అమెరికా పోలీసుల అదుపులో లై యూనిట్

కంగారు పడాల్సిందేం లేదు. కానీ వార్త అయితే నిజమే. లై సినిమా టోటల్ యూనిట్ ను, అంటే హీరో నితిన్ తో సహా అందరినీ అమెరికా పోలీసులు కొన్ని గంటల పాటు తమ అదుపులో…

కంగారు పడాల్సిందేం లేదు. కానీ వార్త అయితే నిజమే. లై సినిమా టోటల్ యూనిట్ ను, అంటే హీరో నితిన్ తో సహా అందరినీ అమెరికా పోలీసులు కొన్ని గంటల పాటు తమ అదుపులో వుంచేసుకున్నారట. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ కథ కమామిషు ఇలా వున్నాయి.

లై సినిమా షూటింగ్ అమెరికా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ షూటింగ్ కార్యక్రమాల్లో భాగంగా ఓ సీన్ కోసం బోలెడు డమ్మీ గన్స్ వాడారట. అయితే మరి ఎందుకు వాడారో? కాస్త బాగుంది, రియలిస్టిక్ గా వుంటుందని వాడారో? అమెరికాలోని మిత్రుల దగ్గర వున్న ఓ లైసెన్స్ గన్ ను కూడా షూట్ లో వాడారట. 

అయితే అదే సమయంలో పోలీసులు షూట్ లో వున్న ఆర్మ్స్ అన్నీ కాస్త గట్టిగా చెక్ చేసారట. దాంతో ఈ విషయం బయటపడేసరికి, మొత్తం యూనిట్ ను ప్యాకప్ చెప్పి, తమ ఆఫీసుకు తీసుకుపోయారట. ఉదయం నుంచి సాయంత్రం వరకు తర్జన భర్జనలు, నచ్చ చెప్పడాలు, విషయం వివరించడం అన్నీ జరిగాక, అప్పుడు వదిలారట. 

అయినా అమెరికా సంగతి బాగా తెలిసిన నిర్మాతలు కదా? ఇలా ఎందుకు చేసినట్లో? అసలే అక్కడ వ్యవహారాలు అన్నీ స్ట్రిక్ట్ గా వుంటాయి కదా? లై సినిమా వచ్చే నెల 11న విడుదలవుతోంది. ఇప్పటికే వదిలిన టీజర్ తో ఈ సినిమాకు భయంకరమైన బజ్ వచ్చింది. త్వరలో ట్రయిలర్ కూడా బయటకు రాబోతోంది. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు. అనిల్ సుంకర నిర్మాత.