క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ తన పవర్ స్టార్ అవతారాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి, జనసేనాధిపతిగా జనం ముందుకు వెళ్లిపోవడానికి డిసైడ్ అయ్యారు. అజ్ఞాతవాసి సినిమా ఇచ్చిన షాక్ నుంచి పవన్ వేగంగానే తేరుకున్నారు. సినిమాల్లో మళ్లీ ప్రయత్నించే కన్నా, ముందుగా రాజకీయంగా బలోపేతం కావాలని డిసైడ్ అయ్యారు. అందుకే నిర్విరామ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.
తెలంగాణలోని కొండ గట్టు నుంచి యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. యాత్ర ఎలావుంటుంది? విధి విధానాలు ఏమిటి అన్నది రూట్ మ్యాప్ ఏమిటన్నది త్వరలో ప్రకటిస్తారు. జగన్ పాదయాత్ర కు పోటీగా పవన్ యాత్ర వుంటుందని ఎప్పటి నుంచో గుసగుసలు వున్నాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి. రూట్ మ్యాప్ వచ్చిన తరువాత ఈ విషయంలో మరింత క్లారిటీ వస్తుంది.
సినిమా చేయాలి అంటే సరైన కథ, డైరక్టర్ అవసరం. ఇఫ్పటికే అత్తారింటికి దారేది తరువాత చాలా ప్రయత్నాలు చేసి పవన్ హిట్ కొట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. మరో ఫ్రయత్నం చేసినా హిట్ వస్తుందనీ లేదు. రాదనీ లేదు. అదే రాజకీయంగా అయితే వేరే సంగతి. జనాల్లో తన ఫాలోయింగ్ ను నిరూపించుకొవచ్చు. మీడియాలో కవరేజ్ పెంచుకుని, మళ్లీ తన ఆత్మ స్థయిర్యాన్ని పుంజుకుని, అప్పుడు సినిమా చేస్తే, దాని తీరు వేరుగా వుంటుంది.
మళ్లీ త్రివిక్రమ్ తోనే సినిమా చేసి హిట్ కొట్టాలనే సంకల్పం పవన్ కు, త్రివిక్రమ్ కు ఇద్దరికి వుందని గుసగుసలు వున్నాయి. కానీ దానికి చాలా టైమ్ వుంది. అందువల్ల ఇప్పటి నుంచి ఇంట్లో వుండే బదులు, రాజకీయ వేదిక మీదకు వస్తే, ఉభయ కుశులోపరిగా వుంటుంది.
అయితే ఈ పర్యటన తెలుగుదేశంతో కలిసి ముందుకు సాగి, ఆ పార్టీని 2019లో విజయం దిశగా నడిపేందుకా? లేక జనసేనను బలోపేతం చేసుకుని, ఒంటరి పోటీకి రెడీ అయ్యేందుకా? అన్నది ఇప్పట్లో సమాధానం లభించే ఫ్రశ్న కాదు. కానీ పవన్ మరో ఆరేళ్ల వరకు అంటే 2024 వరకు ఒంటరి పోటీకి దిగే ఆలోచనలు, తెగింపు లేదని రాజకీయ పరిశీలకుల అంచనా.
ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పట్లో మరో సినిమా లేదని. ఇక ఒంటరి పోరు క్లారిటీ కూడా రావాల్సి వుంది.