కోన-శౌర్య.. ఏం జరుగుతోంది?

ఇండస్ట్రీలో కోన వెంకట్ ఓ విలక్షణమైన వ్యక్తి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చి, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా విభిన్న ప్రక్రియలు చేపట్టి, ఆఖరికి ఇండస్ట్రీలో అందరివాడు అనే టైపు పాత్ర పోషిస్తున్నారు. అటు…

ఇండస్ట్రీలో కోన వెంకట్ ఓ విలక్షణమైన వ్యక్తి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చి, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా విభిన్న ప్రక్రియలు చేపట్టి, ఆఖరికి ఇండస్ట్రీలో అందరివాడు అనే టైపు పాత్ర పోషిస్తున్నారు. అటు పవన్ నుంచి ఇటు నాని వరకు, అటు సమంత నుంచి ఇటు నివేథా వరకు అందరితోనూ కోనకు ఫుల్ ర్యాపో వుంది. ఇక బాలీవుడ్ లో అయతే మరీనూ.

ఈ పరిచయాలు వాడుకుంటూ, సినిమాలు సెట్ చేస్తూ, తన కోన ఫిలిమ్ కార్పొరేషన్ ను పెంచుకుంటూ వస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఓ హీరోతో సమస్య వచ్చింది. సినిమా చేయడంలో తకరారు మొదలైంది. ఈ విషయంలో రెండు పక్షాలు అవతలివారిది తప్పు అంటూ వాదిస్తున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఏడాది క్రితం నాగశౌర్యతో ఓ ప్రాజెక్టు సెట్ చేసారు కోన వెంకట్. విశాఖకు చెందిన బిల్డర్ విజయకుమార్ నిర్మాత. సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ దర్శకుడు. 65లక్షలకు నాగశౌర్యతో ఒప్పందం. ఇరవై లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ఆఫీసు తీసారు.

అయితే అదే సమయంలో నాగశౌర్య ఫ్యామిలీ స్వంత సినిమా స్టార్ట్ చేసింది. ఆ సినిమాకు పని చేసి పెట్టమని సాయి శ్రీరామ్ ను కోరింది. ఎలాగూ తను డైరక్ట్ చేయబోయే హీరో అని, ఆయన కూడా ఛలో సినిమాకు చాలా ఆసక్తిగా పని చేసారు. ఛలో సినిమాకు బ్యాక్ సీట్ డైరక్షన్ అంతా మనవాడిదే అని గుసగుసలు కూడా వున్నాయి.

సరే, ఆ వైనం అలా వుంచితే, ఛలో హిట్ అయింది. ఇప్పుడు నాగశౌర్య మరో స్వంత ప్రాజెక్టు నర్తనశాల స్టార్ట్ చేస్తున్నారు. కోన వెంకట్ సెట్ చేసిన ప్రాజెక్టును ఏదో ఒక నెపంతో వెనక్కు నెడుతున్నారన్నది ఆరోపణ. అప్పుడు కథ సూపర్ అని చెప్పిన శౌర్య, ఇప్పుడు అదే కథకు వంకలు పెడుతున్నారని అంటున్నారు.

ఏడాది పాటు బోలెడు ఖర్చుచేసామని, ఇరవై లక్షలు అడ్వాన్స్ ఇచ్చామని, ఇప్పుడు తామేం చేయాలని వాళ్ల వాదన. ఇదంతా రెమ్యూనిరేషన్ పెంచడం కోసమేమో అన్న అనుమానం కూడా ఆ యూనిట్ వ్యక్తం చేస్తోంది. తమ దగ్గర పక్కా డాక్యమెంటరీ అగ్రిమెంట్లు వున్నాయంటోంది.

శౌర్య ఫ్యామిలీ వాదన

తాము కోన వెంకట్ సినిమా చేయడానికి కచ్చితంగా ఆసక్తిగా వున్నామన్నది శౌర్య ఫ్యామిలీ జనాల వాదన. అయితే అడ్వాన్స్ ఇచ్చినపుడు లైన్ మాత్రం చెప్పారని, ఓకె చేసామని, తీరా లైన్ ను కథగా మార్చేసరికి బాగా రాలేదని, అదే చెప్పామని, సరైన స్క్రిప్ట్ గా మార్చినా, లేదా వేరే స్క్రిప్ట్ తెచ్చినా చేయడానికి రెడీ అంటున్నారు. శౌర్య ఈ సినిమా కోసమే నాలుగునెలలుగా గెడ్డం పెంచాడని, చేసే ఉద్దేశం లేకపోతే ఎందుకు పెంచుతాడని ప్రశ్నిస్తున్నారు.

సాయి శ్రీరామ్ అంటే పూర్తి గౌరవం వుందని, కానీ అలా అని బాగా లేని స్క్రిప్ట్ తో సినిమా చేయలేం కదా? ఛలో సక్సెస్ తరువాత జాగ్రత్తగా వుండాలి కదా అని అంటున్నారు. వాళ్లు స్క్రిప్ట్ పూర్తిగా రెడీ చేసేదాకా, రెండు మూడు నెలలు ఖాళీగా వుండిపోతే హీరోకు నష్టం కాదా అని నిలదీస్తున్నారు. ఒక పక్క తమతో స్క్రిప్ట్ మీద డిస్కషన్లు స్టార్ట్ చేస్తూనే, అదే స్క్రిప్ట్ ను వేరే హీరోలకు కూడా చెబుతున్నారని, మరి దానికేం అంటారని ప్రశ్నిస్తున్నారు.

విషయం కౌన్సిల్ కు?

ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని నిర్మాత విజయకుమార్ ద్వారా కోన వెంకట్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను అప్రోచ్ అయ్యే ఆలోచనలు చేస్తున్నారు. కాగల కార్యం గంధర్వులు తీరుస్తారన్నట్లు, ఇప్పుడు ఈ సమస్య కౌన్సిల్ దృష్టికి వెళ్తే, ముందు స్క్రిప్ట్ ను పదిమందిలో పంచాయతీ పెట్టినట్లేనేమో? కాస్త ఎమికబుల్ గా సెటిల్ చేసుకుంటే మంచిదన్నది మధ్యవర్తుల సలహా. ఏం జరుగుతుందో? ఏమో?