జనసేన తొలి వార్షిక మహాసభ మంగళగిరిలో జరుగుతూంది. ఎవ్వరూ ఊహించని షాక్ ఇచ్చాడు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. నిజంగా ఎవ్వరూ ఊహించనిది ఇది. గడచిన మూడున్నరేళ్లలో పవన్ వైఖరిని పదే పదే గమనిస్తూ, ఆయన తడబాటును, ఒక అడుగు ముందుకు వేయడాన్ని, మరో అడుగు వెనక్కు వేయడాన్ని, తెలుగుదేశం పార్టీని తరచు వెనకేసుకురావడాన్ని గమనించిన వారంతా, మంగళగిరి మహాసభలో పవన్ స్పీచ్ గురించి పెద్దగా ఆశలేం పెట్టుకోలేదు. ఇది వాస్తవం.
అందుకే పెద్దగా ఎవ్వరూ మంగళగిరి సభ గురించి ఆసక్తి కనబర్చకుండానే, మళ్లీ ఏ విధంగా పవన్ నాలుక మడతేస్తాడా? అని ఉపన్యాసం వినడం ప్రారంభించారు. అలాంటి వాళ్లందరినీ ఒక్కసారి షాక్ కు గురించేసాడు పవన్ కళ్యాణ్. సాదా సీదాగా సాగిపోతున్న సినిమాలో, చటుక్కున భయంకరమైన ట్విస్ట్ వచ్చినట్లు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసం మలుపు తిరిగింది.
ఆరంభంలో నెమ్మదిగా సాగుతూ, ఉన్నట్లుండి మలుపు తీసుకుని, తెలుగుదేశం వైపుగా తన మాటల తూటాలను ఎక్కు పెట్టారు. ఏదో ఒకటి రెండు మాటలు విసిరి ఊరుకుంటారు అనుకున్నారంతా. కానీ ఆగలా? అలా అలా ఎక్కు పెడుతూనే వున్నారు. ప్రసంగించిన గంటన్నరలో సింహభాగం, అంటే గంటకు పైగా తెలుగుదేశం పార్టీ మీదనే బాణాలు వేస్తూ, తూటాలు పేలుస్తూ సాగిపోయారు.
పవన్ సాధారణంగా మాట్లాడేడపుడు నిలకడగా వుండలేరు. అది అందరికీ తెలుసు. కానీ దానికి భిన్నంగా ఈ సభలో పవన్ చాలా సెటిల్డ్ గా మాట్లాడారు. అలాగే పాయింట్లు రాసుకువచ్చి, ఆయన ఓ ఫ్లోలో మాట్లాడతారు. ఆ ఫ్లో ఓ పద్దతిలో వుండదు. ఆయన చిత్తానికి వచ్చినట్లు అది మారుతుంది. కానీ ఈ సారి పవన్ తన ఉపన్యాసం మొత్తం రోజుల తరబడి రిహార్సల్ చేసి, బుర్రలోకి మొత్తం ఎక్కించేసుకుని, ఆపైన ఇక్కడ మాట్లాడినట్లు కనిపించింది. ఇది కూడా ఓ షాక్ నే.
సాధారణంగా జనసేన ఆవిర్భావం నుంచి ఎక్కువగా తెల్ల లాల్చీ లేదా లైట్ కలర్ లాల్చీలు వేసుకోవడం అలవాటుగా వస్తోంది. అలాగే జనం ముందుకు వచ్చినపుడల్లా కాస్త మాసిన గెడ్డంతో పవన్ కనిపించేవారు. కానీ ఈసారి లాల్చీలా కాకుండా, సూట్ టైపు లుక్ తో వుండే షర్ట్ వేసుకుని వచ్చారు.
ఇలా ఒకటి కాదు చాలా మార్పులు కనిపించాయి ప్లీనరీ మహాసభలో. అందుకు తగినట్లే తెలుగుదేశం పార్టీని అభిమానించే వారంతా నిలువునా ఆశ్చర్యపోయేలా? పవన్ కళ్యాణ్ అంటే మండిపడిపోయేలా పవన్ ప్రసంగం స్పీచ్ సాగింది.