సినిమా రివ్యూ: భరత్‌ అనే నేను

రివ్యూ: భరత్‌ అనే నేను రేటింగ్‌: 3.25/5 బ్యానర్‌: డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ తారాగణం: మహేష్‌, కియారా అద్వానీ, ప్రకాష్‌ రాజ్‌, శరత్‌ కుమార్‌, సితార, రావు రమేష్‌, బ్రహ్మాజీ, పోసాని, దేవరాజ్‌ తదితరులు కూర్పు:…

రివ్యూ: భరత్‌ అనే నేను
రేటింగ్‌: 3.25/5
బ్యానర్‌: డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌
తారాగణం: మహేష్‌, కియారా అద్వానీ, ప్రకాష్‌ రాజ్‌, శరత్‌ కుమార్‌, సితార, రావు రమేష్‌, బ్రహ్మాజీ, పోసాని, దేవరాజ్‌ తదితరులు
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌
కళ: సురేష్‌ సెల్వరాజన్‌
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
ఛాయాగ్రహణం: రవి కె. చంద్రన్‌, ఎస్‌. తిరునావక్కరసు
నిర్మాత: డి.వి.వి. దానయ్య
రచన, దర్శకత్వం: కొరటాల శివ
విడుదల తేదీ: ఏప్రిల్‌ 20, 2018

ఒక పెద్ద హిట్‌ ఇచ్చిన హీరో, దర్శకుడు కలిసి మరో సినిమా చేస్తున్నారంటే దానిపై వుండే అంచనాలే వేరు. అలాంటి సినిమాలకి బిజినెస్‌ పరంగా ఎలాంటి ఢోకా వుండదు. క్రేజ్‌కి లోటుండదు కదా అని తేలిగ్గా తీసుకుని సరయిన సినిమా ఇవ్వకపోతే భారీ అంచనాలు తలకిందులయి కోటానుకోట్లు గల్లంతైపోతాయి. అందుకే 'ప్రామిసింగ్‌ ప్రాజెక్ట్స్‌' అనుకునే ఇలాంటి సినిమాలు చేసేటపుడు దర్శకులు 'ప్రామిస్‌' నిలబెట్టుకునేందుకు 'అంతఃకరణ శుద్ధి'తో కృషి చేయాలి.

దర్శకుడు కొరటాల శివకి 'శ్రీమంతుడు' తర్వాత మహేష్‌తో తాను చేస్తున్న సినిమాపై వుండే అంచనాలు ఏ స్థాయిలో వుంటాయనేది తెలుసు. అందుకు తగ్గ సినిమాని అందించడానికి అతను పడ్డ తపన, చేసిన కృషి 'భరత్‌ అనే నేను'లో ప్రస్ఫుటమవుతుంది. అలాగని కమర్షియల్‌ సక్సెస్‌ కోసం శివ సేఫ్‌ గేమ్‌ ఆడలేదు. కామెడీతో కాలక్షేపం చేసేసి లేదా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పేరిట మసాలా అంశాలు జోడించేసి ఎస్కేపిస్ట్‌ రూట్‌ని ఎంచుకోలేదు.

ఒక బలమైన నేపథ్యాన్ని ఎంచుకుని, అంతకంటే బలమైన సన్నివేశాలు రాసుకుని సాలిడ్‌ డ్రామాతో నడిపించాడు. రాజకీయాలతో అసలు టచ్‌ లేకపోయినా కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర్నుంచి మహేష్‌లో నిజంగా ఒక యువ నాయకుడే కనిపిస్తాడు. ఈ పాత్రని అతను ఎంత కన్విన్సింగ్‌గా పోషించాడంటే, భరత్‌ రామ్‌ తన కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర అవుతుంది. పవర్‌ఫుల్‌ కథానాయకుడితో చిన్న చిన్న అంశాలతో కూడా ఎంత హీరోయిజం పండించవచ్చు అనేది కొరటాల చూపిస్తే, ఎలాంటి నాటకీయతకి తావులేని నటనతోను ఎమోషనల్‌గా ఇన్‌వాల్వ్‌ చేసి, ఆ పాత్రతో ఎంతగా కనక్ట్‌ కావచ్చో మహేష్‌ తెలియజెప్పాడు.

