సినిమా రివ్యూ: రాజుగాడు

రివ్యూ: రాజుగాడు రేటింగ్‌: 2/5 బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి. తారాగణం: రాజ్‌తరుణ్‌, అమైరా దస్తూర్‌, రాజేంద్రప్రసాద్‌, సితార, రావురమేష్‌, నాగినీడు, సిజ్జు, పృధ్వీ, సుబ్బరాజు, ఖయ్యూమ్‌ తదితరులు కూర్పు: ఎం.ఆర్‌. వర్మ…

రివ్యూ: రాజుగాడు
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.
తారాగణం: రాజ్‌తరుణ్‌, అమైరా దస్తూర్‌, రాజేంద్రప్రసాద్‌, సితార, రావురమేష్‌, నాగినీడు, సిజ్జు, పృధ్వీ, సుబ్బరాజు, ఖయ్యూమ్‌ తదితరులు
కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
సంగీతం: గోపి సుందర్‌
ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్‌
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
రచన, దర్శకత్వం: సంజనరెడ్డి
విడుదల తేదీ: జూన్‌ 1, 2018

కథానాయకుడికి ఏదో ఒక విచిత్రమైన డిజార్డర్‌ పెట్టి, దాని ఆధారంగా వినోదాన్ని పండించడమనే ఫార్ములాని మారుతి ఫాలో అవుతున్నాడు. భలే భలే మగాడివోయ్‌, మహానుభావుడు చిత్రాలకి మారుతి ఈ ఫార్ములాని సక్సెస్‌ఫుల్‌గా అప్లయ్‌ చేసాడు. ఈ కాన్సెప్ట్‌ వినడానికి చాలా సింపుల్‌గా, రాసేయడం చాలా ఈజీ అన్నట్టుగా వుంటుంది కానీ ఒక ఐడియాని ఆకట్టుకునే సినిమాగా మలచడం అనిపించినంత తేలికకాదని, భలే భలే మగాడివోయ్‌ ఫార్ములాకి స్క్రిప్టు కుదరకపోతే 'రాజుగాడు' అవుతుందని ఈ చిత్రం నిరూపిస్తుంది.

ఇందులో రాజుగాడికి క్లెప్టోమేనియా అనే వింతరోగం వుంటుంది. అంటే ఏదోఒకటి దొంగిలించకపోతే తోచదన్నమాట. తనకి తెలియకుండానే దొంగతనాలు చేసేస్తూ వుంటాడు. ప్రేమిస్తున్నానని చెప్పిన అమ్మాయి దగ్గర్నుంచి కూడా దొంగతనం చేసేసే వింత అలవాటు. ఇలాంటి క్యారెక్టర్‌తో వినోదం పండించడానికి చాలా స్కోప్‌ వుంది. అయితే క్యారెక్టరే సినిమాని డ్రైవ్‌ చేసేస్తుందనే ధీమాతో సన్నివేశాలపై, స్క్రీన్‌ప్లే తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో 'రాజుగాడు' చిత్రంలో కామెడీ కోసం పడిన ప్రయాస అంతా వృధా అయింది.

మారుతి తరహాలో కాన్సెప్టుకి తగిన పకడ్బందీ కమర్షియల్‌ కథని సిద్ధం చేసుకోకపోవడం వల్ల మంచి సాంకేతికవర్గం వున్నా కానీ 'రాజుగాడు' ఎలాంటి ప్రత్యేక ఆకర్షణలు లేని పరమ ఫ్లాటు చిత్రంగా తయారైంది. ఈ తరహా చిత్రాలని విజయవంతం చేయడానికి దర్శకుడి సెన్సాఫ్‌ హ్యూమర్‌ కీలకపాత్ర పోషిస్తుంది. రాజుగాడులో కామెడీ అనుకుని పెట్టినదాంట్లో ఎనభైశాతం మిస్‌ఫైర్‌ అయింది. జోకుల్లో చాలావరకు పేలలేదు. రాజేంద్రప్రసాద్‌, రావురమేష్‌ లాంటి నటులు కూడా ఈ చిత్రానికి లైఫ్‌లైన్‌ కాలేకపోయారు.

ఎవరి పాత్రలని సరిగా తీర్చిదిద్దలేదు. హీరో క్యారెక్టరైజేషన్‌ ఆధారంగా ముందుకి సాగిపోవాల్సిన కథనం ఆ క్యారెక్టర్‌ని కూడా టోటల్‌గా ఎస్టాబ్లిష్‌ చేయకపోవడం వల్ల, రిపీటెడ్‌ సీన్లతో విసిగిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌లోను ఈ 'క్లెప్టోమేనియా' ఎట్రాక్షన్‌ కాలేకపోయింది. భలే భలే మగాడివోయ్‌ కథలో లవ్‌ట్రాక్‌లోను హీరో మెమరీ లాస్‌ వల్ల చాలా మంచి వినోదం పండింది. అలాగే ఎమోషన్స్‌కి, కథలోకి కాన్‌ఫ్లిక్ట్‌కి కూడా పకడ్బందీ సెటప్‌ కుదిరింది.

