రాజకీయ పార్టీ అంటే వన్ మ్యాన్ షో కాదు. రాజకీయ పార్టీ అంటే హీరో చుట్టూరానే తిరిగే సినిమా కాదు. రాజకీయ పార్టీ అంటే మనకు భయపడి, ఒదిగి ఒదిగి వుంటే సినిమా నిర్మాణం లాంటిది కాదు.
రాజకీయ పార్టీ అంటే ఓ వ్యవస్థ వుండాలి. ఎత్తుగడ వుండాలి. మాటకు మాట పడాలి. ఎత్తుకు పై ఎత్తు వేయాలి. ఇవన్నీ చేయకుండానే, నాలుగేళ్లుగా కాలం గడుపుతూ వచ్చారు పవన్ కళ్యాణ్.
పార్టీకి ఎక్కడిక్కడ బాధ్యులు వున్నా కూడా వాళ్లను బయటకు తెలియనివ్వకుండా, పార్టీలో ఎవరు ఏ పని చేస్తున్నారో బయట పెట్టకుండా గుంభనంగా కాలం గడుపుతూ వచ్చారు. ఇదంతా మీడియా సపోర్టు వుంది కనుక, తెలుగుదేశంతో బంధాలు వున్నాయి కనుక సాగిపోయింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలుగుదేశంతో బంధాలు తెగిపోయాయి. దాంతో సహజంగానే మీడియా మొత్తం దాదాపు వ్యతిరేకం అయిపోయింది.
ఇప్పుడు అవసరాలు కనిపిస్తున్నాయి. ఎక్కెడక్కడో, ఎవరెవరో, ఏదేదో అంటున్నారు. వీటన్నింటిని అక్కడిక్కడే కౌంటర్ చేయాల్సి వుంది. అందుకోసం లోకల్ మీడియాతో సంబంధాలు కావాలి. రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిథి కావాలి. పార్టీ పాలసీలకు అనుగుణంగా మాట్లాడాలి. తేడా వస్తే వివరణ ఇవ్వాలి. ఇలాంటివి అన్నీ చేయాలంటే పార్టీకి కొన్ని నియామకాలు అవసరం.
ఛానెల్ 18తో మాట్లడిన మాటల్లో తేడా వచ్చింది. అనంతపురం ప్రాంతంలో జనసేన కార్యకర్తలపై దాడులు, ఫిర్యాదులు ప్రారంభమయ్యాయి. ఇవన్నీ చూసుకోవాలంటే పవన్ ఒక్కరి వల్ల కాదు. ప్రతి జిల్లాకు ఓ పార్టీ యంత్రాంగం వుండాలి. బాధ్యులు వుండాలి. బలమైన యంత్రంగం లేకుండా తెలుగుదేశం పార్టీని, దానికి బలమైన బ్యాకింగ్ ఇచ్చే మీడియాను ఢీ కొనడం జనసేన వల్ల కాదు.
పైగా జనసేన నానా కసరత్తు చేసి, సోషల్ మీడియా విభాగాన్ని తయారుచేసుకుంది. కానీ సోషల్ మీడియాలో పవన్ పై పోస్టులు చెలరేగపోతున్నాయి. తెలుగుదేశం పార్టీతో కలిసి వున్నన్నాళ్లు ఈ పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఇలా మారింది అంటే ఎవరు కారణం అన్నది ఇట్లే అర్థమైపోతోంది. మరి పవన్ సోషల్ నెటవర్క్ విభాగం ఏం చేస్తున్నట్లు?
మొత్తం మీద పవన్ ఇకనైనా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి. కేవలం తన చరిష్మానే నమ్ముకుంటే, తెలుగుదేశం పార్టీ వ్యూహాలకు చిత్తయిపోవడం గ్యారంటీ.