ఇన్ని సినిమాలు చేసి అనుభవం సంపాదించిన హీరో నాగార్జున అదోలా కనిపించాడంటే, ఇంకేదోలా ఫీలింగ్స్ పెట్టాడంటే, సినిమాల సంగతి ఎలావున్నా, ట్రయిలర్లు, టీజర్లు కట్ చేయడంలో చేయితిరిగిన ఆర్జీవీ ఇలా రెండో టీజర్ కట్ చేసాడంటే ఇంకేం అనాలి. సూపర్ అనక. పెద్దవాళ్లు ప్రసంగం పూర్తిచేసాక, పాయింట్ లెస్ గా మాట్లాడినా చప్పట్లు కొట్టక తప్పదు. అలాగే ఆర్జీవీ-నాగ్ లాంటివాళ్లు కలిసి ఇలాంటి టీజర్ అందిస్తే సూపర్ అనికాక మరేం అనాలి.
ఆఫీసర్ మొదటి టీజర్ వచ్చింది. దశాబ్దాలకాలం తరువాత నాగ్-వర్మ కలిస్తే ఇంతేనా? అనిపించింది. సరే, మళ్లీ ఇప్పుడు చూస్కోండి అంటూ రెండో టీజర్ వదిలారు. ఇది కూడా అంతే. ఏమాత్రం ఉత్కంఠ లేదు, ఆసక్తి అంతకన్నా లేదు. ఏదో నలుగురు కుర్రాళ్లు, నాలుగు తుపాకులు పట్టుకుని షార్ట్ ఫిలిమ్ తీసినట్లు కనిపిస్తోంది తప్ప, ఆర్జీవీ వంటి డైరక్టర్ చేసినట్లుగా లేదు.
పైగా ఫస్ట్ టీజర్ కు తీసిపోకుండా, ఇందులో కూడా నాగ్ హావభావాలు వున్నాయి, చూస్కోండి.. చూస్కోండి. సూపర్.. సూపరంతే. ఇంక ఈనెల 12న ట్రయిలర్ వస్తుందంటున్నారు. అదెలా వుంటుందో చూడాలి.