వేసవి వచ్చిందంటే చాలు చాలామంది ఎదుర్కొనే సమస్య దాహం. లవణాలు, నీరు బయటకు వెళ్లిపోవడంతో మన శరీరం మరింత నీటిని కోరుకుంటుంది. అయితే ఎండాకాలంలో నీళ్లు తాగడానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. ఉదయాన్నే ఓ 3 గ్లాసులు నీరు కడుపు నిండా తాగితే సరిపోతుందనుకుంటారు కొంతమంది. కానీ ఇది అపోహ మాత్రమే.
ఆహారం ఎలాగైతే రోజూ మూడు పూటలు తీసుకుంటామో.. అలాగే నీళ్లు కూడా రోజూ ఆరు పూటలు తీసుకోవాలి. అవసరమైతే అలారం పెట్టుకొని మరీ నీళ్లు తాగడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎండాకాలంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచాలంటే నిర్ణీత సమయాల్లో మంచి నీళ్లు తాగడం ఒక్కటే ఉత్తమం అని చెబుతున్నారు.
మన శరీరంలో 70శాతం నీరు ఉంటుందనే విషయం తెలిసిందే. జీవక్రియలన్నీ సాఫీగా సాగాలంటే ఈ నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. అది కూడా రోజంతా నీటి శాతం మెయింటైన్ చేయడం అవసరం. ఏదో 2 పూటలు తాగి సరిపోతుందనుకోవడం అపోహ. ఇక ఏసీల్లో పనిచేసే వాళ్లు కూడా తమకు నీటి అవసరం లేదనుకోవడం భ్రమే అవుతుంది. శారీరక శ్రమ చేసే వాళ్లతో పోలిస్తే, ఆఫీసుల్లో పనిచేసే వాళ్లు నీళ్లు తగ్గించి తీసుకోవచ్చు. కానీ నీళ్లు తాగడం మాత్రం తప్పనిసరి.
సరిగ్గా ఇక్కడే మరో ప్రశ్న తలెత్తుతుంది. వేసవి కాలం కూడా వేడి నీళ్లు తాగాలా? అవును.. వేసవి కాలమైనా గోరువెచ్చని నీళ్లు తాగడం ఉత్తమం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మండే ఎండల్లో చల్లటి నీళ్లు తాగితే మనసుకు హాయిగా ఉంటుంది కానీ శరీరానికి కాదంటున్నారు.
గోరువెచ్చని నీరు, శరీరంలోని అన్ని గ్రంధుల్ని తెరుస్తుంది. తద్వారా నీరు అన్ని శరీర భాగాలకు సాఫీగా చేరుకుందని చెబుతున్నారు. ఎండాకాలం ఎక్కువ మంది తలనొప్పితో బాధపడుతుంటారు. శరీరంలో నీరు తగ్గడం వల్లనే ఇలా జరుగుతుందనే విషయాన్ని మరిచిపోవద్దు.
అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలనే అంశం వ్యక్తుల శరీరతత్వం, వాళ్ల రోజువారీ జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మనిషి రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలంటారు. అయితే దీనికి సైంటిఫిక్ ఆధారాల్లేవు.
అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ సిఫార్సుల ప్రకారం.. పురుషుడు రోజుకు 3700 మిల్లీ లీటర్లు, మహిళలు 2700 మిల్లీలీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. అయితే ప్రాంతాలబట్టి ఇది మారుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు నిర్ణీత వేళల్లో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు తాగడం అన్ని విధాలుగా శ్రేయష్కరం.