దర్శకుడికీ, కథానాయకుడికీ మధ్య కుదిరిన అండర్‌స్టాండింగ్‌ వల్లే ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌తో ఇంత కమాండింగ్‌ డ్రామా తెరకెక్కగలిగింది. ఇదే కథని అనేక రకాలుగా పక్కదార్లు పట్టించేయడానికి, పంచ్‌ డైలాగులతో కల్తీ చేయడానికి చాలా స్కోప్‌ వుంది. కానీ అంత పవర్‌ఫుల్‌ కథానాయకుడి బలాన్ని కూడా అవసరానికి తగ్గట్టే చూపించడంలోనే ఈ చిత్రం గొప్పతనం దాగివుంది. ప్రథమార్ధం అంతటిలో హీరోకి ఒక్క ఫైట్‌ సీన్‌ కూడా లేకపోయినా అటు ఫాన్స్‌ కానీ, ఇటు మాస్‌ కానీ ఆ లోటు ఫీలవరు. ఎందుకంటే హీరో కొట్టాల్సిన అవసరం లేకుండానే ఉర్రూతలూగించే పవర్‌ఫుల్‌ సన్నివేశాలున్నాయి.

హీరో పాత్రని సరాసరి సీఎం చేసేసే కథ కనుక ఇక దాంట్లోకి రొమాన్స్‌ లాంటి అంశాలని తీసుకురావడం కాస్త కష్టమైన విషయం. కానీ కొరటాల శివ మంచి కథకుడు కనుక హీరోయిన్‌ని చాలా తెలివిగా కథలోకి తీసుకొస్తాడు. మహేష్‌ ఎంత టాలెంటెడ్‌ యాక్టర్‌ అనేది ఈ సీన్లలో తెలుస్తుంది. ఆ సన్నివేశాలు చూస్తున్నపుడు అతనో సీఎంలా కాకుండా అమ్మాయిల వంక చూసే పాతికేళ్ల సగటు కుర్రాడిలా అనిపిస్తాడు.

అతని నటనలోని ఆ చిన్నపాటి మార్పు బ్రహ్మాజీతో కార్లో జరిగే సంభాషణ ద్వారానే గ్రహించవచ్చు. అయితే ఆ చిలిపితనం ఒకే సన్నివేశానికి పరిమితం చేసి, తర్వాత క్యారెక్టర్‌ డిగ్నిటీ తగ్గకుండానే లవ్‌స్టోరీని కూడా కథలో భాగంగా నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. కొరటాల శివలో మరో మెచ్చుకోతగ్గ లక్షణం ఏమిటంటే… హీరోయిన్‌ వుంది కదా అని మాటిమాటికీ కథలోంచి బయటకి వెళ్లి ఒకటి, రెండు సీన్లు ఆమె కోసం రాసుకోడు. అవసరం మేరకే ఆ పాత్రని వాడతాడు.

కమర్షియల్‌ సూత్రాలు ఫాలో అవకుండా కూడా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందించడం కొరటాల శివ స్పెషాలిటీ. ఫస్ట్‌ హాఫ్‌ బ్రహ్మాండంగా సాగినా ద్వితియార్ధంలో ఇక ఏమి చేస్తారనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ వరకు ఆఫీస్‌కి పరిమితం చేసిన క్యారెక్టర్‌ని ఆ తర్వాత రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలకి పంపించడంతో ఇంకాస్త యాక్టివ్‌ అవుతుంది.

