ఆంధ్రాలో ఇటీవల జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీ తరువాత టీడీపీ నాయకులు, మంత్రులు అదే పనిగా రెచ్చిపోతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే విధి నిర్వహణను పక్కకు పెట్టేసి నిరంతరం విమర్శలతోనే కాలం గడుపుతున్నారనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటి? ప్లీనరీలో వైకాపా అధినేత జగన్ చేసిన తొమ్మిది వాగ్దానాలని మీడియా నిపుణులు చెబుతున్నారు.
జగన్ అధికారంలోకి వస్తాడా? వచ్చినా ఆ వాగ్దానాలు నెరవేరుస్తాడా? అనే ప్రశ్నలకు జవాబులు చెప్పలేం. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఊహించలేం కదా. కాని జగన్ వాగ్దానాలపై టీడీపీలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం. పార్టీ ధర్మంగా తాము జగన్‌ను విమర్శిస్తున్నప్పటికీ ఆయన వాగ్దానాల గురించి చర్చించకుండా ఉండలేమని ఆఫ్ ది రికార్డుగా ఓ ఎంపీ చెప్పాడు.
జగన్ వాగ్దానాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వాటిపై జనం అవగాహన ఏమిటి? మొదలైన విషయాలు తెలుసుకునేందుకు టీడీపీ ఓ సర్వే నిర్వహిస్తుందని సమాచారం. అలాగే జగన్ వాగ్దానాలను జనం నమ్మకుండా ఉండేందుకుగాను బలమైన వ్యూహాలు రూపొందించాలని టీడీపీ భావిస్తోందట. జగన్ వాగ్దానాలపై జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగా ఇప్పుడే వాగ్దానాలు చేయాల్సిన అవసరం జగన్‌కు ఏమొచ్చిందని అధికార పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది. జగన్ వాగ్దానాలు ఊరికే చేయలేదు. ఇది వ్యూహాత్మకంగా చేసిన పనే. ఈ వాగ్దానాలు కేవలం వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినవని అనుకోలేం.
నంద్యాల ఉప ఎన్నిక జరగబోతోంది. పలు మున్సిపల్ కార్పొరేషన్లకు, మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగబోతాయి. ఈ వాగ్దానాల కారణంగా ఆ ఎన్నికల్లో వైకాపాకు అనుకూల ఫలితాలు వస్తే ఆ ప్రభావం సాధారణ ఎన్నికల మీదా పడుతుంది. ఇలాంటి వ్యూహం ఉండొచ్చు.
ఇక వైఎస్ జగన్ సలహాదారుపై ఆధారపడ్డాడని, అసమర్థుడు కాబట్టే ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకున్నాడని టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు వారికే ముప్పు కలిగించేలా ఉన్నాయి.
'పచ్చ' నాయకుల విమర్శలపై ఎదురు దాడి చేస్తున్న వైకాపా నాయకులు ప్రధాని నరేంద్ర మోదీని సీన్లోకి తీసుకొచ్చారు. గత ఎన్నికల్లో ప్రశాంత్‌ను మోదీ తన సలహాదారుగా, ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు కదా. మరి ఆయన అసమర్థుడు కాబట్టే సలహాదారును నియమించుకున్నారా? సమాధానం చెప్పండంటూ వైకాపా అడుగుతున్న ప్రశ్నకు టీడీపీ దగ్గర సమాధానం లేదు. సలహాదారును నియమించుకోవడం అసమర్థత అయితే మోదీ కూడా అసమర్థుడే కదా.
ఈ భావన బీజేపీ నాయకులకు ఆగ్రహం కలిగించకుండా ఉంటుందా? రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. టీడీపీ నాయకులు మోదీని అసమర్థుడన్నారని బీజేపీ నాయకులు (బాబు వ్యతిరేకులు) ఫీలై కేంద్ర నాయకత్వం దగ్గర ఫిర్యాదు చేసినా చేస్తారు.
ప్రభుత్వంలో అనేకమంది సమర్థులైన ఐఏఎస్ అధికారులుండగా పాలకులు రాజకీయ నాయకులనో, తమకు కావల్సివారినో సలహాదారులుగా ఎందుకు పెట్టుకుంటారు? వీరికి కేబినెట్ ర్యాంకు ఇచ్చి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.
చంద్రబాబు నాయుడు పని లేకపోయినా కన్సెల్టెన్సీలను నియమించుకొని కోట్లు వృథా చేస్తున్నారని అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. వైఎస్ జగన్ తన డబ్బుతో సలహాదారును పెట్టుకుంటే టీడీపీ నాయకులు ఎందుకు రెచ్చిపోవడం? భయం దాచుకోవడానికి వారు పడుతున్న అవస్థ ఇదని చెప్పుకోవచ్చు.