సౌతిండియా సినీస్టార్లు.. సినిమా బయటే సిసలైన వినోదం!

ఒకవైపు మలయాళ చిత్రపరిశ్రమ.. మరోవైపు తెలుగు చిత్రపరిశ్రమ.. అడకత్తెరలో తమిళ చిత్రపరిశ్రమ.. ఓవరాల్‌గా ఇప్పుడు సౌతిండియన్‌ ఫిల్మ్‌ఇండస్ట్రీలు షేక్‌ అవుతున్నాయి. ఇండస్ట్రీల కూసాలు కదులుతున్నాయి. వివాదాలతో సినీ చిత్రప్రముఖులు పోలీస్‌ స్టేషన్‌ గడపలు ఎక్కారు..…

ఒకవైపు మలయాళ చిత్రపరిశ్రమ.. మరోవైపు తెలుగు చిత్రపరిశ్రమ.. అడకత్తెరలో తమిళ చిత్రపరిశ్రమ.. ఓవరాల్‌గా ఇప్పుడు సౌతిండియన్‌ ఫిల్మ్‌ఇండస్ట్రీలు షేక్‌ అవుతున్నాయి. ఇండస్ట్రీల కూసాలు కదులుతున్నాయి. వివాదాలతో సినీ చిత్రప్రముఖులు పోలీస్‌ స్టేషన్‌ గడపలు ఎక్కారు.. దశాబ్దాల సినీచరిత్రలో ఇంతటి వివాదాలు.. ఎన్నడూ తలెత్తలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇంతకు ముందు సినిమావాళ్ల వివాదాలు ఏవైనా వార్తల్లోకి వచ్చాయంటే.. అవి చాలా తేలికగా పరిష్కారం అయిపోయేవి. వాళ్లలో వాళ్లు సర్దుబాటు చేసుకునేవాళ్లు. చివరకు సినిమా వాళ్లు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలతోనో, నేరాలు చేసో వెలుగులోకి వచ్చినా.. అవి కూడా త్వరగానే సద్దుమణిగిపోయేవి, ఎలాంటి నొప్పిలేకుండా పరిష్కారం అయిపోయేవి. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితులు అలాలేవు! ఒకేసారి దక్షిణాదిన రెండు భాషల పరిశ్రమలు వివాదాల్లో కూరుకుపోయాయి. స్టార్లుగా, ఆరాధనీయ వ్యక్తులుగా వెలిగినవారు వెధవలైపోయారు!

దిలీప్‌ వ్యవహారం ఇంకా ఎక్కడ వరకూ..?

'ఛీ..'అంటున్నారు మలయాళీ చిత్ర ప్రేక్షకులు. ఇన్నేళ్ల దిలీప్‌ను అత్యంత ఆరాధనీయంగా చూసినవాళ్లు కూడా ఇప్పుడు అతడిని అసహ్యించుకుంటున్నారు. మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగిఉండిన దిలీప్‌ తరపున ఇప్పుడు మారుమాట్లాడే వాళ్లు లేరు. అతడు మంచోడు.. అయి ఉంటాడేమో అని ఆలోచించే వాళ్లుకూడా లేరు. దిలీప్‌ను మలయాళీ చిత్ర నటీనటుల మండలి నుంచి ఇప్పటికే సస్పెండ్‌ చేసేశారు.

ఇక ఫ్యాన్స్‌ పల్స్‌ను పట్టుకో యత్నిస్తే.. దిలీప్‌ను ఛీదరించుకుంటున్న వారిలో వారే ముందున్నారు. దిలీప్‌ అంటే అల్లాటప్పా కాదు.. దాదాపు పాతికేళ్ల నుంచి ఇండస్ట్రీలో వెలుగుతున్నవాడు. స్టార్‌ హీరోగా ఎదిగిన వాడు.. మోహన్‌లాల్‌ మమ్ముట్టీల తర్వాత అతడే.. అనిపించు కున్నవాడు. అంతేనా.. కేవలం హీరోగానే గాక.. అన్ని రకాలుగానూ ఇండస్ట్రీపై పట్టుబిగించినవాడు. కోట్లకు పడగలు ఎత్తి.. సినీ వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నవాడు. ఆల్మోస్ట్‌.. మలయాళ ఇండస్ట్రీని గ్రిప్‌లో ఉంచుకున్నాడు.. ఆ అధిపత్యమే అహంకారంగా మారింది. అందుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాడు దిలీప్‌.

