ఆర్జీవీ, అవతలవారిని ఇరుకులో పెట్టి అయినా తన పని కానిచ్చుకునే రకంలా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో కావాలనే, ఆయన త్వరపడి ప్రెస్ నోట్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ అన్న అయిడియా ఇంకా మొగ్గ దశలో వుండగానే, ఎవరి చేత డైరెక్ట్ చేయించాలన్న దానిపై ఓ నిర్ణయం ఇంకా ఫైనల్ కాకుండానే, ఆర్జీవీ తెలివిగా, బాల్ ను తన కోర్టులోకి తానే తీసుకుని, తానే బాలయ్య కోర్ట్ లోకి సెర్వ్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ తరహా గుసగుసలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ సినిమా రంగంలోకి వచ్చిన దగ్గర నుంచి సినిమారంగం నుంచి రాజకీయ రంగంలోకి వెళ్లి ముఖ్యమంత్రి అయిన వరకు ఓ పీరియడ్ గా తీసుకుని, ఆ మేరకు బయోపిక్ చేయాలన్న ఆలోచనలో బాలయ్య వున్నారు. అలా అయితే ఏ కాంట్రావర్సీలకు తావు వుండదు. కేవలం ఉజ్వలమైన ఎన్టీఆర్ సినిమా కెరీర్ మాత్రమే అందులో వుంటుంది. ఆయన చేసిన రకరకాల పాత్రలు, ఆ పాత్రలు ధరించిన సినిమాల వైనాలు, కలగలిపి, ఆ పాత్రలన్నింటిలో బాలయ్యను చూపించడం ద్వారా రెండు విధాల ప్రయోజనం సిద్ధిస్తుంది.
ఒకటి, నటుడిగా ఎన్టీఆర్ గొప్పదనం. ఇప్పట్లో అలాంటి పాత్రలు వేయడం బాలయ్యకు వీలుకాదు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ పాత్రలన్నింటిలో కనిపించవచ్చు. ఇది రెండవది. సూత్రప్రాయంగా ఇదీ అయిడియా. ఇదే పాయింట్, అయిడియా, పోర్చగల్ లో బాలయ్య కుటుంబ సభ్యులు, దర్శకుడు పూరిజగన్నాధ్ కూర్చున్నపుడు జస్ట్ కాజువల్ డిస్కషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది.
బయోపిక్ లు అంటే వర్మే అని, ఆయన బాగా డీల్ చేస్తారని తన గురువు పేరును దర్శకుడు పూరిజగన్నాధ్ ప్రస్తావనించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి బదులుగా, ‘చూద్దాం, ఓసారి కలుద్దాం’ అని మాత్రమే బాలయ్య అన్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన వర్మ, దాన్నే కన్ ఫర్మ్ చేయించేయాలని, వత్తిడి తేవాలని ప్రకటన విడుదల చేయించినట్లు తెలుస్తోంది.
అందుకే తాను చేస్తున్నానని ఎక్కడా చెప్పకుండా, 23సార్లు అడవిరాముడు చూడడం ద్వారా, మహానాడు తొలి మీటింగ్ లో పాల్గొనడం ద్వారా తనకే అర్హత వుందీ అన్నట్లు చెప్పుకువచ్చారు. ఆ లెక్కన అడవి రాముడు యాభై సార్లు చూసిన వారు, మహానాడు మీటింగ్ లే కాదు, ఎన్టీఆర్ సభలు అన్నింటికీ హాజరైన వారు ఇంకెవరైనా వుంటే తాము ఇంకా బెటర్ అని క్లెయిమ్ చేసుకోవచ్చు అని జోక్ లు వినిపిస్తున్నాయి. అది వేరే సంగతి. మొత్తం మీద ఇంకా ఏమీ అనుకోకుండానే వర్మ ప్రకటన విడుదల చేయడం పట్ల బాలయ్య కాస్త అసంతృప్తిగా వున్నట్లు తెలుస్తోంది.
పైగా వర్మ ప్రకటన తరువాత ఇండస్ట్రీ వర్గాలు, సినిమా అభిమానులు, ఎన్టీఆర్ అభిమానుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా బాలయ్యను ఆలోచనలో పడేసినట్లు వినికిడి. అందుకే లోకేష్ బాబు, డైరెక్టర్ ఎవరన్నది ఇంకా డిసైడ్ కాలేదనే బాంబు పేల్చారు. మళ్లీ అలా అంటే వర్మ ఎక్కడ, ఎవరితో అయినా త్వరపడి పావలా అర్థ రూపాయి ఖర్చుతో ఓ బయోపిక్ లాగించేస్తారో అన్న అనుమానం కూడా వుంది. అందుకే డైరక్టర్ ఎవరైనా బాలయ్యే హీరో అంటూ హింట్ ఇచ్చారు.
ఇప్పుడు ఈ చిక్కు ముడి విప్పుతారో? లేక ఆర్జీవీ చేతిలోనే ఎన్టీఆర్ బయోపిక్ ను పెట్టి, గాల్లో దీపం పెడతారో చూడాలి.