పట్టుపని పదేళ్ల అనుభవం లేదు. అలా అని జీవితాన్ని చదివేసాడు అనుకోవడానికి లేదు. పుట్టిపెరిగింది కలవారి ఇంట్లో. చదివింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో. అనుభవం జస్ట్ ఒకటి రెండు సినిమాకు అసిస్టెంట్ గా. ఫస్ట్ సినిమానే ఫిలాసఫీ మీద తీసి చూపించాడు. విజయం అందుకుని, అదే పోకడ పోలేదు. మూడేళ్లు శ్రమించి ఓ మహానటి బయోపిక్ ను అజరామరంగా తీసి చూపించాడు.
అతడే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్.
అలా అని ఎక్కడా హడావుడి లేదు. లీకులు లేవు. రకరకాల సోషల్ మీడియా ఫీట్స్ చేయలేదు. మేధావి లాగా, ఇంతకంటే సూపర్ డైరక్టర్ అన్నట్లు బిల్డప్ లు ప్రొజెక్ట్ చేయలేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోయాడు. అసలేం చేస్తున్నాడో కూడా తెలియదు.
పైగా తీసుకున్న సినిమా పీరియాడిక్ డ్రామా. ఇష్టం వచ్చినట్ల మాయిష్మతి సెట్ లు వేసేయడానికి వీల్లేదు. సెట్ ప్రాపర్టీస్ లో తేడారాడానికి వీల్లేదు. కాల్పనిక ఫిక్షన్ కథ కాదు. హీరో రథాల షెడ్ లో దాక్కుని, అంతవరకు ఏం చేస్తున్నాడని అడిగేదే లేని వ్యవహారం కాదు. పక్కాగా ప్రతి సంఘటనకు కనిపించని, గీతలు, పరిమితులు వున్నాయి. ఇక ఇవన్నీ చాలదన్నట్లు పెద్దగా స్టార్ కాస్ట్ హడావుడే లేదు. అన్నింటికి మించి వందల కోట్ల బడ్జెట్ లేదు.
ఇన్నింటి నడుమ మహానటి సినిమా తీసి అబ్బురపరిచాడు. చూసిన ప్రతి సినిమా జనం ఒకటే అంటున్నారు. నాగ్ అశ్విన్ ఎంత శ్రమపడ్డాడు. ఎంత ఆలోచించాడు. ఎంత వర్క్ చేసాడు. ఎంత కృషి వుంది అని. ఓ దర్శకుడు అంతకన్నా ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం లేనంతటి సినిమాగా మహానటి నిలిచిపోతుంది. బయోపిక్ లకు ఓ కొలమానంగా మిగిలిపోతుంది.
రాజమౌళి, సుకుమార్, కొరటాల, బోయపాటి, త్రివిక్రమ్, ఇలా ఎంతమంది అయినా వుండొచ్చు. కానీ నాగ్ అశ్విన్ తీరు వేరు. దారి వేరు. ప్రజ్ఞవేరు.