తెలంగాణ ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది.. పెద్ద పెద్ద వాళ్లను విచారణకు పిలిపించేసింది… ప్రభుత్వం దూసుకుపోతోందని కొంతమంది నెటిజన్లు ఉత్సాహవంతంగా పోస్టులు పెడుతున్నారు. కానీ అసలు పెద్దవాళ్లు తప్పించేసుకున్నారు.. పెద్దవాళ్లలో చిన్నవాళ్లనే పట్టుకున్నారు.. అనే మాటా అదే స్థాయిలో వినిపిస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో విచారణ కొంచెం ఆసక్తిని రేకెత్తిస్తూ, మరికొంత అనాసక్తిని కలిగిస్తూ సాగుతోంది.
సుబ్బరాజు.. విచారణ సుధీర్ఘ సమయం జరిగింది, విచారణలో ఆయన దాదాపు ఇరవైమంది సినిమా నటుల పేర్లు బయటపెట్టాడని, వారందరికీ డ్రగ్స్ అలవాటు ఉందని, ఏయే మార్గాల ద్వారా వారికి డ్రగ్స్ సరఫరా అయ్యిందో రాజు వివరించాడని… వార్తలు వచ్చాయి. పూరీ జగన్నాథ్ విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే ఉంది.. తొలిరోజు తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పూరీ అదే మాటే చెప్పాడని.. తను ఒక్కడిని మాత్రమే కాదు, ఇండస్ట్రీలో చాలామంది వాడుతున్నారు.. వారెవరికీ నోటీసులు ఇవ్వలేదే.. అని పూరీ వాదించాడని అంటారు.
ఇదే డ్రగ్స్ వ్యవహారంలో విచారణను అమితంగా ప్రభావితం చేసే అంశం. కొంత మందికి నోటీసులు ఇచ్చారు… విచారణకు పిలిపించారు.. అలా విచారణకు వచ్చిన వారికి మరిన్ని గుట్లుముట్లూ తెలుసు.. వీళ్ల దగ్గరున్నంత సమాచారం పోలీసుల వద్ద కూడాలేదు. ఇక పోలీసులకు పరిమితులు ఉండనే ఉంటాయి. ఇప్పటికే కొంతమందికి నోటీసుల నుంచి మినహాయింపులు ఇచ్చారనే ప్రచారం మీడియా సర్కిల్స్ లో గట్టిగా సాగుతోంది. మరి అదే నిజం అయితే.. డ్రగ్స్ కేసు విచారణ నీరు గారిపోతున్నట్టే.. నోటీసులు జారీ చేసిన సినిమా వాళ్లను గంటలకు గంటలు కూర్చోబెడుతున్నా.. ఎవ్వరినీ అరెస్టు చేయడం లేదు.
పూరీ చాలా మందికి డ్రగ్స్ ఇచ్చాడు, రవితేజ ద్వారా చాలా మందికి డ్రగ్స్ వెళ్లాయి.. అంటున్నారు, మరి వారెవరి అరెస్టూ జరగలేదు. తీగలాగితే డొంకంతా కదులుతుంది.. అది కదిలిందంటే, కథంతా వేరే అవుతుంది. గట్టిగా లాగితే ఎవరి కూసాలు కదులుతాయో తెలీదు. పోలీసుల వద్ద కన్నా.. నోటీసులు అందుకున్న వారి వద్దే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో..పోలీసులను రివర్స్ లో వాళ్లే బ్లాక్ మెయిల్ చేయడానికి స్కోప్ ఉందని స్పష్టం అవుతున్న తరుణంలో.. ఈ డ్రగ్స్ కేసు విచారణ తేలేదేనా అని? నయీం కేసులా ఇదీ నీరుగారిపోతుందేమో!