తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 గందరగోళంగా కొనసాగుతోంది. హోస్ట్ నాని కన్ఫ్యూజన్ ఓ పక్క, కంటెస్టెంట్స్‌లో గందరగోళం ఇంకోపక్క.. వెరసి సీజన్-2 బిగ్ బాస్ ఆడియన్స్‌కి క్రమక్రమంగా దూరమవుతోంది. బిగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినవారంతా మీడియా ముందుకొచ్చి కూడా డ్రమెటిక్గానే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి తేజస్వి కూడా చేరిపోయిందని అనుకోవాలేమో.!
ఇరవై నాలుగ్గంటల్లో చాలా విషయాలు జరుగుతాయనీ, దాన్ని గంటన్నర సమయమే చూపిస్తే, చాలా ముఖ్యమైన విషయాలు మరుగునపడిపోతాయనీ, ఈ విషయంలో బిగ్ బాస్ నిర్వాహకుల తీరు సమంజసంగా లేకపోవడం వల్లే తాను ప్రతిసారీ కార్నర్ అయిపోయాననీ తేజస్వి చెప్పుకొచ్చింది. హోస్ట్ నాని కూడా, మొత్తం 'రా ఫుటేజ్' చూడకుండా, ఎడిట్ చేసిన పుటేజ్ చూసేసి, తనను టార్గెట్ చేయడం బాధ కలిగించిందని అంటోంది తేజస్వి.
బిగ్ హౌస్‌లో బోల్డన్ని కెమరాలున్నాయి. ఒకటా.? రెండా.? 70కి పైగానే కెమెరాలున్నాయి. అన్ని కెమెరాల్లో 'రా ఫుటేజీ' చూడటమంటే ఎవరికైనా అసాధ్యమే. హోస్ట్‌గా నాని, వీకెండ్స్‌లో హంగామా చేసే ముందు.. పూర్తిగా ఒకరోజు టైమ్ కేటాయించినా, మొత్తం ఫుటేజ్‌ని చూడటం వీలుకాదు. ఆ విషయం తేజస్వికి తెలియదని అనుకోలేం. ఇదొక రియాల్టీ షో.. జస్ట్ గేమ్ షో. ఏ ఇష్యూకి ఎంత టీఆర్పీ మైలేజ్‌ని క్యాప్చర్ చేసే సీన్ వుందని మాత్రమే నిర్వాహకులు ఆలోచిస్తుంటారు. బిగ్ బాస్ విషయంలోనూ అదే జరుగుతోంది.
ఇక, నాని వీకెండ్స్‌లో కన్పించిన ప్రతిసారీ 'రా ఫుటేజ్ చూశాను..' అంటూ కంటెస్టెంట్స్‌కి క్లాస్ తీసుకోవడం ఆయా కంటెస్టెంట్స్‌కి సహజంగానే నచ్చదు. తేజస్వి, బిగ్ హౌస్ నుంచి బయటకు వచ్చాక నాని మీద 'రా ఫుటేజ్' విషయంలోనూ, తనను కార్నర్ చేసిన విషయంలోనూ మండిపడ్తున్న తీరు.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
హౌస్‌లోంచి బయటకు వచ్చేశాక చాలా ఆనందంగా వుందని చెబుతూనే, హౌస్ మేట్స్ అంతా గేమ్ ఆడుతున్నారనీ, అది తనకు నచ్చలేదనీ, తానొక్కద్దానే రియల్ లైఫ్‌లో ఎలా వుంటానో, హౌస్‌లోనూ అలాగే వున్నానని అంటూనే.. మళ్ళీ బిగ్ హౌస్‌లోకి వెళ్ళే అవకాశమొస్తే వదులుకోనని చెబుతుండడం గమనార్హం.
మొత్తమ్మీద, తేజస్విపై సోషల్ మీడియాలో వచ్చిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై స్పందించిన నాని.. ఇప్పుడు తేజస్వి, మీడియాకెక్కి నాని మీద చేస్తున్న ఆరోపణలకి ఈ వీకెండ్లో ఏమన్నా సమాధానమిస్తాడా.? వేచి చూడాల్సిందే.