగన్‌పై పులివెందుల మనసులో చిన్న అలక. తమను విస్మరించారని బిడ్డలపై తల్లిదండ్రులు ప్రదర్శించే నిరసన లాంటిది.
పులివెందులలో చంద్రబాబునాయుడికి ప్రజలు ఘన స్వాగతం పలకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంత మాత్రాన పులివెందుల్లో టీడీపీ గెలుస్తుందని ఎవరూ చెప్పరు. గతంలో చంద్రబాబు అంటే, ఆ ప్రాంతం అసలు పట్టించుకునేది కాదు. ఇప్పుడు అక్కడి ప్రజల్లో ఏదో తేడా, మార్పు. చంద్రబాబుకు ప్రజాదరణ అనే కంటే అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ, తమను పట్టించుకోని జగన్‌పై కోపంగా చూడాల్సి వుంటుంది.
సహజంగా వైఎస్ కుటుంబం అంటే… వైఎస్ రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి అని మాత్రమే అక్కడి ప్రజల మనసుల్లో వుంది. ఇప్పుడు వైఎస్ కుటుంబం అంటే అర్థం మారింది. వైఎస్ వివేకానందరెడ్డి స్థానంలో వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు అవినాష్‌రెడ్డి చేరారు. దీన్ని పులివెందుల ప్రజానీకం జీర్ణించుకోలేని పరిస్థితి. పైగా సీఎం వైఎస్ జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని బలవంతంగా తమపై రుద్దుతున్నారనే అసంతృప్తి పులివెందుల్లో వుంది. ప్రధానంగా వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, జైల్లో వున్న నిందితులను జగన్ వెనకేసుకురావడం ఏంటనే ఆవేదన, ఆక్రోశం పులివెందుల ప్రజానీకంలో వుంది.
అందుకే వైఎస్సార్ మాదిరి జగన్ అభిమాన నాయకుడు కాదని, కనీసం ఆయన్ను కలిసి ఏదైనా చెప్పుకుందామన్నా అవకాశం ఇవ్వడనే బాధ, ఆవేదన అక్కడి నాయకులు, ప్రజల్లో గూడు కట్టుకుంది. మనకు అందనంత దూరంలో ఉన్న జగన్‌తో మనకేం పని అనే భావన క్రమంగా పులివెందుల ప్రజానీకంలో పెరుగుతోంది. ఇలా అనేక రకాల అసంతృప్తులు, వ్యతిరేకతలు జత కావడం వల్లే చివరికి జగన్ సొంతూరు బలపనూరులో కూడా చంద్రబాబుకు ఘన స్వాగతం పలికే పరిస్థితికి దారి తీసింది. పులివెందుల్లో వైసీపీకి ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది.
పులివెందుల వైసీపీకి నాయకత్వం వహిస్తున్న వారిపై ప్రజల్లో గౌరవం లేదు. దీంతో వైసీపీని ఏకతాటిపై నడిపే పరిస్థితి కరువైంది. పులివెందుల్లో వైసీపీ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారైంది. ఈ పరిణామాల దృష్ట్యా పులివెందుల్లో చంద్రబాబు పర్యటన విజయవంతమైంది. దీన్ని మరో కోణంలో కూడా చూడొచ్చు. పులివెందులలో ప్రత్యర్థులకు చోటు దక్కేలా వైసీపీ రాజకీయం చేస్తోందనే అభిప్రాయం కూడా బలంగా వుంది.
గతంలో ఏదైనా సమస్య వస్తే, వెంటనే వివేకానందరెడ్డి దగ్గరికి వెళ్లేవారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియని అయోమయం నెలకుంది. వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు అవినాష్‌రెడ్డిని కలవడం కంటే, ప్రశాంతంగా ఇంట్లో కూచోవడం బెటర్ అని ప్రజలు అనుకునే పరిస్థితి. ఇప్పటికైనా పులివెందుల్లో మేల్కొనకపోతే మాత్రం… తినబోతు రుచి చూడడం ఎందుకు?
పీ.ఝాన్సీ