ఈ చిత్రంలో దొంగల చేతులు నరికేసే సంప్రదాయం వున్న హీరోయిన్‌ ఫ్యామిలీ వల్ల ఎలాంటి టెన్షన్‌ యాడ్‌ కాకపోగా అదంతా కృతకంగా, సినిమాటిక్‌గా అనిపిస్తుంది. చివరకు ఏమి జరుగుతుందనేది తెలిసిందే కనుక 'రాజుగాడు'ని నిలబెట్టడానికి కామెడీనే కవచం కావాల్సింది. కానీ కామెడీ పూర్తిగా తేలిపోవడంతో రాజుగాడు ఒక నిస్సారమైన, నీరసం తెప్పించే సినిమాగా తయారైంది.

దర్శకురాలు సంజన టెర్రరిస్టులు, బాంబులు అంటూ వివిధ సబ్‌ప్లాట్స్‌ జతచేసినా అవేమీ అదనపు బలం కాలేకపోయాయి. పైగా వాటిని పేలవంగా తీర్చిదిద్దడం వల్ల ప్రేక్షకులపై భారంగానే మారాయి తప్ప రాజుగాడిని ముందుకి నడిపించలేకపోయాయి. తారాగణం విషయంలో రాజీపడకపోవడం వల్ల రాజుగాడుని వాళ్లు కాస్తయినా హోల్డ్‌ చేయగలిగారు కానీ సపోర్టింగ్‌ కాస్ట్‌ విషయంలో కాంప్రమైజ్‌ అయివుంటే అవుట్‌పుట్‌ మరింత దారుణంగా వుండేది.

రాజ్‌తరుణ్‌ ఎప్పటిలానే ఈజ్‌తో నటించాడు. చివర్లో ఎమోషనల్‌ సన్నివేశంలోను తన ప్రతిభ చాటుకున్నాడు. అయితే ఈమధ్య అతని పాత్రలన్నీ ఒకేతీరున సాగుతున్నాయి. అన్ని క్యారెక్టర్స్‌ ఒకేలా వుండడం, తన లుక్‌ విషయంలో కూడా కొత్తదనం చూపించకపోవడంతో రాజ్‌తరుణ్‌ రొటీన్‌ అయిపోతున్నాడు. అమైరా దస్తూర్‌కి నటన రాకపోవడం వల్ల కీలకమైన సన్నివేశాల్లో హీరోయిన్‌ రియాక్షన్‌లో ఎఫెక్ట్‌మిస్‌ అయింది.

రాజేంద్రప్రసాద్‌ శాయశక్తులా కృషి చేసినా సన్నివేశాలు, సంభాషణల బలం లేకపోవడంతో ఆయన నటన అలరించలేకపోయింది. పృధ్వీ క్యారెక్టర్‌తో చాలా కామెడీ చేయాలని చూసారు కానీ అది కాస్తయినా నవ్వించలేదు. రావురమేష్‌ పాత్రని కూడా సరిగా తీర్చిదిద్దలేదు. సుబ్బరాజు, కృష్ణభగవాన్‌ల జోడీ కూడా వృధా అయింది.

విజువల్‌గా రిచ్‌గా వుందంటే దానికి సినిమాటోగ్రాఫర్‌ని అభినందించాలి. చిన్న సినిమా అయినా క్వాలిటీ విజువల్స్‌ అందించారు. మ్యూజిక్‌ కూడా ప్లెజెంట్‌గా వుంది. సాంకేతికవర్గం బలమైనది కుదిరినా కానీ రైటింగ్‌ టేబుల్‌ వద్దే రాజుగాడు బలహీనంగా తయారవడంతో ఇక వారు దీనిని ఏమీ చేయలేకపోయారు. దర్శకురాలు సంజన అన్ని క్రాఫ్ట్స్‌ని బాగానే హ్యాండిల్‌ చేసినా కానీ మంచి స్క్రిప్టు రెడీ చేసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. కామెడీ సన్నివేశాలని జడ్జ్‌ చేయలేకపోవడం, ఆకట్టుకునే కామెడీ సన్నివేశాలని రాయలేకపోవడం ఆమె బలహీనతలయ్యాయి. పతాక సన్నివేశంలో రాజా ది గ్రేట్‌, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్‌ అంటూ చేసిన కామెడీతోనే ఈ డిపార్ట్‌మెంట్‌లో ఆమె ఎంత వీక్‌ అనేది తెలిసిపోతుంది.

మినిమం గ్యారెంటీ సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్న రాజ్‌తరుణ్‌ సేఫ్‌ సినిమాలు తీసే ప్రయత్నంలో స్టఫ్‌ వున్న చిత్రాలు అందించలేకపోతున్నాడు. రంగులరాట్నం తర్వాత రాజుగాడుతో అతని కెరీర్‌కి మరో సెట్‌బ్యాక్‌ ఎదురైంది. ఇతర చిత్రాల విజయాలని చూసి బ్లయిండ్‌గా వాటిని ఫాలో అయిపోయి సక్సెస్‌ అవ్వాలని చూసేవారికి అదెంత రాంగ్‌ అనేది తెలియడానికి రాజుగాడు ఒక ఎగ్జాంపుల్‌గా మిగిలిపోతుంది. 

బాటమ్‌ లైన్‌: అనుకున్నదొక్కటీ.. అయిందొక్కటీ!
– గణేష్‌ రావూరి