అయితే ప్రథమార్ధంలో మాదిరిగా ఎంజాయ్‌ చేసే సన్నివేశాలు కాకుండా 'లోకల్‌ గవర్నెన్స్‌'లాంటి రొటీన్‌ వ్యవహారాలు కాస్త విసిగిస్తాయి. దానికి ముందు వచ్చే 'దుర్గా మహల్‌' ఫైట్‌, 'వచ్చాడయ్యో సామి' సాంగ్‌ గ్రాఫ్‌ని పైకి తీసుకెళ్లడం వల్ల అటుపై తగ్గిన వేగం కాసేపు కూర్చోపెడుతుంది. డౌన్‌ అయినపుడల్లా ఒక మంచి సన్నివేశంతో కథనంలో చలనం తీసుకురావడంలో కొరటాల నేర్పరి. ఇక్కడా అలాంటి ఓ అద్భుతాన్ని చేసాడు.

ప్రెస్‌మీట్‌ దృశ్యం సరాసరి మనమే ప్రస్తుత మీడియా వ్యవస్థని, దానిని ఎంజాయ్‌ చేస్తోన్న ప్రజలని ప్రశ్నిస్తున్నంత రియల్‌గా అనిపిస్తుంది. పర్సనల్‌ వ్యవహారాలతో క్యారెక్టర్‌ అసాసినేషన్‌కి పాల్పడే మీడియాకి చురకలు అంటిస్తూనే రియాలిటీకి అద్దం పడుతుంది. మహేష్‌ అత్యంత ఎమోషనల్‌ పర్‌ఫార్మెన్స్‌తో రక్తి కట్టించిన ఈ సన్నివేశం ఈ చిత్రానికే హైలైట్‌గా నిలిచింది. ఈ సన్నివేశానికి క్లాప్స్‌ కొట్టకుండా వుండలేం. ఈ సీన్‌తో వచ్చిన ఊపుతోనే సరాసరి కథని కంచికి చేర్చి చిన్న ట్విస్ట్‌తో ముగించేయడంతో ఎక్కువ కంప్లయింట్స్‌ లేకుండానే అంత నిడివి వున్న సినిమా గడిచిపోతుంది.

కియారా తెలుగుకి కొత్త అయినా కానీ బెరుకు ఏమీ కనిపించలేదు. మహేష్‌ జంటగా బాగున్న ఆమె ఎమోషనల్‌ సన్నివేశాల్లో బాగా నటించింది. రావు రమేష్‌, ప్రకాష్‌ రాజ్‌ లాంటి సీజన్డ్‌ యాక్టర్లతో సపోర్టింగ్‌ కాస్ట్‌ బలంగా కుదిరింది. ఇక దేవిశ్రీప్రసాద్‌ చక్కని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ప్రతి సన్నివేశానికీ ప్రాణం పోయగా, సినిమాటోగ్రాఫర్లు మూడ్‌కి తగ్గ కెమెరా వర్క్‌తో కథలో ఇన్‌వాల్వ్‌ చేసారు. మాటల రచయితగా కొరటాల శివ మెప్పించాడు. దర్శకుడిగా అయితే తన ముద్ర అనుక్షణం చూపించాడు.

హీరో సీఎం అంటే ఎలాంటి తరహా అంచనాలుంటాయో అందుకు తగ్గ సంతృప్తికరమైన ప్రోడక్ట్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే కాంటెంపరరీ అంశాలకి తోడు, రిలేట్‌ చేసుకోగలిగే చాలా విషయాలని చర్చించారు, జనరంజకంగా ప్రెజెంట్‌ చేసారు. కొరటాల తన కంఫర్ట్‌ జోన్‌నుంచి బయటకి రాకుండానే 'శ్రీమంతుడు' మహేష్‌ని కంప్లీట్‌ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో చూపించి మెప్పించాడు. ఇక మహేష్‌ అయితే ఈ చిత్రంలోని బలహీనతల్ని కూడా కప్పిపుచ్చేలా భరత్‌ పాత్రకి జీవం పోసాడు.

బాటమ్‌ లైన్‌: హామీ నిలబెట్టుకున్నాడు!

– గణేష్‌ రావూరి