కత్తి పోయి ముల్లు వచ్చె ఢామ్.. ఢామ్.. ఢామ్ అన్నట్లు వుంది శ్రీరెడ్డి వ్యవహారం. అంటే ఓ విధంగా కప్పగంతులు అన్నమాట.
ఫస్ట్ ఓ ఛానెల్ కు తన దగ్గర వున్న వీడియోలు, ఫోటోలు, స్క్రీన్ షాట్ లు ఇచ్చి స్ట్రింగ్ ఆపరేషన్ అని చెప్పించారు.
తరువాత తనే తెరమీదకు వచ్చి, చోటా, మోటా వాళ్ల మీద స్క్రీన్ షాట్ లు వదిలారు.
ఆ తరువాత ఏకంగా తనను మోసం చేసారని దగ్గుబాటి అభిరామ్ మీద విరుచుకు పడ్డారు.
అంతలో మా అసోసియేషన్ సభ్యత్వం రంగంలోకి వచ్చింది.
అది పరిష్కారం అయిన తరువాత ఇండస్ట్రీలో అమ్మాయిల సమస్యలకు సారథి అయింది.
సరే, ఆ దోవన వెళ్తారేమో అనుకుంటే మళ్లీ రూటు మారింది. పవన్ కళ్యాణ్ మీదకు మళ్లింది ఆరోపణల గాలి. అసలు పవన్ ఏం తప్పు మాట్లాడారు? మీడియా అడిగితే, జస్ట్ క్యాజువల్ గా, మోసపోయిన వాళ్లు లేదా బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళితే మంచిదని, అన్నారు. శ్రీరెడ్డి ప్రశాంతంగా ఆలోచించాలి. ఆమె తన దగ్గర వున్న సాక్ష్యాలతో అభిరామ్ తనను మోసం చేసాడని మీడియాకు చెప్పినట్లే, పోలీసులకు చెప్పి వుంటే ఏం జరిగి వుండేది?
పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసివుంటే ఏం జరిగేది. కనీసం దగ్గుబాటి అభిరామ్ అనే వ్యక్తి అభిప్రాయం అయినా బయటకు వచ్చేది కదా? ఇప్పుడు శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వల్ల ఏం జరిగింది. దగ్గుబాటి అభిరామ్ మౌనంగా వుండిపోయారు. మీడియాలో ఇంత గగ్గొలు పెట్టినా, దగ్గుబాటి అభిరామ్ పెదవి విప్పించలేకపోయారు శ్రీరెడ్డి.
ఇప్పుడు చెప్పండి, పవన్ సలహా సరైనదో కాదో?
ఇక్కడ కూడా శ్రీరెడ్డిది కప్పగంతే. ముందు పవన్ కళ్యాణ్ ను పరుష పదజాలంతో దూషించారు. ఇప్పుడు 'రా.. బయటకు రా.. మా ఓట్లు అక్కరలేదా? ఇప్పుడు ఏమి చేయలేని పవన్? అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు' అన్నట్లు మాట్లాడుతున్నారు.
మొత్తం మీద ఇప్పుడు ఏం జరిగింది. శ్రీరెడ్డిని వాడుకున్నవాళ్లో, మోసం చేసిన వాళ్లో, మరెవరో అందరి ఉదంతం గప్ చుప్ అయిపోయింది. శ్రీరెడ్డి టార్గెట్ పవన్ అయిపోయారు. చిత్రంగా పవన్ ను శ్రీరెడ్డి టార్గెట్ చేయడం వల్ల మరొకరికి కూడా లాభం జరిగిందనే చెప్పాలి.
కత్తి మహేష్ మీద ఓ అమ్మాయి విమర్శలు చేసింది. దానికి ఆయన పరువు నష్టం దావా వేస్తా అన్నారు. అంతే కాదు, ఇదంతా మెగాకుట్ర అన్నట్లు ప్రకటించారు. ఎప్పుడైతే శ్రీరెడ్డికి పవన్ ఫ్యాన్స్ కు మధ్య వార్ మొదలైందో? కత్తి మహేష్ కూడా అందులో జాయిన్ అయ్యారు. పవన్ ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. దీంతో ఆయన ఉదంతం కూడా మరుగున పడిపోయింది.
కానీ ఒకటి మాత్రం క్లియర్ శ్రీరెడ్డి మీద మొన్నటి వరకు జనాల్లో ఓ సింపతీ. ముఖ్యంగా మా సంస్థ బ్యాన్ చేసినప్పటి నుంచి. కానీ అదంతా హుష్ కాకి అయిపోయింది ఇప్పుడు. ఆమెను తప్పు పట్టే వారి సంఖ్య అంతకు అంతకూ పెరుగుతోంది. ఇదిలా చూస్తుంటే ఇక ఎన్నాళ్లో శ్రీరెడ్డి పవన్ పై పోరుతో నెట్టుకురాకపోవచ్చు. అయితే సైలెంట్ అయినా అయిపోవాలి. లేదా మరో కప్పగంతు అన్నా వేయాలి. అదేంటో చూడాల్సిందే.