లై అంటేనే అబద్దం. ఇంక ఆ సినిమా మీద అబద్దాలు ప్రచారం కావడం ఏమిటి? ఇంతకీ విషయం ఏమిటంటే, లై సినిమాను ఆగస్టు 11న విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. అలాగే అదో రోజు విడుదల చేస్తామని నేనే రాజు నేనే మంత్రి నిర్మాతలు ప్రకటించారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకీ నాయక కూడా అదే డేట్ కు ఫిక్సయింది.
జయ జానకీ నాయక సంగతి బాగానే వుంది. రాజు-మంత్రి కూడా ఓకె. కానీ ఎవరో పని గట్టుకుని, లై సినిమా ఆగస్టు 11న రాదని ఫీలర్లు వదుల్తున్నట్లు 14 రీల్స్ దృష్టికి వచ్చిందట. దాంతో వాళ్లు కంగుతిని, ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేసే పనిలో పడ్డట్లు వినికిడి.
తమ సినిమా ముమ్మాటికీ ఆగస్టు 11నే విడుదలవుతుందని, అన్ని పనులు పూర్తయ్యాయని, ఆలస్యం కావడానికి అవకాశమే లేదని 14 రీల్స్ వర్గాలు తెలిపాయి. కేవలం బయ్యర్లను, డిస్ట్రిబ్యూటర్లను కన్ఫ్యూజ్ లో పడేయడానికి ఎవరో ఇలా ప్రచారం చేస్తున్నారని, అంతకు మించి మరేమీ కాదని అంటున్నారు. ఏమిటో ఈ సినిమా రాజకీయాలు. లై సినిమాలో నితిన్ హీరో. హను రాఘవపూడి దర్శకుడు. అనిల్ సుంకర తదితరులు నిర్మాతలు.