సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా టైమ్ లో రెండు గ్రామాల దత్తతను ప్రకటించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలోని సిద్దాపురం గ్రామం వాటిల్లో ఒకటి. రెండవది ఆంధ్రలోని బుర్రిపాలెం. ఈ రెండు గ్రామాల్లో మహేష్ బాబు ఏ మేరకు అభివృద్ది చేసాడన్నదానిపై పలు విమర్శలు వున్నాయి.
యూట్యూబ్ లో వెదికితే బోలెడు వీడియోలు రెడీగా వుంటాయి. అయితే భరత్ అనే నేను విడుదలకు ముందే, కాస్త ఇంకా ముందో మళ్లీ ఈ ఊళ్లు గుర్తుకు వచ్చి కార్యక్రమాలు చేపట్టారని వార్తలు వచ్చాయి. బుర్రిపాలెం విషయంలో మొక్కలకు కంచెలు వేయడానికి పలువురు దాతల సాయం తీసుకున్నారని కూడా వార్తలు వున్నాయి.
నిజానికి మహేష్ బాబు కోట్లకు అధిపతి. ఒక సినిమాకు ఇరవై కోట్లకు పైగా పారితోషికం, అలాగే లాభాల్లో సగం వాటా ఆయన నిర్మొహమాటంగా తీసుకుంటారు. బ్రహ్మోత్సవం సినిమాకు ఆయనకు ముట్టింది పాతిక కోట్లు. అలాగే స్పైడయిర్, భరత్ అనే నేను. అంటే శ్రీమంతుడు తరువాత ఆయన ఆదాయం 75కోట్లు. ఇవి కాక, ప్రకటనలు తదితర ఎండార్స్ మెంట్లు. అందువల్ల చెరో దత్తత గ్రామానికి చెరో అయిదు కోట్లు కేటాయించడం అన్నది మహేష్ కు పెద్ద కష్టం కాదు.
కానీ తను ఇవ్వడం అన్నది ఏమేరకు చేస్తున్నారో కానీ, దాతల దగ్గర దత్తత గ్రామాల కోసం విరాళాలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఓ పేద్ద ఫార్మా కంపెనీ ‘నాట్కో ఫార్మా’ అధిపతిని, మహేష్ శ్రీమతి నమ్రత కలిసి, తెలంగాణలో సిద్దాపురం గ్రామ అభివృద్దికి సహకరించమని, పాతిక లక్షలు విరాళం తీసుకున్నారని ఒక్కసారిగా గ్యాసిప్ లు గుప్పుమన్నాయి.
తమ పలుకుబడి ఉపయోగించి విరాళాలు సంపాదించి, గ్రామాల అభివృద్ధి చేయడం తప్పేమీ కాదు. కానీ తానే ఇంత ఆదాయం సంపాదిస్తూ, ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని చెబుతూ, ఇలా చేయడం ఏమిటా? అన్న కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి. అసలు సిద్దాపురం, బుర్రిపాలం గ్రామాలకు తన వంతుగా అసలు తను స్వంత ఖాతా నుంచి ఎంత ఖర్చు చేసారో మహేష్ చెప్పేస్తే ఇలాంటి గుసగుసలు వుండవేమో? ఇంతకీ ఇప్పుడు ఉన్నట్లుండి ఈ గ్యాసిప్ లు ఎలా బయటకు వస్తున్నాయో? ఇంతకీ నాట్కో ఫార్మా విరాళం అధికారికంగానా? అనధికారికంగానా? ఇచ్చినట్లో తెలియడం లేదు.