ఒక సినిమా చేసాను అన్న ఆనందం లేకుండా అయిపోయింది. హీరో బన్నీకి. దువ్వాడ జగన్నాధమ్ టాక్ ఎలా వున్నా, ఎవరు ఏమన్నా, డొమెస్టిక్ మార్కెట్ లో కమర్షియల్ సినిమా అనిపించుకుంది.
సరే, యూనిట్ వర్గాలు చెప్పిన కలెక్షన్ల వివరాలు ఎలా వున్నాయన్నది పక్కన పెడితే 70 కోట్లు ఖర్చయిన సినిమాకు 100 కోట్ల బిజినెస్ జరిగింది అంటే నిర్మాత హ్యాపీనే. ఈ వందకోట్లలో సుమారు ముఫై కోట్లకు పైగా మళ్లీ నిర్మాత స్వంత బిజినెస్ కాబట్టి, శాటిలైట్ ఇతరత్రా వ్యవహారాలు తీసేస్తే, మిగిలిన బయ్యర్లు కూడా వచ్చిన కలెక్షన్లతో హ్యాపీనే.
ఎవరు ఏమనుకున్నా నిర్మాత హ్యాపీనే.. బయ్యర్లు ఓకెనే. కానీ ఇటు బన్నీకి కానీ, అటు డైరక్టర్ హరీష్ శంకర్ కు మాత్రం ఆ హ్యాపీనెస్ లేకపోయింది. మీడియా, సోషల్ మీడియా మొత్తం ఆ ఇద్దరని ఓ రేంజ్ లో ఆడేసుకుంది? ఎక్కడ జరిగింది లోపం? ఎక్కడ వచ్చింది సమస్య? టోటల్ గా అన్ని తరహా మీడియాల్లో బన్నీ ఇంతలా టార్గెట్ కావడానికి కారణం ఏమిటి?
దీని వెనుక బన్నీ ఎదుగదల కిట్టని మరే హీరో టీమ్ అయినా వుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అలాగే బన్నీకి సోషల్ మీడియాలో పెద్దగా సపోర్ట్ లేదు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియాలో బన్నీకి పెద్దగా మద్దతు లభించకపోవడం, ఎన్టీఆర్, మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానులు వున్నంత ఏక్టివ్ గా బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో, నెట్ లో ఏక్టివ్ గా లేకపోవడం బట్టి, ఇలా అనుకోవాల్సి వచ్చింది.
నాన్నాపులి
ఒకటి రెండు సార్లు అబద్ధం చెప్పిన వాడు మూడోసారి నిజం చెప్పినా నమ్మేది వుండదు. దువ్వాడ జగన్నాథం విషయంలో అదే జరిగింది అన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మేజర్ కంప్లయింట్. సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు బ్లాక్ బస్టర్లు అనిపించడానికి చేసిన చిన్నచిన్న సవరణలు లేదా కలెక్షన్ల మతలబులే ఇప్పుడు డిజె సినిమా కలెక్షన్లను నమ్మకుండా చేసాయని సినిమా జనాలు అంటున్నారు.
టికెట్ రేట్లు పెరగడం, మల్టీ ఫ్లెక్స్ లు పెరగడం, థియేటర్ల సంఖ్య, సెలవులు ఇవన్నీ కలిసి కలెక్షన్ల ఫిగర్లు కనిపించడం విశేషం కాదనీ, కానీ అవి నిజం ఫిగర్లు కావు, ఫేక్ అన్న ఒపీనియన్ బలంగా జనంలోకి వెళ్లడం అన్నది మాత్రం బన్నీ గత సినిమాల విషయంలో చేసిన తప్పిదాలు, ఇప్పుడు రిజల్ట్ చూపించడం తప్ప వేరు కాదంటున్నారు.
