దర్శకుల్లో ఇదో గ్రూపు రాజకీయమా?

మొన్నటికి మొన్న వంశీ పైడిపల్లి ఇంట్లో తెల్లవారే వరకు తొమ్మిది మంది డైరక్టర్లు విందు ఆరగించి పిచ్చాపాటీ మాట్లాడుకున్నారని ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే టాలీవుడ్ తొమ్మిదిమంది డైరక్టర్లు మాత్రమే వున్నారా? లేక తొమ్మిది…

మొన్నటికి మొన్న వంశీ పైడిపల్లి ఇంట్లో తెల్లవారే వరకు తొమ్మిది మంది డైరక్టర్లు విందు ఆరగించి పిచ్చాపాటీ మాట్లాడుకున్నారని ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే టాలీవుడ్ తొమ్మిదిమంది డైరక్టర్లు మాత్రమే వున్నారా? లేక తొమ్మిది మందే అగ్ర దర్శకులు వున్నారా? లేక ఈ తొమ్మిదిమంది మాత్రం ఓ గ్రూపుగా ఏర్పడ్డారా? ఇది ఎవరి ప్రశ్నో కాదు, టాలీవుడ్ దర్శకుల్లో వినిపిస్తున్న ప్రశ్న.

రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, వంద కోట్ల దర్శకులు. నాగ్ అశ్విన్, క్రిష్ మేధావి వర్గానికి చెందిన దర్శకులు అనుకోవచ్చు. వంశీ పైడిపల్లి మంచి దర్శకుడే కానీ ఇప్పటి వరకు నిర్మాతలకు లాభాలు అయితే ఇవ్వలేదు. ఊపిరి కూడా లాస్ ప్రాజెక్టే. నిర్మాత పివిపిని అడిగితే చెబుతారు. అనిల్ రావిపూడి మాస్ కమర్షియల్ డైరక్టర్. హరీష్ శంకర్ ప్రస్తుతం సినిమా కోసం వేచి వున్నారు. సందీప్ వంగా సెన్సేషనల్ డైరక్టర్.

మరి వంశీ పైడిపల్లి వీరిని మాత్రమే ఎందుకు పిలిచారు? మిగిలిన చాలా మందిని ఎందుకు పిలవలేదు? టాప్ డైరక్టర్లు, తెలంగాణ ఈక్వేషన్, ఈ రెండు కలిపి వంశీ పైడిపల్లి ఈ డైరక్టర్ల గ్రూప్ ను తయారుచేసారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇండస్ట్రీలో ఇంకా మంచి దర్శకులు, పెద్ద దర్శకలు చాలా మంది వున్నారు.

సందీప్ వంగా, హరీష్ శంకర్ రేంజ్ డైరక్టర్లు అయితే బోలెడు మంది వున్నారు. బోయపాటి, త్రివిక్రమ్, సురేంద్రరెడ్డి, శేఖర్ కమ్ముల, శ్రీను వైట్ల, బాబి, మారుతి ఇలా చాలా జాబితా వుంది. సినిమాలు చేతిలో వున్నవారు, హిట్ లు ఇచ్చిన వారు, కాస్త పేరున్నవారు. మరి వీరందరిని ఎందుకు దూరం పెట్టినట్లో?

మరి కేవలం ఎనిమిది మందిని మాత్రం పిలిచి విందు చేయడం ఏమిటని డైరక్టర్ల సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి మహేష్ సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ స్క్రిప్ట్ కు సంబంధించి కోర్టు వివాదం వుంది.

ఈ విషయంలో కాస్త పెద్ద, పేరున్న డైరక్టర్ల దగ్గర నుంచి నైతిక మద్దతు కోసం ఈ విందు సమావేశం ఏర్పాటు చేసారా? అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. విందు సమావేశానికి పిలుపు అందని డైరక్టర్లు మాత్రం ఈ గ్రూపు సమావేశం మీద గుర్రుగా వున్నారని వినికిడి.