అతడిది రాక్షసత్వమే.. ఇతడు దాడిచేయించిన నటికి అప్పటికే ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. ఆ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ కూడా కనపడాలని తన రౌడీలకు అతడు ఆదేశాలు జారీ చేశాడు.. ఆ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ వీడియోలో రావాలి.. ఆ నగ్నవీడియో తనదికాదు అని ఆమె అనడానికి అవకాశమే ఉండకూడదు.. అని దిలీప్‌ అత్యంత కర్కశంగా ఆదేశాలు జారీచేశాడంటే.. అతడి    శాడిజం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరో మలయాళీ నటుడు కళాభవన్‌ మణి హత్య వెనుక కూడా దిలీప్‌ పాత్ర ఉందనే మాటా వినిపిస్తోంది.

ఇలాంటి కేసుల నేపథ్యంలో దిలీప్‌కు బెయిల్‌ ఇవ్వ డానికి కూడా కోర్టు నిరాకరించేసింది. ఆగస్టు ఎనిమిది వరకూ మళ్లీ బెయిల్‌ కోసం రాకు.. అని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో దిలీప్‌ భార్య, నటి అయిన కావ్య మాధవన్‌ పాత్ర గురించి పోలీసులు విచారణ చేపట్టారు. మరి ఆమెపై కూడా కేసులు నమోదైనా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని తెలుస్తోంది. మరి అదే జరిగితే.. దిలీప్‌ కుటుంబం మరింత ఇబ్బందుల్లో కూరు కుపోయినట్టే.

టాలీవుడ్‌ది మరో వ్యథ…

ఇప్పటి వరకూ నోటీసులు అందుకున్న వారు… విచార ణకు హాజరైన వారు.. జస్ట్‌ జుజుపీ! అసలైన పెద్ద తలలు లోపలే ఉన్నాయి. అవన్నీ లోలోనే దాగున్నాయి. వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి, వాళ్లందరినీ విచారణలకు పిలిస్తే.. టాలీవుడ్‌ కంపించి పోతుంది. ఇండస్ట్రీ కూసాలు కదిలిపోతాయి. అందరి రూపాలను చూపించడానికి ప్రభుత్వం, పోలీసులు కూడా వెనుకాడుతున్నారు.. అనే మాట గట్టిగా వినిపిస్తోందిప్పుడు.

నోటీసులు అందుకున్న వాళ్లు ఎలాంటి కుల, ఆర్థిక నేపథ్యం లేనివాళ్లు మాత్రమే.. అలాంటి అండ, అవకాశం ఉన్నవాళ్ల పేర్లే బయటకు రావడంలేదు.. అనే ప్రచారం ఆది నుంచి జరుగుతోంది. ఎలాగూ మన ప్రభుత్వాలపై ప్రజలకు ఉన్న నమ్మకాలు అంతంత మాత్రమే. తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవేమాట చెబుతున్నాయి. అందరి పేర్లనూ బయటకు తీయడం లేదు… అనే విమర్శను రిపీట్‌ చేస్తున్నాయి.

ఎవ్వరి పేర్లూ లేవని చెప్పరేం..

డ్రగ్స్‌ వ్యవహారంలో ఇప్పటి వరకూ వీళ్ల పాత్ర మాత్రమే ఉంది.. మరెవరి పాత్రా లేదు.. అని ఇంత వరకూ ప్రకటన రాలేదు. బయటపడ్డవాళ్ల పేర్లను మాత్రం బాగానే వాడుతున్నారు కానీ.. మిగతావారి పేర్లను మాత్రం మాట మాత్రమైనా ఒక్కరు కూడా ఎత్తడం లేదు. ఇప్పటి వరకూ జరిగింది చాలు.. ఇక కొత్త వాళ్ల పేర్లు బయట పెట్టవద్దు.. అని కొంతమంది సినీ ప్రముఖులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారనే మాట ప్రముఖంగా వినిపిస్తోంది.