హరీష్ స్పీచ్
దీనికి తోడు సినిమా విడుదలైన వెంటనే జరిగిన సక్సెస్ మీట్ లో డైరక్టర్ హరీష్ శంకర్ స్పీచ్ కూడా జనాలను బాగా రెచ్చగొట్టింది. ఇటు మీడియా జనాలు కావచ్చు, అటు నెటిజన్లు కావచ్చు, సోషల్ మీడియా ఏక్టివిస్ట్ లను కావచ్చు హరీష్ శంకర్ మాటలు కాస్త గట్టిగానే రెచ్చగొట్టాయి. అంతకు ముందే ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో హరీష్ బాగా టార్గెట్ అయ్యారు. దాని ఫలితమే ఆ స్పీచ్. కానీ ఆ స్పీచ్ ఫలితం మళ్లీ ఆ తరువాత మరింతగా కనిపించింది.
బన్నీ ప్రవర్తన
ఇటీవలి కాలంలో బన్నీ వైఖరి, మాట తీరు మారిందని, ఇండస్ట్రీలో ఆయనను దగ్గరగా చూసే వర్గాలే పేర్కొంటున్నాయి. ఎవరినీ లెక్కచేయని తనం వుండడం తప్పు కాదు. కానీ వీలయినంత ఒదిగినట్ల కనిపించడం అన్నది సినిమా సెలబ్రిటీలకు అవసరం. ఒక్క ఏడాది, ఏడాదిన్నర క్రితం ఎన్టీఆర్ మీద ఇదే పరిస్థితి వుండేది. ఎన్టీఆర్ అప్పటికీ తన సహనం ఏనాడూ కోల్పోలేదు. మాట తూలలేదు. ఓసారి ఓ మీడియాలో ఓ వార్త వచ్చింది. అది నిజం కాదు.
అదే రోజు ఆ వార్త రాసిన మీడియా వ్యక్తి ఎన్టీఆర్ కు తారసపడ్డారు. 'ఈయన మీకు తెలుసు కదా?' అని ఎవరో అంటే..' అయ్యో నాకెందుకు తెలియదు. నాకు తెలియని నా విషయాలు కూడా ఈయనే చెప్తుంటారు' అని జోకీగా అని, షేక్ హ్యాండ్ ఇచ్చారు. మళ్లీ అలాంటి వార్తలు వస్తే ఒట్టు. ఇప్పుడు ఎన్టీఆర్ నెట్ లో కానీ, మీడియాలో కానీ ఫుల్ బజ్ లో వున్నారు. రామ్ చరణ్ ఒకప్పుడు మీడియాకు టార్గెట్ గా వుండేవారు. కానీ ఆయన కూడా మీడియాతో వీలయినంత సహనంగా వుంటూ, మెల్లమెల్లగా మీడియా ఫ్రెండ్లీగా మారిపోయారు.
బన్నీ అండ్ కో వైఖరి
కానీ మీడియా పట్ల బన్నీ అండ్ కో వైఖరి వేరుగా వుంది. ఎవరికి కూడా బన్నీకి ఇలా వుండండి.. ఇలా మాట్లాడండి అని చెప్పే దగ్గరితనం లేదు. డిజె విడుదల టైమ కు అల్లు అరవింద్ కూడా దేశంలో లేరు.
ఇంక ఎవరు చెబుతారు బన్నీకి కాస్త తగ్గమనో? లేక ఇలా కాదు అలా వుండమనో? సో బన్నీ, ఎలా వుండాలని అనుకుంటున్నారో? అలాగే వున్నారు. ఆయన ఎలా వుండాలను కుంటున్నారో, ఆయన టీమ్ కూడా అలాగే వుంది. దీంతో మీడియా సంగతి ఎలా వున్నా, సోషల్ మీడియా జనాలు మాత్రం చాలా ఎగైనిస్ట్ అయిపోయారు.
