ఇలా చేస్తే ఎలా ప్రకాష్ రాజ్?

వృత్తి, ఆ వృత్తికి కారణమైన ఇండస్ట్రీ. ఈ రెండింటి తరువాతే మరేదైనా. కానీ కొంతమంది నటులు ఈ విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తుంటారు. వివాదాలకు కేంద్రం అవుతుంటారు. గతంలో ఒకటి రెండు సార్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్…

వృత్తి, ఆ వృత్తికి కారణమైన ఇండస్ట్రీ. ఈ రెండింటి తరువాతే మరేదైనా. కానీ కొంతమంది నటులు ఈ విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తుంటారు. వివాదాలకు కేంద్రం అవుతుంటారు. గతంలో ఒకటి రెండు సార్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ వివాదాలకు కేంద్రం అయ్యారు. మళ్లీ లేటెస్ట్ గా అదే జరిగినట్లు తెలుస్తోంది. 

విషయం ఏమిటంటే, రంగస్థలం సినిమాను దర్శకుడు సుకుమార్ రెండేళ్ల బట్టి చెక్కుతూనే వున్నారు. సినిమా డేట్ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కొద్దీ ఆయన షూటింగ్ చేస్తూనే వస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేసినా, చేయకున్నా సంక్రాంతికి ఫస్ట్ కాపీ రెడీ అన్న వాళ్లు, మార్చి వచ్చినా ఇంకా సినిమాకు గుమ్మడికాయ కొట్టలేదు.

నిన్నటికి నిన్న అంటే ఫిబ్రవరి 28న రంగస్థలం కోసం ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో కొన్ని సీన్లు తీయాల్సి వుంది. ఆయన రెడీ అన్నారు. కానీ ఆది పినిశెట్టి కావాలి. ఆది చూస్తే, విశాఖలో వేరే షూటింగ్ లో వున్నారు. తాప్సీతో సహా బోలెడు మంది ఆర్టిస్టుల కాంబినేషన్ అది. దీంతో నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ ఆ యూనిట్ వాళ్లను రిక్వెస్ట్ చేసారు. ప్రకాష్ రాజ్ మళ్లీ దొరకడు, ప్లీజ్, ప్లీజ్ అంటూ. దాంతో వాళ్లు షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి, నష్టం భరించి, ఆదిని ముందు రోజే ఫ్లయిట్ ఎక్కించి హైదరాబాద్ పంపేసారు.

కానీ ప్రకాష్ రాజ్ హైదరాబాద్ లో వుండకుండా ముంబాయి వెళ్లిపోయారు. దాంతో రంగస్థలం నిర్మాత, దర్శకులకు కన్నీళ్లే తక్కువ. ఏం చేయాలో తెలియదు. ఆఖరికి ప్రకాష్ రాజ్ ను బదులు డూప్ ను పెట్టి కొన్ని సీన్లు కానిచ్చారు. డూప్ తో సాధ్యం కానివి వుండనే వున్నాయి.

ప్రకాష్ రాజ్ తిరిగి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆది విశాఖ వెళ్లిపోయాడు. రంగస్థలం యూనిట్ జనాలు ప్రకాష్ రాజ్ ను అడిగితే సరైన సమాధానం రాలేదని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఈ సంగతి తెలిసి ఇండస్ట్రీవర్గాలు కామెంట్ చేస్తున్నాయి. ట్విట్టర్ లో నిలదీయడం, ప్రశ్నించడం లాంటివి చేయడం గొప్పకాదని, ఇంతవాడిని చేసిన ఇండస్ట్రీని ముందు గౌరవించాలని అంటున్నారు. అసలు ఇండస్ట్రీ జనాలది కూడా తప్పే అని, తరచు ఇలా చేసేవారిని కాకుండా అనేకమంది మంచి నటులను ఎంచి తీసుకురావాలని సూచిస్తున్నారు.

మొత్తానికి రంగస్థలానికి ఎన్ని కష్టాలో? ఇంకా ఎన్నాళ్లో?