శైలజారెడ్డి అల్లుడు సినిమా టైటిల్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి సినిమా అభిమానుల ఊహ ఒక్కటే. చిరంజీవి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు దాదాపు ప్రతి హీరో చేసినట్లే, నాగచైతన్య కూడా అత్త-అల్లుడు ఢీ కొనే ఎవర్ గ్రీన్ సేలబుల్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్నాడనే. ఆ సినిమాలు అన్నింటిలో అత్తను ఢీకొనడం, ఆమె పొగరు అణచడం అనదే మెయిన్ లైన్ గా వుంటూ వచ్చింది. సో నాగచైతన్య సినిమా కూడా ఆ లైన్ నే అనుకుంటున్నారు.
కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం అస్సలు అత్తను అల్లుడు ఢీకొనే వ్యవహారమే వుండదట శైలజారెడ్డి అల్లుడు సినిమాలో. ఇది అత్త అల్లుడు సినిమా అనేకన్నా, ఎవరి ఇగోను వారు నరనరానా నింపుకున్న తల్లీ కూతుళ్ల సినిమా అని తెలుస్తోంది. ఇలా ఇద్దరు పరమ ఇగోయిస్టుల మధ్యలో దూరతాడన్నమాట హీరో. దాంతో వాళ్లతో హీరో ఎలా వేగుకు వచ్చాడన్నది కథ అని తెలుస్తోంది.
ఈ సినిమాలో రమ్యకృష్ణ వరంగల్ శైలజారెడ్డిగా కనిపిస్తారు. ఆమె కూతురుగా అను ఇమ్మాన్యయేల్. ఈ ఇద్దరి మధ్య చిక్కుకుని, వారిద్దరిని మార్చేవాడిగా నాగచైతన్య. అతగాడి నేస్తంగా వెన్నెలకిషోర్. సినిమా మలిసగం అంతా దాదాపుగా రమ్యకృష్ణ ఇంటి నేపథ్యంలో జరుగుతుందని తెలుస్తోంది. మొత్తానికి నలుగురు నడిచేసిన బాటలో కాకుండా కొత్తగానే వెళ్తున్నట్లుంది దర్శకుడు మారుతి.