సమస్య ఇప్పుడు కాదు
సరే, అదృష్టం బాగుంది. డిజె సినిమాకు ముఫై, నలభై కోట్లు హ్యాపీగా నిర్మాత జేబులోకి వెళ్లిపోయాయి. బాగానే వుంది. కానీ దీని ప్రభావం తరువాత వచ్చే సినిమాల మీద పడే ప్రమాదం వుంది. ఇప్పటి వరకు సినిమా ఏవరేజ్ అనిపించుకున్నా, బన్నీ దాన్ని లాక్కుని వెళ్లిపోతారు. కానీ డిజె విషయంలో జరిగిన వ్యవహారాల వల్ల భవిష్యత్ లో ఈ తరహా అవకాశం వుంటుందా అన్నది అనుమానం. హిట్ సినిమా వస్తే ఏ సమస్యా లేదు. ఏవరేజ్ సినిమా వస్తేనే సమస్య.
ఒంటరిగా మారుతున్న బన్నీ
బన్నీ అనుసరిస్తున్న వైఖరి వల్ల కావచ్చు, లేదా ఆయన టీమ్ అనుసరిస్తున్న వైఖరి వల్ల కావచ్చు, మెగాఫ్యాన్స్ లో బన్నీ ఒంటరి అయిపోతున్నారు. ఆయనకు అంటూ అసలు హార్డ్ కోర్ ఫ్యాన్స్ వున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ అంతా అటు చిరు-చరణ్ ఫ్యాన్స్ గా, ఇటు పవన్ ప్యాన్స్ గా, ఇలా రెండు వర్గాలుగా మారిపోయారు. బన్నీకి అంటూ ఫ్యాన్స్ బేస్ లేదా వర్గం ఏర్పాటు కాలేదు. ఇప్పుడు బన్నీ వైఖరి మార్చుకుంటే మళ్లీ ఆ రెండు వర్గాలే బన్నీని కూడా అభిమానించాల్సి వుంది.
ఇక్కడ కూడా ఎన్టీఆర్ ను ఉదాహరణగా తీసుకోవాలి. రాజకీయంగా లేదా కుటుంబంలో బాలయ్య, ఎన్టీఆర్ ఎడమొహం పెడమొహంగా వున్నా, ఫ్యాన్స్ మాత్రం బాలయ్యను అభిమానిస్తున్నారు, ఎన్టీఆర్ కు జై కొడుతున్నారు. అంతే కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బేస్ పెరుగుతూన్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది కూడా.
డ్యామేజ్ కంట్రోల్
ఇకనైనా బన్నీ తన వైఖరి మార్చుకోవాలి. పబ్లిక్ లో వున్నపుడు, తమకు ఇష్టం వున్నా, లేకున్నా, అలా వుండడం అవసరమా, కాదా అన్న మీమాంస వున్నా, తప్పదు. రాజకీయాలు, సినిమాలకు ఇది తప్పనిసరి. కానీ ఈ విషయం బన్నీకి ఒకరు చెప్పేది కాదు, ఆయన తెలుసుకోవాల్సింది.
కాదూ, వీళ్లు కాదు నా సినిమాలు చూసేది, బాగుంటే చూసేది జనాలు, బాగులేకుంటే వదిలేసేది ఆ జనాలే. అందువల్ల నేనిలాగే వుంటా? సినిమాలతోనే సమాధానం చెబుతా అనుకుంటే అది ఆయన ఇష్టం. ఎందుకంటే అన్ని సినిమాలు ఒకేలా వుండవు. ఒకేలా ఆడవు.
ఏడాది ఏణ్ణర్థం క్రితం సూపర్ లైనప్ అనుకున్న మహేష్ బాబు ఒక్క బ్రహ్మోత్సవంతో కిందకు జారిపోయాడు. రెండుమూడు ఏవరేజ్ హిట్ లతోనే ఎన్టీఆర్ టాప్ కు వెళ్లిపోయాడు. అందువల్ల మన పోకడే మనది కాదు, నలుగురితో చూసుకుంటూ పోవాల్సిన అవసరం కూడా వుందని బన్నీ గమనించాలి. లేదా, ఎంతో దూరం ప్రయాణించి, ఎన్నో విజయాలు స్వంతం చేసుకన్న అరవింద్ చెప్పాలి.
-ఆర్వీ