జూన్ 5న ఏం జరుగుతుంది?

మీడియాకు టాలీవుడ్ కు మధ్య రగడ సమసిపోయినట్లు కనిపిస్తున్నా, తెర వెనుక రగులుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఓ ఛానెల్ యాంకర్ కమ్ న్యూస్ ప్రెజెంటర్ విషయంలో టాలీవుడ్ జనాలు చేసిన కామెంట్లు, విమర్శలు కలిసి, మళ్లీ…

మీడియాకు టాలీవుడ్ కు మధ్య రగడ సమసిపోయినట్లు కనిపిస్తున్నా, తెర వెనుక రగులుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఓ ఛానెల్ యాంకర్ కమ్ న్యూస్ ప్రెజెంటర్ విషయంలో టాలీవుడ్ జనాలు చేసిన కామెంట్లు, విమర్శలు కలిసి, మళ్లీ ఈ రగడకు ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది.

ఓ ఛానెల్ లో పోసాని కృష్ణమురళితో డిస్కషన్ సందర్భంగా న్యూస్ ప్రెజెంటర్ 'మీ ఇండస్ట్రీలో 'లం…లు' లేరా అని అనడం, ఆ తరువాత అది పెద్ద ఇస్యూగా మారడం తెలిసిందే. అయితే ఆ తరువాత దానికి చానెల్ క్షమాపణ చెప్పింది. ఆ న్యూస్ ప్రెజెంటర్ కూడా క్షమాపణ చెప్పారు. దాన్ని పదే పదే స్క్రోల్ చేసారు.

ఆ తరువాత శ్రీరెడ్డి, ఆర్జీవీ, ఇతరత్రా వ్యవహారాలతో మీడియాకు ఇండస్ట్రీకి మధ్య బోలెడు డ్రామాలు నడిచాయి. ఆఖరికి అన్నీ టీ కప్పులో తుపాను మాదిరిగా తేలిపోయాయి. అంతా హుష్ కాకి అనుకున్నారు. హీరోల రంకెలు అన్నీ తూచ్.. ఉత్తుత్తినే అన్నట్లు మిగిలాయి. మీడియా కూడా సంయమనం పాటించింది.

కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఆ చానెల్ న్యూస్ ప్రెజెంటర్ తనను టాలీవుడ్ లోని పలువురు బహిరంగంగా దూషించడం మీద, చాలా మందికి నోటీసులు కోర్టు ద్వారా పంపించారని తెలుస్తోంది. తాను బహిరంగ క్షమాపణ చెప్పిన తరువాత కూడా తనను దూషించడం ఏమిటి? అని నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూన్ 5న కోర్టు హియరింగ్ వుందని టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ మొత్తం హాఫ్ డే లీవ్ పెట్టి అయినా, నోటీసులు అందుకున్న వారు మాత్రమే కాకుండా, వారికి సంఘీ భావంగా మిగిలిన అందరూ కూడా కోర్టు దగ్గరకు వెళ్లాలనే సందేశంతో వాట్సప్ మెసేజ్ లు వెళ్లాయని తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

ఇదిలా వుంటే ఇకపై సినిమా జనాలు తమ తమ సమావేశాలు ఏవయినా చాంబర్ లోనూ, స్టూడియోల్లోనూ కాకుండా ఎవరో ఒకరి ఇళ్లలో పెట్టుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అలా అయితే మీడియా దృష్టి పడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య ఒకటి రెండు చిన్న చిన్న సమావేశాలు జరిగినా అవి, ఇళ్లకే పరిమితం అయినట్లు వినికిడి.