మరి ఈ పన్నెండు మందే.. డ్రగ్స్‌ వ్యవహారంలో ఉన్నారు.. ఎవరి పాత్రా లేదు.. అని ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు. విమర్శలు చేసిన వారిపై ఎదురుదాడి మాత్రమే చేస్తున్న విషయాన్ని గమనించవచ్చు.

తమిళ ఇండస్ట్రీది మరో కథ..

తమిళ చిత్ర పరిశ్రమ కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తమిళనాడు రాజకీయాలతో పెనవేసుకు పోయిన ఆ చిత్రపరిశ్రమ.. జయలలిత మరణం సమయం నుంచి వార్తల్లో ఉంటూనే వస్తోంది. జయలలిత మరణానంతరం పన్నీరు సెల్వాన్ని దించి.. శశికళ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూసినప్పటి నుంచి సినీ పరిశ్రమ రోడ్డుకు ఎక్కింది. చాలా మందిసినిమా వాళ్లు పన్నీరు సెల్వాన్ని కలిసి.. తమ సంఘీభావం ప్రకటించారు. తమిళనాడు రాజకీయాలకు దూరంగా ఉండలేరు అక్కడి సినిమావాళ్లు. అలా మొదలైన లొల్లిని రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లు కొనసాగిస్తున్నారు.

రజనీకాంతేమో రాజకీయాల్లోకి వస్తానని సూఛాయగా చెప్పాడు. అలా ఒక కుదుపు కుదిపాడు.. మళ్లీ మరేం మాట్లాడకుండా ఉన్నాడు. ఇక రజనీ రాజకీయ పార్టీ గురించి లొల్లి మొదలైంది. రజనీ రాజకీయాల్లోకి రావాలని కొందరు.. ఎందుకు? అని మరికొందరు మాట్లాడుతున్నారు. రజనీమాత్రం ఒక ప్రకటన చేసి వెళ్లిపోయాడు. పార్టీ పెట్టడం ఖాయమేనా.. కాదా.. అనే క్లారిటీ ఇవ్వకుండా తన సినిమా పనుల్లో బిజీఅయిపోయాడు.  అయితే రజనీ పార్టీ మిగతావారి స్పందనలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి.

ఇండస్ట్రీలోని వారే ఈ విషయంలో నిలువునా చీలిపోయారు. ఇక కమల్‌ సంగతి సరేసరి.. ఈ మధ్య కాలంలో హాట్‌ కామెంట్లకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు కమల్‌. ప్రతి అంశం గురించి తన అభిప్రాయాలను చాలా ఓపెన్‌గా చెబుతున్నాడు. రజనీ విషయంలో పళనిసామి ప్రభుత్వం విషయంలో.. ఇలా ప్రతి వ్యవహారంలోనూ కమల్‌ స్పందిస్తున్న తీరు వివాదాలుగా మారుతున్నాయి. వీళ్లే కాదు..తమిళసినీ పరిశ్రమ వ్యక్తుల్లో అనునిత్యం ఏదో ఒక రచ్చను పుట్టించగల టి.రాజేందర్‌ లాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. ఓవరాల్‌గా.. తమిళనాట సినిమావాళ్లు అనునిత్యం వార్తల్లో ఉంటూనే ఉన్నారు.

కొంతలో కొంత బెటర్‌ మాత్రం కన్నడీగులే. వీళ్లు వివాదాలకు దూరదూరంగా మసలు కుంటున్నారు. తమకేం పట్టనట్టుగా ఉన్నారు. మధ్యలో శివరాజ్‌ కుమార్‌, రాహుల్‌ గాంధీల భేటీ ఆసక్తిని రేపినా.. రాజ్‌కుమార్‌ తనయుడు రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారం జరిగినా.. అబ్బే, అదేం లేదని ఆయన క్లారిటీ ఇవ్వడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. 

తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలు మాత్రం మంచి వేడి మీదే ఉన్నాయి. వీటిల్లో రేగిన రచ్చలు చూస్తుంటే.. ఇప్పుడప్పుడే చల్లారేలా లేవు. జనాలకు, మీడియాకు మాత్రం ఇదంతా టైంపాస్‌కు చక్కటి వినోదం అయ్యింది!