త్వరలోనే మహేశ్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని అంటోంది ఒక హిందీ దినపత్రిక. ‘పోకిరి’ నాటి నుంచి ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నారు. కొంచెం కొత్తగా ఏమైనా చెప్పండంటే, ఆ పత్రిక ఒక షాకింగ్ విషయాన్నే చెప్పింది. అదేమిటంటే.. ‘స్పైడర్’ సినిమా రీమేక్‌తో మహేశ్ బాబు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ‘మిడ్ డే’ పత్రిక వార్తా కథనాన్ని ఇచ్చింది.
బాలీవుడ్ వాళ్లకు ఇదేం అంత షాకింగ్ కాదు కానీ, స్పైడర్ సినిమా మహత్యాన్ని తెలిసిన వారికి మాత్రం ఇంతకు మించి షాక్ లేదు. దేశ సినీ చరిత్రలోనే అత్యంత భారీ నష్టాలను మూటగట్టుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఘనత వహించిన సినిమా అది. బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్‌గా తొలి స్థానంలో ‘బాంబే వెల్వెట్’ ఉంటే రెండో స్థానంలో ‘స్పైడర్’ ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి.
ఆ సినిమాను మహేష్ ఒకసారే ఎలా చేశాడో! అనేది అనేక మంది సందేహం. మిడ్ డే మాత్రం ఈ ప్రాజెక్టును మహేష్ రెండో సారి చేయబోతున్నాడని ప్రకటించేసింది. ఈ ప్రకటనకు కారణం దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ఇతడు స్పైడర్‌ను హిందీలో తీస్తానని చాన్నాళ్లుగా చెబుతున్నాడు. దాని కోసమని హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్‌లను సంప్రదించాడు. వారు నో చెప్పలేదు కానీ, కుదరదన్నట్టుగా స్పందించారట.
దీంతో మళ్లీ మహేష్‌తో ఈ సినిమాను తీస్తానని, సంప్రదింపులు జరుగుతున్నాయని ఆ దర్శకుడు ప్రకటించేశాడు. ఈ సినిమాను మహేష్ హిందీలో రీమేక్ చేస్తే అంతకు మించిన ప్రహసనం మరోటి ఉండదు.