చేపా చేపా ఎందుకు ఎండలేదు అంటే, ఎవరి సాకులు వారు చెప్పినట్లు వుంది, ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారం. సినిమా డైరక్షన్ నుంచి తేజ తప్పుకున్నాడు, బాలయ్యనో లేదా మరోకరో మెగా ఫోన్ పట్టుకుంటారు. అదంతా వేరే సంగతి. కానీ ఈ లోగా తేజ తాను అన్ ఫిట్ అని తానే చెప్పి తప్పుకున్నాడని బాలయ్య సినిమా యూనిట్ వర్గాలు, అలా కాదు, బాలయ్య స్టయిల్ ఆఫ్ ఫంక్షనింగ్ తో నప్పకే తేజ తప్పుకున్నాడు అని డైరక్టర్ వర్గాలు ఫీలర్ల మీద ఫీలర్లువదులుతున్నాయి.
బయోపిక్ అంటే ఇలా ఆదరాబాదారా హడావుడిగా మూడునెలలు, ఆరునెలల్లో చుట్టేసేది కాదని, దానికి తగినంత రీసెర్చి, అన్ని విధాలా పోలికలు వున్న సరైన నటులను ఎంచుకోవడం, ఆర్ట్ వర్క్, స్కెచ్ లు ఇలా చాలా వుంటుందని డైరక్టర్ తేజ వర్గాలు చెబుతున్నాయి.
కానీ బాలయ్య ఇవేమీ పట్టించుకోకుండా, షూటింగ్ కు వెళ్లిపోదాం, ఆ పాట తీద్దాం, ఈపాట తీద్దాం అంటున్నారని, సినిమాలో 53గెటప్ లు చూపిద్దాం అంటున్నారని, ఇదంతా కలిసి సినిమాను గందర గోళం చేస్తాయని ఆ వర్గాల వాదన. నిజానికి ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం, రెండు పాత పాటల రీమిక్స్, 53గెటప్ ల విషయంలో బాలయ్య పట్టుదలగానే వున్నారని తెలుస్తోంది.
కానీ అసలు తేజకు బయోపిక్ మీద అయిడియా లేదని, తనకు ఎన్టీఆర్ బయోపిక్ తీసేంత శక్తి లేదని ఆయన ఓపెన్ గా అంగీకరించారని, అసలు స్క్రిప్ట్ వదిలేసి ఆయన ఏదేదో చెబుతున్నారని, ఎంజీఆర్ గురించి తెలుసు కానీ, ఎన్టీఆర్ గురించి తెలియదని అంటున్నారని ఫీలర్లు వదులుతున్నారు. మరి ఇవన్నీ బాలయ్య యూనిట్ కు తేజకు బయోపిక్ బాధ్యత అప్పగించినప్పుడు తెలియదా?
మొత్తం మీద వీళ్ల మీద వాళ్లు, వాళ్ల మీద వీళ్లు ఫీలర్లు వదులుకోవడం తప్ప, బయోపిక్ ను ఎలా ముందుకు తీసుకెళ్లడం గురించి ఆలోచిస్తున్నట్లు మాత్రం కనిపించడం లేదు. ఏమయినా బాలయ్యకు సినిమా నిర్మాణం అచ్చివస్తున్నట్లు లేదని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో నర్తనశాల స్వంతంగా నిర్మిద్దాం అనుకుంటే అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మరి ఈ బయోపిక్ ఏమవుతుందో?